Begin typing your search above and press return to search.

జనవరి 1... తలరాతలు మార్చే రోజు

By:  Tupaki Desk   |   30 Dec 2015 5:30 PM GMT
జనవరి 1... తలరాతలు మార్చే రోజు
X
జనవరి 1.. మొత్తం ఏడాదిలో ఎంతో ఆశావహంగా కనిపించే రోజు. ఎన్నో కొత్త ఆశలతో కొత్త ఏడాదిలో అడుగుపెడతాం ఆ రోజు. ఈసారి కొందరు సినీ జనాలు సైతం ఎన్నో ఆశలతో జనవరి 1న బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఆ రోజున మూడు పేరున్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఈ మూడు సినిమాలకు సంబంధించిన వ్యక్తులు ఫెయిల్యూర్లలో ఉండటం.. తమ కొత్త సినిమాలపై ఎన్నో ఆశలతో ఉండటం.. తమ తలరాతల్ని ఈ సినిమాలు మార్చేస్తాయని ఆశిస్తుండటం విశేషం.

జనవరి 1న రాబోయే సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది రామ్ మూవీ ‘నేను శైలజ’ గురించి. వరుస ఫ్లాపులు.. పైగా రొటీన్ సినిమాలు చేస్తున్నాడన్న విమర్శలు.. ఈ పరిస్థితుల్లో ‘నేను శైలజ’ లాంటి కాస్త భిన్నమైన సినిమా చేశాడు రామ్. ట్రైలర్ చూస్తే మామూలుగా రామ్ సినిమాల్లో కనిపించే అతి వేషాలు.. రొటీన్ సన్నివేశాలు కనిపించలేదు. సినిమా రిఫ్రెషింగ్‌ గా అనిపించింది. ఈ సినిమా తనకు విజయాన్నందించడంతో పాటు భిన్నమైన సినిమాలు చేయనన్న అపప్రదను కూడా తొలగిస్తుందని రామ్ ఆశిస్తున్నాడు.

ఇక రెండో సినిమా.. కిల్లింగ్ వీరప్పన్. వర్మ తన స్థాయికి తగ్గ సినిమా తీసి చాలా కాలమైంది. ఆయన సినిమాల్ని జనాలు పట్టించుకోవడం మానేశారు ఈ మధ్య. ఈ పరిస్థితుల్లో వర్మ అంటే ఏంటో చూపించే సినిమా ‘కిల్లింగ్ వీరప్పన్’ అవుతుందని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. ట్రైలర్ చూస్తే సామాన్య ప్రేక్షకులకు కూడా అదే ఫీలింగ్ కలిగించింది. ఇక మూడో సినిమా.. ‘అబ్బాయితో అమ్మాయి’ హీరో నాగశౌర్యకు, దర్శకుడు రమేష్ వర్మకు చాలా కీలకం. వీళ్లిద్దరి చివరి సినిమాలు దారుణమైన ఫలితాన్నిచ్చాయి. ఈ నేపథ్యంలో ‘అబ్బాయితో అమ్మాయి’ మళ్లీ తమను ట్రాక్ మీదికి తెస్తుందని వాళ్లిద్దరూ ఆశిస్తున్నారు. మరి ఈ మూడు సినిమాల్లో ఏవి ఎలాంటి ఫలితాల్ని అందుకుంటాయో చూడాలి.