Begin typing your search above and press return to search.

చిరు, బాలయ్య కి సమస్య.. రవితేజకు ఏం లేదు

By:  Tupaki Desk   |   30 March 2022 12:30 AM GMT
చిరు, బాలయ్య కి సమస్య.. రవితేజకు ఏం లేదు
X
ఆరు పదుల వయసు దాటిన హీరోలు.. ఆరు పదుల వయసుకు చేరువ అయిన హీరోలు టాలీవుడ్‌ లో చాలా మంది ఉన్నారు. వారు అభిమానుల డిమాండ్‌ మేరకు ఇంకా రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రాల్లో నటిస్తూ.. లవ్‌ సన్నివేశాల్లో అదరగొడుతున్నారు. ఆ హీరోలు రొమాన్స్ కు లవ్‌ సన్నివేశాలకు ఇబ్బంది లేదు కాని ఆ హీరోలతో చేసేందుకు హీరోయిన్స్ పెద్ద సమస్యగా మారింది. బాలకృష్ణ సినిమా ఏదైనా మొదలు పెడుతున్నాడు అంటూ హీరోయిన్ సమస్య షురూ.

బాలయ్య తో సినిమా చేయాలనుకున్న దర్శకుడు కథ కోసం.. స్క్రిప్ట్ కోసం ఎంతగా కష్టపడాలో హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా అంతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది చాలా సంవత్సరాలుగా మీడియాలో చూస్తూనే ఉన్నాం. చిరంజీవి మరియు ఇతర సీనియర్ హీరోల పరిస్థితి కూడా అదే అనడంలో సందేహం లేదు. వారితో కొత్త అమ్మాయిలను హీరోయిన్స్ గా నటింపజేయాలంటే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది.. పాత వారిని చేయిస్తే ఫ్యాన్స్ తో గొడవ.

అందుకే చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్ సీనియర్‌ హీరోలతో సినిమా సమయంలో హీరోయిన్‌ విషయంలో పిల్లి మొగ్గలు వేసిన సందర్బాలు చాలా ఉన్నాయి. అయితే రవితేజకు ఆ సమస్య ఏం లేదు. సీనియర్‌ హీరోలకు కాస్త తక్కువ వయసు అయినా కూడా రవితేజ వయసు చిన్నదేం కాదు. అయిదు పదుల వయసు దాటిన రవితేజ ఇప్పుడు వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ఆ సినిమాల్లో ఏ ఒక్క సినిమాకు కూడా హీరోయిన్‌ సమస్య అన్నది లేదు.

రవితేజ ప్రస్తుతం ధమాకా అనే సినిమాను త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే శ్రీ లీలా నటిస్తున్న విషయం తెల్సిందే. రవితేజ కంటే చాలా చాలా చిన్న వయసు అమ్మాయి శ్రీలీలా. అయినా కూడా ఆయనకు జోడీగా ఆమె సెట్‌ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ ఆమెను ఎంపిక చేశారు.. స్క్రీన్ టెస్ట్‌ లో మరియు రియల్‌ టైమ్‌ షూట్‌ లో కూడా మేకర్స్ సంతృప్తి చెందుతున్నారు.

ఇదే సినిమాలో మరో హీరోయిన్ గా ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్ ను ఎంపిక చేశారు. ఈమె వయసు కూడా రెండు పదులకు కాస్త అటు ఇటు. అయినా కూడా రవితేజ సినిమా లో ఎంపిక అయ్యింది. చాలా ఈజీగా రవితేజకు హీరోయిన్స్ సెట్ అవుతున్నారు. వయసు తేడా విషయంలో విమర్శలు కాని.. ఇంకా ఏదైనా సమస్యలు కాని రావడం లేదు. అయితే ఇతర హీరోల విషయంలో మాత్రమే హీరోయిన్స్ ఎంపిక విషయంలో దర్శకులు కష్టపడాల్సి వస్తుంది.

రవితేజ తో పోల్చితే చిరంజీవి మరియు బాలకృష్ణ లు ఖచ్చితంగా స్టార్‌ డమ్‌ లో చాలా ఎత్తున ఉంటారు. అలాంటి హీరోలకు జోడీగా హీరోయిన్స్‌ అంటే అభిమానులు మరియు విశ్లేషకులు చాలా విధాలుగా లెక్కలు వేస్తారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలా కాదని ఎవరిని పడితే వారిని ఎంపిక చేస్తాం.. చిరంజీవి తో లేదా బాలయ్య తో నటింపజేస్తాం అంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బ తినాల్సి ఉంటుంది. అందుకే దర్శకులు స్టార్‌ హీరోల సినిమాల్లో హీరోయిన్‌ విషయంలో వెనుక ముందు ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించడం చేస్తూ ఉంటారు. రవితేజ విషయంలో మాత్రం అంత ఆలోచన అక్కర్లేదు అనేది కొందరి అభిప్రాయం.