Begin typing your search above and press return to search.

హిందీ 'జెర్సీ' ని మరోసారి వాయిదా వేస్తారా..?

By:  Tupaki Desk   |   24 March 2022 8:36 AM GMT
హిందీ జెర్సీ ని మరోసారి వాయిదా వేస్తారా..?
X
తెలుగులో నాని హీరోగా నటించిన ''జెర్సీ'' చిత్రాన్ని అదే పేరుతో హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్ - మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అప్పుడెప్పుడో పూర్తైన ఈ చిత్రం కరోనా పాండమిక్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

అయితే ఇటీవల సమ్మర్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 14న విడుదల కావాల్సిన 'లాల్ సింగ్ చద్దా' వాయిదా పడిన నేపథ్యంలో.. అదే డేట్ కి 'జెర్సీ' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు నిర్ణయించారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా పడే అవకాశం కనిపిస్తోందని టాక్ నడుస్తోంది.

దీనికి కారణంగా అదే సమయంలో రెండు భారీ చిత్రాలను రిలీజ్ చేస్తుందటమేనని అంటున్నారు. యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కేజీయఫ్: చాప్టర్ 2' సినిమాని ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఫస్ట్ పార్ట్ ఊహించని విధంగా భారీ వసూళ్లు రాబట్టడంతో ఇప్పుడు 'కేజీఎఫ్ 2' పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. నార్త్ మార్కెట్ లో 'జెర్సీ' పై ఈ సినిమా ప్రభావం పడుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతుండగా.. ఇప్పుడు ఏప్రిల్ 13న 'బీస్ట్' చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

'మాస్టర్' చిత్రం హిందీలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది కాబట్టి.. 'బీస్ట్' ని కూడా హిందీలో విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఇలా రెండు పెద్ద సినిమాలు థియేటర్లలోకి వస్తున్న సమయంలో 'జెర్సీ' ని తీసుకురావడం అంటే రిస్క్ చేస్తున్నట్లే అనుకోవాలి. వాటి కంటే భిన్నమైన జోనర్ అయినప్పటికీ ఎంతో కొంత ఎఫెక్ట్ కచ్చితంగా పడుతుంది.

'జెర్సీ' మేకర్స్ కరోనా థర్డ్ వేవ్ తర్వాత తిరిగి ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో.. ఎక్కడా సందడి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఒకవేళ అదే రోజు విడుదల చేస్తే రెండు పెద్ద చిత్రాల తుఫానులో కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ట్రేడ్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

'జెర్సీ' తెలుగులో కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కాకపోయినా.. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ క్రమంలో జాతీయ అవార్డు కూడా అందుకుంది. 'అర్జున్ రెడ్డి' రీమేక్ తో ఘనవిజయం సాధించిన షాహిద్ కపూర్.. ఈ రీమేక్ పై నమ్మకంగా ఉన్నాడు.

అల్లు అరవింద్ సమర్పణలో అల్లు ఎంటర్టైన్మెంట్స్ - దిల్ రాజు ప్రొడక్షన్ - సితార ఎంటర్టైన్మెంట్స్ - బ్రాట్ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. దిల్ రాజు - సూర్యదేవర నాగవంశీ - అమన్ గిల్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు బన్నీ వాసు సహ నిర్మాతగా వ్యవహరించారు.

సచేత్-పరంపర సంగీతం సమకూర్చగా.. అనిరుధ్ రవిచంద్రన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. అనిల్ మెహతా సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.