Begin typing your search above and press return to search.

బయోపిక్ లు తీయడం అంత వీజీ కాదు బాసూ!

By:  Tupaki Desk   |   23 March 2022 12:30 AM GMT
బయోపిక్ లు తీయడం అంత వీజీ కాదు బాసూ!
X
సినిమా కోసం ఎలాంటి కథా వస్తువును తీసుకున్నప్పటికీ దాని ప్రధానమైన ఉద్దేశం వినోదాన్ని అందించడమే. కేవలం సందేశాన్ని అందించడానికి అయితే డాక్యుమెంటరీలు చేసుకోవచ్చు. అదే కమర్షియల్ విస్తరిలో ఆ కథను ఉంచుతున్నప్పుడు అందుకు తగిన విధానంగానే దానిని తయారు చేసుకోవడం తెలియాలి. ఒక కథను కల్పించి ఆ ఊహా సామ్రాజ్యంలో ప్రేక్షకులు విహరించేలా చేయవచ్చు. కానీ అదే బయోపిక్ నుగానీ .. చారిత్రక కథను గాని తీసుకుంటే కొన్ని దార్లను ముందుగానే మూసేసుకోవలసి వస్తుంది.

చారిత్రక సినిమాల్లో గానీ .. బయోపిక్ లలో గాని కామెడీని .. రొమాన్స్ ను టచ్ చేయడం చాలా కష్టం. అలాగే రొమాంటిక్ సాంగ్స్ కి కూడా దూరంగా ఉండవలసి వస్తుంది. ఒకవేళ చారిత్రక చిత్రాలలో సున్నితమైన రొమాన్స్ ను పెడదామని అనుకుంటే అది ఏ స్థాయిలో ఉండాలో .. ఎక్కడ పడాలో తెలియాలి. నయనతార .. తమన్నాలతో కూడిన చిరంజీవి ట్రాక్ ను రసవత్తరంగా నడిపించలేకపోయారు. 'సైరా' నిరాశ పరచడానికి ఇది ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. అప్పుటివరకూ యంగ్ స్టార్ హీరోలతో మాత్రమే సినిమలు చేస్తూ వచ్చిన సురేందర్ రెడ్డి, మెగాస్టార్ ను హ్యాండిల్ చేయలేకపోయాడు.

గుణశేఖర్ కూడా 'రుద్రమదేవి' విషయంలో ఇదే పొరపాటు చేసినట్టుగా కనిపిస్తుంది. అనుష్క .. రానా .. అల్లు అర్జున్ .. కృష్ణంరాజు వంటి స్టార్స్ ను ఆయన హ్యాండిల్ చేయలేకపోయారు. ఏ పాత్రను ఎలా డిజైన్ చేయాలి? సినిమాకి కావాల్సినట్టుగా ఆ పాత్రలను ఎలా ప్రెజెంట్ చేయాలి? అనే విషయంపై ఆయన దృష్టి పెట్టని కారణంగా ఆశించిన స్థాయిని ఆ సినిమా అందుకోలేకపోయింది. 'బాహుబలి'లో రానా క్రేజ్ ఒక రేంజ్ కి వెళ్లగా, 'రుద్రమదేవి'లో ఆయన పాత్ర తేలిపోవడమే అందుకు నిదర్శనం. ఆయన పాత్రను హైలైట్ చేసి ఉంటే ఆ సినిమా మరో స్థాయికి వెళ్లేది.

ఇక సముద్రాన్ని దోసిట్లో పట్టే ప్రయత్నాలు ఎప్పుడూ ఎవరూ చేయకూడదు అనే నిరూపించేవిగా ఎన్టీఆర్ .. జయలలిత బయోపిక్ లు కనిపిస్తాయి. ఎన్టీ రామారావు జీవితంలోని మలుపులు .. గెలుపులు ఒక నిడివిలో చెప్పుకోవడం కష్టం. అది ఎంతో ఖర్చుతో .. సమయంతో కూడుకున్న పని. అలాంటి పనిని హడావిడిగా చేసేస్తే ఫలితం ఎలా ఉంటుందనడానికి నిదర్శనమే క్రిష్ - బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన 'కథానాయకుడు' .. 'మహానాయకుడు'. ఇక జయలలిత బయోపిక్ కి కూడా దీనినే అన్వయించుకోవాలి.

జయలలిత పాత్రకి కంగనాను ఎంచుకోవడమే దర్శకుడు ఎ.ఎల్. చేసిన మొదటి తప్పు. జయలలిత జీవితాన్ని 3 గంటల్లో చెప్పేద్దామనుకోవడం రెండో తప్పు. సమయం .. ఖర్చు కావలసినంత కేటాయించలేనప్పుడు, వాస్తవ కథలకు కమర్షియల్ అంశాలను ఎక్కడ ఎంత మోతాదులో జోడించాలనే విషయంపై పూర్తి అవగాహన లేనప్పుడు, వాటికి కాస్త దూరంగా ఉండటమే మంచిదనే సత్యాన్ని ఈ సినిమాలు నిరూపించాయి.