Begin typing your search above and press return to search.

తెగించి గెలిపించిన తెవాతియాలెందరో?

By:  Tupaki Desk   |   9 April 2022 3:06 PM GMT
తెగించి గెలిపించిన తెవాతియాలెందరో?
X
వరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించడం అంటే క్రికెట్లో హీరోయిజం.. అప్పుడెప్పడో పాకిస్థాన్ బ్యాట్స్ మన్ జావెద్ మియాందాద్ వన్డే లో భారత్ పై చివరి బంతికి సిక్స్ తో కప్ గెలిపించాడు. ఈ సంఘటన భారత క్రికెట్ అభిమానులను చాలా కాలం బాధించింది. తర్వాత దేశవాళీల్లో చాలామంది చివరి బంతికి సిక్స్ కొట్టినా.. మియాందాద్ సిక్స్ నే ఎక్కువగా చెప్పుకొనేవారు. ఇక టి20లు వచ్చాక ఆఖరిబంతిని బౌండరీ దాటించడం సాధారణమైపోయింది. అయితే, ఛేజింగ్ లో లాస్ట్ రెండు బంతులనూ సిక్స్ కొట్టి గెలిపించిన ఉదంతాలు తక్కువ. అలాంటి ఫీట్ ను రెండుసార్లు సాధించాడు రాహుల్ తెవాతియా.

శుక్రవారం పంజాబ్‌ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్ బ్యాట్స్‌మన్ తెవాతియా (13 నాటౌట్‌; 3 బంతుల్లో 2x6) అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మెరుపు బ్యాటింగ్‌తో సీజన్‌లో గుజరాత్‌కు మూడో విజయాన్ని అందించాడు. తొలుత పంజాబ్‌ 189/9 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. ఛేదనలో గొప్పగా పోరాడిన గుజరాత్‌ 19 ఓవర్లకు 171/3 స్కోర్‌తో నిలిచింది. ఆఖరి ఓవర్‌లో విజయానికి 19 పరుగులు అవసరమయ్యాయి. డేవిడ్‌ మిల్లర్‌ (1), హార్దిక్‌ పాండ్య (27) క్రీజులో ఉండగా. ఒడియన్‌ స్మిత్‌ బంతి అందుకున్నాడు. తొలి బంతిని వైడ్‌గా వేయగా.. మరుసటి బంతికే పాండ్య రనౌటయ్యాడు. దీంతో తెవాతియా క్రీజులోకి వచ్చి రెండో బంతికి సింగిల్‌ తీశాడు. మూడో బంతిని మిల్లర్‌ బౌండరీకి తరలించడంతో సమీకరణం మూడు బంతుల్లో 13 పరుగులుగా మారింది. నాలుగో బంతికి మిల్లర్‌ మరో సింగిల్‌ తీయడంతో గుజరాత్‌ ఆశలు వదులుకుంది. ఈ నేపథ్యంలోనే తెవాతియా రెండు సిక్సులు బాది జట్టుకు అద్భుత ముగింపునిచ్చాడు.

ఓడియన్ స్మిత్ ఓవర్ త్రో వేయకుంటే..

వాస్తవానికి ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలుపు కష్టమయ్యేదే. చివరి ఓవర్ వేసిన ఓడియన్ స్మిత్ చేసిన తప్పుతో గుజరాత్ గెలిచిందని అనుకోవచ్చు. స్మిత్ వేసిన నాలుగో బంతిని ఆడిన మిల్లర్ షాట్ కొట్టలేకపోయాడు. సింగిల్ తీద్దామని ఆగిపోయాడు. కానీ, బంతిని అందుకున్న స్మిత్ ఓవర్ త్రో వేయడంతో బ్యాట్స్ మన్ పరుగు తీశారు. దీంతో తెవాతియాకు స్ట్రయికింగ్ వచ్చింది. తర్వాతి రెండు బంతులను సిక్సులుగా పంపి గుజరాత్ మెడలో వరమాల వేశాడు. కాగా, 2020లో జరిగిన లీగ్ లో తెవాతియా ఒకే ఓవర్ లో 5 సిక్సులు కొట్టాడు. నాడు రాజస్థాన్ రాయల్స్ కు ఆడిన తెవాతియా పంజాబ్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ వేసిన 18వ ఓవర్లో వరుసగా 5 సిక్సులు బాదాడు. రెండుసార్లూ అతడి చేతిలో బలైంది పంజాబ్ జట్టే కావడం గమనార్హం. కాగా, తెవాతియా తరహాలో సిక్సులతో మ్యాచ్
లు ముగించిన వీరులు పలువురున్నారు. వారెవరో చూద్దామా?

