Begin typing your search above and press return to search.

నల్లగా ఉన్నానని చాలామంది అవమానించారు: రాధిక

By:  Tupaki Desk   |   4 April 2022 11:30 PM GMT
నల్లగా ఉన్నానని చాలామంది అవమానించారు: రాధిక
X
తెలుగులో ఒక వైపున అమాయకురాలైన పల్లెటూరి అమ్మాయి పాత్రల్లోనూ .. మరో వైపున రెబల్ పాత్రలలోను రాధిక ప్రేక్షకులను మెప్పించారు. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ సినిమాలలో తన సత్తా చాటిన రాధిక, తెలుగులోనూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం ఒక్క తెలుగులోనే ఆమె 150 సినిమాల వరకూ చేశారు. అప్పటి స్టార్ హీరోలందరితోను కలిసి ఆమె నటించారు. నాయిక ప్రధానమైన పాత్రలతోను ఆకట్టుకున్నారు. అలాంటి రాధిక 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' ద్వారా తన మనోభావాలను పంచుకున్నారు.

" అప్పట్లో ఇన్నోసెంట్ పాత్రలు చేయాలంటే ఫలానా హీరోయిన్ అయితే బాగుంటుందని అనుకునేవారు. అలాగే స్ట్రాంగ్ కేరక్టర్ అయితే జయసుధను అనుకునేవారు. గ్లామరస్ పాత్రల విషయానికి వస్తే శ్రీదేవి .. జయప్రదలను పిలిచేవారు.
అలా ముందుగానే పాత్రల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేవారు. అది గమనించిన నేను ఆల్ రౌండర్ అనిపించుకోవాలని నిర్ణయించుకున్నాను. అలాంటి పాత్రలనే ఎంచుకుంటూ వెళ్లాను. నాపై నేను కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ వెళ్లాను.

ఎందుకంటే కెరియర్ తొలినాళ్లలో నల్లగా ఉన్నానని చెప్పేసి నన్ను చాలామంది అవమానించారు. 'ఈ అమ్మాయి ఓ మూడేళ్లకి మించి ఉండదండీ' అంటూ చాలామంది నన్ను నిరుత్సాహ పరిచారు. అప్పట్లో కలర్ అనేది చాలా పెద్ద విషయం. 'తెల్లగా లేదండీ .. కాస్త తెల్లగా ఉంటే బాగుండేది' అనేవారు. 'అబ్బే .. గ్లామరస్ గా లేదండీ .. ఈ ఒక్క పిక్చర్ కి ఓకే' అని ఒక పెద్ద బ్యానర్ కి చెందిన నిర్మాత అన్నారు. ఆ తరువాత ఆ బ్యానర్లో 6 సినిమాలు చేశాను. నేను ఇండస్ట్రీలో ఎంతకాలం ఉండాలి .. ఎన్ని సినిమాలు చేయగలను అనేది వాళ్లే డిసైడ్ చేస్తున్నట్టు మాట్లాడేవారు.

ఆ మాటలు విన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగేది. నా కెరియర్ ను జడ్జ్ చేయడానికి వీళ్లంతా ఎవరూ? అనిపించేది. అప్పట్లో హీరోయిన్స్ ప్రేమలో పడితే కెరియర్ ఫినిష్ అయినట్టే. పెళ్లి చేసుకుంటే ఆమె చనిపోయినట్టే .. పిల్లలు పుడితే అక్కడితో ఆమె కథ కంప్లీట్ అయినట్టే. కానీ నేను మాత్రం నాకు పెళ్లయిన తరువాత .. పిల్లలు పుట్టిన తరువాత హీరోయిన్ గా ఎదుగుతూ వచ్చాను. ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వెళ్లాను. ఇక చిరంజీవి గారికీ .. రజినీకాంత్ గారికి తల్లిపాత్రలు వేయమంటారని నాకు తెలుసు. నా కెరియర్ నా చేతుల్లో ఉండాలనే ఉద్దేశంతోనే 'రాడాన్' బ్యానర్ ను స్థాపించాను" అని చెప్పుకొచ్చారు.