Begin typing your search above and press return to search.

నటి చౌరాసియా దాడి కేసులో కొత్త కోణం .. ఆ 4 గంటలపాటు నిందుతుడు ఏంచేశాడు ?

By:  Tupaki Desk   |   17 Nov 2021 1:30 PM GMT
నటి చౌరాసియా దాడి కేసులో కొత్త కోణం .. ఆ 4 గంటలపాటు నిందుతుడు ఏంచేశాడు ?
X
బంజారాహిల్స్ ‍లోని కేబీఆర్‌ పార్కువద్ద సంచలనం సృష్టించిన సినీనటి షాలూ చౌరాసియాపై దాడి ఘటనలో నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్‍ పోలీసులతో పాటు టాస్క్‌ ఫోర్స్‍ బృందాలు నిందితుడి కోసం వేట కొనసాగిస్తున్నాయి. ఆదివారం రాత్రి 8.45 ప్రాంతంలో కేబీఆర్‌ పార్క్‍ బయట వాక్‌ వే లో వాకింగ్‌ చేస్తున్న నటి షాలూ చౌరాసియా మీద గుర్తు తెలియన దుండగుడు దాడి చేయడంతో పాటు ఆమె సెల్‌ ఫోన్‌ ను లాక్కుని పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినీనటిపై దాడి ఘటనలో నిందితులను త్వరగా పట్టుకోవాలని నగర పోలీస్ క‌మిషనర్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

చౌరాసియా మీద దాడికి పాల్పడిన వ్యక్తి ఎవరయి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. చీకటి ప్రాంతంలో ఒంటరిగా యువతి కనిపించడంతో కేవలం ఆభరణాలు, నగదు, సెల్‌ఫోన్‌ కోసమే దాడి చేశారా, లేక ఎవరైనా తెలిసిన వారే ఆమె కదలికలపై రెక్కీ నిర్వహించి దాడి చేశారా.. అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేబీఆర్‌ పార్కు చుట్టుపక్కల సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో బయట రోడ్డుమీద ఉన్న ఎల్‌అండ్‌టీ కెమెరాలు, వాణిజ్య సముదాయాల కెమెరాల్లో ఫుటేజీతో పాటు సెల్‌ ఫోన్‌ సిగ్నళ్లే ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే నటి షాలూ చౌరాసియాను కలిసిన పోలీసులు దుండగుడి ఆనవాళ్లను అడిగి తెలుసుకుని ఊహాచిత్రాన్ని గీయించే పనిలో నిమగ్నమయినట్లు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 8.40 గంటల సమయంలో వాకింగ్‌ చేస్తున్న షాలూను కొంతదూరం ఫాలో అయ్యాడు. ఆ తర్వాత జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 92లోని స్టార్‌బక్స్‌ ఎదురుగా నిర్మానుష్య ప్రాంతం వద్ద దాడికి దిగాడు. దీంతో ఆమె కేకలు పెట్టకుండా నోటికి గుడ్డలు అడ్డుపెట్టి.. పక్కనే ఉన్న బండరాయికి అదిమిపెట్టాడు. దీంతో వెంటనే నటి అతడ్ని బలంగా ప్రతిఘటించి.. పక్కనే ఉన్న గేటు వైపు పరిగెత్తింది. స్టార్‌ బక్స్‌ వద్ద పనిచేస్తున్న కొందరు డ్రైవర్ల సాయంతో జరిగిన విషయాన్ని తల్లికి ఫోన్‌ చేసి చెప్పింది. స్థానికులు డయల్‌ 100కు ఫోన్‌ చేయగా, బంజారాహిల్స్‌ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

దాడి అనంతరం ఫోన్‌ లాక్కున్న దుండగుడు అక్కడి నుంచి నేరుగా వాక్‌ వే లో నడుచుకుంటూనే సీవీఆర్‌ న్యూస్, జర్నలిస్టు కాలనీ, బాలకృష్ణ నివాసం వరకు వెళ్లాడు. బాలకృష్ణ ఇంటి వద్ద గేటులో నుంచి బయటికి వచ్చి ఫుట్‌ పాత్‌ మీదుగా జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్టు, కేబీఆర్‌ పార్కు వైపు నడక సాగించాడు. నెక్సా షోరూం ఎదురుగా ఉన్న కేబీఆర్‌ పార్కు జీహెచ్‌ ఎంసీ వాక్‌ వే పార్కింగ్‌స్థలంలో చిచ్చాస్‌ హోటల్‌ వద్దకు ఒంటిగంటకు చేరుకున్నాడు ఆ హోటల్‌ వద్ద అర్ధరాత్రి ఒంటిగంటకు ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసినట్లుగా టవర్‌ సిగ్నల్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. రాత్రి 9 గంటలకు నటిపై దాడి చేసిన అనంతరం నిందితుడు నాలుగు గంటల పాటు ఆ పరిసర ప్రాంతాల్లానే తచ్చాడినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫోన్‌ కాల్‌ డేటా పరిశీలించగా 9 గంటల ప్రాంతంలో ఆమె డయల్‌ 100కు ఫోన్‌ చేసినట్లు గుర్తించారు. సమీపంలో ఉన్న మైలాన్‌ ల్యాబ్‌ సెల్‌ టవర్‌ ఈ సిగ్నల్‌ ను బహిర్గతం చేసింది. నిందితుడు నాలుగు గంటల పాటు అదే ప్రాంతంలో ఎలా తిరిగాడదన్నది అంతుచిక్కని విషయంగా మారింది.