Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీలో అభిమానం పేరుతో కొత్త పోకడలు..!

By:  Tupaki Desk   |   26 Jun 2021 3:30 PM GMT
ఇండస్ట్రీలో అభిమానం పేరుతో కొత్త పోకడలు..!
X
సినీ తారలపై అభిమానం అనేది మాములే. ఎందుకంటే వారిని నటనపరంగా ఆకట్టుకుంటున్నందుకు అభిమానించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. కొన్నిసార్లు ఆ అభిమానం కూడా శృతిమించుతోందని అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా అభిమానం అనే పిచ్చితో ఉంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ విషయంలో హీరోయిన్స్ కోసం అంతలా రియాక్ట్ అవ్వని వారు హీరోలకోసం ఏకంగా కొట్టేసుకుంటారు. ఒక్కోసారి చంపుకునే స్థాయిలో రియాక్ట్ అవుతారు. ఇండస్ట్రీలో హీరోయిన్లను కేవలం చూడటానికి మాత్రమే అభిమానిస్తారు ఫ్యాన్స్.

కానీ హీరోల విషయానికి వచ్చేసరికి చూడటమే కాదు ఏకంగా కలవడానికి కూడా వెనకాడరు. అది ఒక ఆడియో లాంచ్ ప్రోగ్రాం.. షాపింగ్ మాల్ ఓపెనింగ్.. షూటింగ్ స్పాట్.. లేదా నేరుగా వారి ఇల్లు అయ్యుండొచ్చు. ఎక్కడపడితే అక్కడే హీరోలను కలిసేందుకు ట్రై చేస్తుంటారు. వాటిలో ఎక్కడైనా ఓకే కానీ సరాసరి ఇంటికి వెళ్లిపోవడం ఏంటి.. అదికూడా పని మానుకొని ఎక్కడో మారుమూల ప్రాంతం.. గ్రామాల నుండి సిటీకి బయలుదేరి వెళ్లడం అనేది మరీ వెర్రిలా అనిపించడం లేదా అంటున్నాయి సినీవర్గాలు. అందులోను హీరోలు రియాక్ట్ అవ్వడం కూడా ఆశ్చర్యంగానే ఉంది.

అంటే ఎక్కడో మారుమూల గ్రామాల నుండి వారిని కలవడానికి వచ్చారని తెలియగానే నేరుగా ఇంటికి పిలిచి మరీ కలుస్తున్నారు. అలాగే వారితో ఫోటోలు దిగుతూ.. ఆర్థికంగా ఏదైనా సమస్యలో ఉన్నారంటే మనీ హెల్ప్ కూడా చేస్తున్నట్లు కథనాలు చెబుతున్నాయి. మరి ఆడియో లాంచ్ లలో.. వేరే ప్రోగ్రాంలలో కలవడానికి వచ్చేవారి గురించి పక్కనపెడితే.. ఇలా నేరుగా తిరుపతి కాలినడకన వెళ్లిన వారికీ డైరెక్ట్ దర్శనం అన్నట్టుగా అభిమానం అనే పిచ్చితో నడుచుకుంటూ వెళ్ళగానే హీరోలు కూడా స్వాగటించి నేరుగా కలవడం అనేది కొత్త పోకడకు దారి తీస్తున్నట్లే అనిపిస్తుందని ఇండస్ట్రీ టాక్. అసలు సినీ హీరోకోసం విలేజ్ నుండి నడుచుకుంటూ వెళ్లడం ఏంటి.. కనీసం దేవాలయాల మొక్కులకైనా ఇలా వెళ్తారో లేదో కానీ హీరోలనే దేవుళ్ళుగా.. వారి ఇళ్లనే దేవాలయాలుగా భావించేస్తున్నారు అనుకోవాలి కాబోలు. ఈ కాలినడకన వెళ్లి హీరోలను కలవడం అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో చర్చనీయంశంగా మారింది.