Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌ లో 'బూచోడు' కంపెనీలు

By:  Tupaki Desk   |   1 Dec 2018 2:30 PM GMT
టాలీవుడ్‌ లో బూచోడు కంపెనీలు
X
టాలీవుడ్ ఓ వింతైన ప్రపంచం. ఇక్క‌డ తాడిని త‌న్నేవాడొక‌డుంటే వాడి త‌ల‌ద‌న్నేవాడొక‌డుంటాడు. ఇదో గ్యాంబ్ల‌ర్స్ ప్ర‌పంచం.. బూచోళ్లు తిరిగే జాత‌ర ప్ర‌పంచం అంటే త‌ప్పేం కాదు. ఈ విచిత్ర ప్ర‌పంచంలో వింత వింత‌లెన్నో. ఈ రంగంలో కొంద‌రు ఎదిగే తీరు ఎంతో విభిన్నంగా ఉంటుంది. కేవ‌లం తెలివితేట‌లు - చురుకైన యాటిట్యూడ్‌ తో ఎదిగేవాళ్లు కొంద‌రుంటే - అదృష్టం క‌లిసొచ్చి - ప్లాన్ వ‌ర్క‌వుటై కొంద‌రు... బ్రిటానియా బిస్కెట్లు తినిపించి.. గ‌జ‌క‌ర్ణ గోక‌ర్ణ విద్య‌లు ప్ర‌ద‌ర్శించి ఎదిగేసే వాళ్లు మ‌రికొంద‌రు ఇక్క‌డ క‌నిపిస్తుంటారు.

కొంద‌రైతే మ‌రీ విచిత్రంగా ఉంటుంది. వీళ్లు అస‌లు జేబులోంచి రూపాయి అయినా తీయ‌రు. కానీ సినిమాలు తీస్తున్నామంటూ ఎఫ్ ఎన్‌ సీసీ - ఫిలించాంబ‌ర్‌ లో చ‌క్క‌ర్లు కొడుతుంటారు. అస‌లు వీళ్లు సొంతంగా డ‌బ్బు పెట్టి సినిమాలు తీస్తున్న‌ట్టే ప్ర‌క‌ట‌న అనేదే ఉండ‌దు. కానీ నిర్మాత‌లుగా హోదాల్ని అనుభ‌విస్తుంటారు. ఎఫ్ ఎన్‌ సీసీలో ఫెసిలిటీస్ అనుభ‌విస్తుంటారు. అస‌లు వీళ్ల స్ట్రాట‌జీ ఏంటో అని క‌నుక్కుంటే అందులో షాకిచ్చే నిజాలే తెలుస్తుంటాయి. అణా పైసా పెట్టకుండానే సినిమాలు తీస్తున్నామ‌ని క‌ల‌రింగ్ ఇస్తుంటారు. అందుకు ఈ రంగంలోకి వ‌చ్చే కొత్త వాళ్ల‌కు వ‌ల‌లు వేసి వాళ్ల‌ను బుట్ట‌లో వేసి తెలివిగా వారి సినిమాల్ని రిలీజ్ చేయించి - త‌మ పేర్లు స‌మ‌ర్ప‌కుడు అని వేయించుకునే బాప‌తు చాలామంది ఉన్నారు. వీళ్లు టాలీవుడ్‌ లో - పంపిణీ వ‌ర్గంలో త‌మ‌కు ఉన్న ప‌రిచ‌యాల ఆధారంగా పావులు క‌దిపి బిజినెస్ స‌జావుగా సాగేందుకు అభం శుభం తెలియ‌ని కొత్త‌వాళ్ల‌కు సాయ‌ప‌డ‌తారు. అలా సాయం చేసినందుకు స‌మ‌ర్ప‌కుడు అన్న‌ పేరు వేయించుకుని బాగా దండుకుంటారు. అయితే ఇలాంటి ఎత్తుగ‌డ‌లు కేవ‌లం చిన్న బ‌డ్జెట్ కోటి- 2కోట్ల లోపు సినిమాల వ‌ర‌కే వ‌ర్క‌వుట‌వుతుంది. కొన్ని పెద్ద సినిమాల్ని రిలీజ్ చేయించే ఈ బాప‌తు పెద్ద మ‌నుషులు మాత్రం కొంత మేర పెట్టుబ‌డుల్ని స‌మ‌కూరుస్తుంటారు.

సినిమా తీయాల‌ని క‌ల‌లుగంటూ రంగుల ప్ర‌పంచంలోకి అడుగుపెట్టేవాళ్లెంద‌రో ఉంటారు. అందులో ఔత్సాహిక న‌టీన‌టులు - యువ‌ద‌ర్శ‌క నిర్మాత‌లు ఉంటారు. వీళ్లు ఏదీ తెలియ‌కుండానే సినిమా మొద‌లు పెట్టేస్తారు. తీరా సినిమా పూర్త‌యి రిలీజ్‌ కి వ‌చ్చేప్ప‌టికి ఏం చేయాలి? ఎలా చేయాలి? అన్న‌ది తెలియ‌క తిరిగి బూచాళ్ల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. అలాంటి అవ‌కాశం వ‌స్తే సినిమాలో మ్యాట‌ర్ ఉంటే దానిపై క‌ర్ఛీఫ్ వేసి రిలీజ్ చేసే సాయం పేరుతోఈ బూచీగాళ్లు బాగానే దండుకుంటారు. ఈ బాప‌తులో ఇదివ‌ర‌కూ చాలా చిన్న సినిమాలు రిలీజ‌య్యాయి. కొన్ని హిట్ల‌య్యి రిలీజ్ సాయం చేసిన‌ బూచోడికి ఆదాయం తెస్తే - ఒరిజిన‌ల్‌గా డ‌బ్బు పెట్టి సినిమా తీసినోడు నెత్తిన చెంగేసుకుపోయిన సంద‌ర్భాలున్నాయి. కొంద‌రు ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్‌ కి సినిమా తీయ‌డానికి డ‌బ్బు ఉంటుంది. ముందు సినిమా తీసేస్తారు. తీరా ప్ర‌మోష‌న్ వ‌ర‌కూ వ‌చ్చాక అస‌లు జేబు గుల్ల అయిపోతుంది. అప్పుడు ఎంట్రీ ఇస్తారు కొంద‌రు బూచోళ్లు. వీళ్లు మ‌హా ఘ‌రానా బూచోళ్లు. ప‌బ్లిసిటీ మేం చూస్కుంటాం. నువ్వు ఖ‌ర్చు పెట్టిన‌దానికి రెట్టింపు పెట్టి ప్ర‌చారం చేసి సినిమాని అమ్మేస్తామ‌ని న‌మ్మ‌బ‌లుకుతారు. ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతోందో అర్థ‌మ‌య్యే లోపే ఆ సినిమా రిలీజై గోల్ మాల్ అయిపోతుంది. రంగుల ప్ర‌పంచంలో అడుగుపెట్టే ముందు బేసిక్స్అయినా తెలుసుకోకుండా వ‌చ్చే వారి వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌కు వాటిల్లుతున్న ముప్పు ఇది. ఇక‌నైనా ఇలా బూచాళ్ల బారిన ప‌డ‌కుండా స‌ద‌రు ఔత్సాహిక మేక‌ర్స్ మారాల‌ని స‌ర్వం తెలుసుకునే రావాల‌ని ఆశిద్దాం.