Begin typing your search above and press return to search.

'ఆర్ ఆర్ ఆర్' రాస్తుంటే ఆ ఆలోచనే రాలేదు!

By:  Tupaki Desk   |   25 March 2022 1:30 AM GMT
ఆర్ ఆర్ ఆర్ రాస్తుంటే ఆ ఆలోచనే రాలేదు!
X
రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు భారీ స్థాయిలో రానుంది. అత్యధిక థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్ .. చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి కథను అందించినది విజయేంద్రప్రసాద్. రాజమౌళి సినిమాలకి దాదాపు ఆయనే కథలను అందిస్తూ ఉంటారు. వాళ్లిద్దరూ కలిసి ఒక రేంజ్ లో కసరత్తు చేసిన తరువాతనే ఆ కథ తెరపైకి వెళ్లడానికి రెడీ అవుతుంది. అదే పద్ధతిని వారు 'ఆర్ ఆర్ ఆర్' విషయంలోను అనుసరించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడారు.

"ఎన్టీఆర్ .. చరణ్ ఇద్దరూ కూడా స్టార్ హీరోలే. వాళ్లిద్దరి ఇమేజ్ లను దృష్టిలో పెట్టుకుని బ్యాలన్స్ చేయవలసి ఉంటుంది. అయితే ఎన్టీఆర్ సీన్ ఇంత ఉంది కనుక, చరణ్ సీన్ నిడివి ఇంత ఉండాలనే కొలతలతో ఈ సినిమాను చేయలేదు. అప్పట్లో రాఘవేంద్రరావుగారు .. కృష్ణ - శోభన్ బాబులతో సినిమా తీసేటప్పుడు, ఇన్ని అడుగులు .. ఇన్ని ఫ్రేమ్ లు అని చూసుకుని తీసేవారట. అలా మాత్రం ఈ సినిమా విషయంలో జరగలేదు. 'మహాభారతం' తీసుకుంటే అందులో ఎవరు హీరో? అర్జునుడా? భీముడా? ఘటోత్కచుడా? కర్ణుడా? మహాభారతంలో కథనే హీరో.

ఎప్పుడైనా సరే కథ వీక్ గా ఉంటే ఇతను ఎంత సేపు కనిపించాడు? అతను ఎంతసేపు కనిపించాడు? ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కథ ఎప్పుడైతే బలంగా ఉంటుందో, పాత్రలన్నీ అందులో ఒదిగిపోయి కనిపిస్తాయి. అలాగే ఈ సినిమాలోని స్టార్స్ కూడా ఈ సినిమాలో ఒదిగిపోయి కనిపిస్తారు. కథ రాస్తున్నప్పుడు ఈ పాత్ర తగ్గుతుందే కాస్త పెంచాలి .. ఈ పాత్ర కాస్త పెరుగుతుంది గనుక తగ్గించాలి అనే ఆలోచనే నాకు ఎప్పుడూ రాలేదు. ఇక నేను కథ రాసివ్వగానే రాజమౌళి పట్టుకెళ్లిపోయి సినిమా తీయడం ఉండదు.

కథలో కూడా రాజమౌళి పాత్ర చాలా ఉంటుంది. తన ఆలోచనలు .. సూచనలు ఉంటాయి. రాజమౌళి ఇంతకుముందు ఎన్టీఆర్ తో 3 సినిమాలు చేశాడు. చరణ్ తో 'మగధీర' చేశాడు. ఈ ఇద్దరితో రాజమౌళికి మంచి సాన్నిహిత్యం ఉంది. అలాగే ఎన్టీఆర్ - చరణ్ కూడా మంచి స్నేహితులు. ఈ కథ కోసం ఎక్కువ కాలం కేటాయించవలసి ఉంటుంది. అలా ఉండాలంటే దర్శకుడికీ .. హీరోలకి మధ్య ఇలాంటి ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. అందువల్లనే ఈ సినిమాను ఇంత సక్సెస్ ఫుల్ గా పూర్తిచేయడం కుదిరింది. ఆల్రెడీ నేను ఈ సినిమాను చూశాను .. చూసిన ప్రతిసారి కొత్తగా అనిపించడమే ఈ సినిమా ప్రత్యేకత" అని చెప్పుకొచ్చారు.