Begin typing your search above and press return to search.

`మా`లో మ‌రో లొల్లు ఏంటో!

By:  Tupaki Desk   |   16 April 2019 7:20 AM GMT
`మా`లో మ‌రో లొల్లు ఏంటో!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిల్లో హోరాహోరీ గురించి తెలిసిందే. సీనియ‌ర్ న‌రేష్ ప్యానెల్ .. శివాజీ రాజా ప్యానెల్ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌ల‌కు దిగ‌డ‌మే గాక పోటాపోటీగా ప్ర‌చారం సాగించారు. చివ‌రికి అధ్య‌క్షుడిగా గెలిచిన న‌రేష్ కుర్చీ ద‌క్కించుకున్నారు. అయితే ప్ర‌మాణ స్వీకారం రోజునే కొత్త సంఘంలో చీలిక గురించి చ‌ర్చ సాగింది. న‌రేష్ పోక‌డ ఇత‌ర క‌మిటీ స‌భ్యుల‌కు రుచించ‌లేదు. అంత‌కుముందే మాజీ అధ్య‌క్షుడు శివాజీ రాజాతోనూ న‌రేష్ విభేధించారు. దీంతో ఆర్టిస్టుల సంఘం వ‌ర్గాలుగా విడిపోయి రాజ‌కీయాలు చేయ‌డంపైనా.. ఒక‌టిగా లేక‌పోవ‌డంపైనా తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ వ‌ర్గ పోరాటం వ‌ల్ల `మా`లో జ‌రగాల్సిన ప‌నులు జ‌ర‌గ‌డం లేదని విమ‌ర్శ‌లొస్తున్నాయి. ప్ర‌స్తుతం మా సొంత భ‌వంతి క‌ల నెర‌వేరుతుందా? నెర‌వేర‌దా? అంటూ ఫిలింన‌గ‌ర్ లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

దాదాపు 85ఏళ్లు పైగా చ‌రిత్ర ఉన్న టాలీవుడ్ లో అతి పెద్ద సంస్థ‌గా ఉన్న మూవీ ఆర్టిస్టుల సంఘానికి సొంతంగా బిల్డింగ్ లేక‌పోవ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు ఉన్నాయి. గ‌త అధ్య‌క్షులు ప‌ట్టించుకోక‌పోవ‌డంపైనా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ స‌న్నివేశంలోనే మా సొంత బిల్డింగ్ గురించి గ‌త అధ్య‌క్షుడు శివాజీ రాజా కొంత‌వ‌ర‌కూ ప్ర‌య‌త్నించారు. ప్ర‌స్తుతం న‌రేష్ అధ్య‌క్ష‌త‌న‌ మ‌రోసారి మా సొంత బిల్డింగ్ గురించిన‌ ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. అయితే సొంతంగా భ‌వంతిని నిర్మించాలంటే స్థ‌లం కావాలి. భారీగా నిధి కావాలి. పెట్టుబ‌డుల కోసం ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మాలు చేయాలి. హైద‌రాబాద్ లో స్థ‌లం ఖ‌రీదు ఎక్కువ కాబ‌ట్టి.. దానికోసం తెరాస ప్ర‌భుత్వాన్ని సాయం కోరేందుకు ప్లాన్ చేశార‌ట‌.

అయితే ఇక్క‌డే వ‌చ్చిందో చిక్కు. ప్ర‌భుత్వ పెద్ద‌ల్ని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు తొలుత తెరాస ప్ర‌భుత్వంపై ప్ర‌క‌ట‌న‌లు రూపొందించార‌ట‌. దానికి జీవిత రాజ‌శేఖ‌ర్ కుమార్తె సొంతంగా రూ.10ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశార‌ని తెలుస్తోంది. అయితే ఆ సొమ్ముల్ని మూవీ ఆర్టిస్టుల సంఘం నిధి నుంచి తిరిగి త‌న ఖాతాకు బ‌ద‌లాయించార‌ట‌. దాంతో కొత్త వివాదం చెల‌రేగుతోంద‌ట‌. ఆర్టిస్టుల‌కు చెందిన సొమ్ముల్ని అలా ఒక వ్య‌క్తికి ఎలా బ‌ద‌లాయిస్తారు? అవి ఖ‌ర్చు చేయాల్సింది స‌భ్యుల కోసం క‌దా? అయినా ప్ర‌క‌ట‌న‌ల్ని నేరుగా మా క‌మిటీ సార‌థ్యంలో రూపొందించ‌కుండా థ‌ర్డ్ పార్టీకి ఎందుకిచ్చార‌ని కొత్త పాయింట్ ని లేవ‌నెత్తుతున్నార‌ట‌. ఇది మ‌రోసారి వివాదానికి తావిస్తోంద‌ని చెబుతున్నారు. అస‌లే కొత్త అధ్య‌క్షుడు న‌రేష్.. మాజీ అధ్య‌క్షుడు శివాజీ రాజా ఒక‌రిపై ఒక‌రు ఏ అవ‌కాశం దొరికినా కాలు దువ్వుతున్నారు. అయిన దానికి కాని దానికి మీడియాకెక్కి నానా ర‌చ్చ చేస్తున్నారు. అంత‌ర్గ‌తంగా ప‌రిష్క‌రించుకోవాల్సిన స‌మ‌స్య‌ల్ని ప‌బ్లిక్ వేదిక‌ల‌కు ఎక్కి నానా యాగీ చేయ‌డంపైనా తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మా క‌ల‌హాల కాపురంపై వేడెక్కించే చ‌ర్చ సాగుతోంది. క‌లిసి ఉంటే క‌ల‌దు సుఖం! అన్న తీరుగా ఉండ‌డం లేదు కాబ‌ట్టి ప్ర‌తి చిన్న విష‌యాన్ని పెద్ద‌దిగా భూత‌ద్దంలో పెట్టేస్తూ మీడియా ముందు ర‌చ్చ చేస్తున్నారు.

రాజ‌ధాని న‌డి బొడ్డున 200 గ‌జాలు కొనాల‌న్నా కోటి ఖ‌ర్చు చేయాలి. `మా` అధికారిక భ‌వంతికి కాస్త పెద్ద స్థ‌ల‌మే అవ‌స‌రం అవుతుంది కాబ‌ట్టి ప్ర‌భుత్వ సాయం కోర‌డం త‌ప్పు కాదు. అయితే దానిని ఎలాంటి విమ‌ర్శ‌ల‌కు తావివ్వ‌ని రీతిలో సాధించుకోవాలి కానీ ఇలా దొరికిపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు. మ‌రి ఇంట‌ర్న‌ల్ వ్య‌వ‌హారాల్ని చక్క‌దిద్దుకుని ఆర్టిస్టుల సంఘం సొంత భ‌వంతిని నిర్మించేందుకు ఏదీ చేయ‌రా? అస‌లేం జ‌రుగుతోంది? అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.