Begin typing your search above and press return to search.

టాలీవుడ్ గొడవలు తీర్చడానికి కొత్త కమిటీ

By:  Tupaki Desk   |   16 Sep 2018 9:01 AM GMT
టాలీవుడ్ గొడవలు తీర్చడానికి కొత్త కమిటీ
X
గత ఏడాది కాలంలో టాలీవుడ్లో ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. డ్రగ్స్ రాకెట్ బయట పడటం దగ్గర్నుంచి తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్లో నిధుల గోల్ మాల్ ఆరోపణల వరకు సినీ పరిశ్రమ ప్రతిష్టను దెబ్బ తీసిన వివాదాలు చాలానే ఉన్నాయి. శ్రీరెడ్డి గొడవ అయితే పరిశ్రమను ఎంతగా కుదిపేసిందో తెలిసిందే. ఆయా సందర్భాల్లో వివాదాల్ని పరిష్కరించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇంతకుముందైతే దాసరి నారాయణరావు ముందు పడి సమస్యల పరిష్కారానికి చొరవ చూపేవారు. ఆయనలా స్టేచర్ ఉన్నవాళ్లు తగ్గిపోయారు. అది ఉన్న వాళ్లు మాకెందుకు రిస్క్ అన్నట్లుగా ఉండిపోయారు. కొందరు ఇండస్ట్రీ పెద్దలు కొంచెం ఆలస్యంగా స్పందించారు. కొన్ని వివాదాల్లో ఇండస్ట్రీ పెద్దల కుటుంబ సభ్యుల భాగస్వామ్యం కూడా ఉండటం వల్ల కూడా అందరూ సైలెంటైపోయారు.

ఐతే సరైన నాయకత్వం లేకపోవడం వల్ల ఏ చిన్న సమస్య వచ్చినా పెద్దదైపోతుండటం.. ఇండస్ట్రీ ప్రతిష్ట దెబ్బ తింటుండటంతో పరిశ్రమ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ‘మా’ గొడవతో పరువు పోయిన నేపథ్యంలో ఇక ఇలాంటివి రిపీట్ కాకూడదన్న నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే సురేష్ బాబు.. తమ్మారెడ్డి భరద్వాజ తదితరులు కలిసి ఇలాంటి వివాదాల్ని అంతర్గతంగా పరిష్కరించడానికి ‘తెలుగు ఇండస్ట్రీ కలెక్టీవ్‌ కమిటీ’ పేరుతో ఒక కొత్త కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో సురేష్.. భరద్వాజ సహా కొందరు ప్రముఖులు ఉన్నారు. వీళ్లు ఇకపై ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా టేకప్ చేస్తారట. ఎవ్వరూ మీడియాలోకి వెళ్లకుండా.. బహిరంగ వ్యాఖ్యలు.. ఆరోపణలు చేయకుండా నిలువరిస్తారట. సమస్య ఏదైనా అంతర్గతంగా ఈ కమిటీలో చర్చించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారట. నటీనటులు.. నిర్మాతలు.. టెక్నీషియన్లు.. ఇలా ఏ విభాగానికి చెందిన వాళ్లయినా సమస్యలుంటే ఈ కమిటీ దృష్టికే తేవాలని.. అంతే తప్ప మీడియాలోకి వెళ్లి ఇండస్ట్రీ పరువు తీయకూడదని కమిటీ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. ఈ కమిటీ ముందుగా ‘మా’ వివాదాన్ని పరిష్కరించింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న మా అధ్యక్షుడు శివాజీ రాజా.. జనరల్ సెక్రటరీ నరేష్ కమిటీ జోక్యం తర్వాత రాజీకి వచ్చి కలిసి పని చేయడానికి అంగీకరించారు.