ముగింపు వీరులు వీరే..!

టోర్నీలో తొలిసారి ఆఖరి బంతికి సిక్సర్‌ తో గెలిపించింది చెన్నై ఆల్‌రౌండర్‌ డ్వేన్‌బ్రావో. 2012లో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కోల్‌కతా 158/6 స్కోర్‌ సాధించగా.. చెన్నై 19 ఓవర్లకు 150/4 తో నిలిచింది. ఇక చివరి ఓవర్‌లో 9 పరుగులు చేయాల్సిన స్థితిలో ధోనీ (28), బ్రావో (4) క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలోనే రజత్ భాటియా వేసిన తొలి బంతికి బ్రావో సింగిల్‌ తీయడం, రెండో బంతికి ధోనీ ఔటవ్వడం చకాచకా జరిగిపోయాయి. సమీకరణం నాలుగు బంతుల్లో 8 పరుగులుగా మారింది.

జడేజా క్రీజులోకి వచ్చి మూడో బంతికి రెండు పరుగులు, నాలుగో బంతికి ఒక పరుగు సాధించాడు. అనంతరం బ్రావో ఐదో బంతిని వదిలేయడంతో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. చివరి బంతికి 5 పరుగులు అవసరమైన వేళ సిక్సర్‌ సాధించి చెన్నైకి అద్భుత విజయం అందించాడు. చివరికి బ్రావో (11 నాటౌట్‌గా; 7 బంతుల్లో 1x6) పరుగులతో నిలిచాడు. 2016లో ధోనీ ఉత్కంఠభరితమైన క్షణాల్లో రైజింగ్‌ పుణె జట్టును ఇలాగే గెలిపించాడు. అయితే, అతడు చివరి మూడు బంతుల్ని బౌండరీ, రెండు సిక్సర్లకు తరలించాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 172/7 పరుగులు చేయగా..పుణె 19 ఓవర్లకు 150/6 స్కోర్‌తో విజయం కోసం పోరాడుతోంది. అప్పటికి ధోనీ (42),రవిచంద్రన్‌ అశ్విన్‌ (1) క్రీజులో ఉన్నారు. చివరి ఓవర్‌లో పుణె విజయానికి 23 పరుగులు అవసరమైన స్థితిలో ఉత్కంఠ నెలకొంది. అలాంటి ఒత్తిడిలో ధోని.. అక్షర్‌పటేల్‌ వేసిన ఓవర్‌లో తొలి బంతి డాట్‌బాల్‌గా నమోదవ్వగా తర్వాతి బంతి వైడ్‌గా వెళ్లింది. ఇక మరుసటి బంతిని సిక్సర్‌గా మలిచి మూడో బంతిని వదిలేశాడు. సమీకరణం ఆఖరి మూడు బంతుల్లో 16 పరుగులుగా మారింది. అందరిలోనూ అనుమానాలు రేకెత్తాయి. అయితే, వాటిని పటాపంచలు చేస్తూ మహీ నాలుగో బంతిని బౌండరీకి తరలించాడు. చివరి రెండు బంతుల్నీ సిక్సర్లుగా దంచికొట్టి పుణెకు అపురూప విజయం ఖాయం చేశాడు. చివరికి ధోనీ (64 నాటౌట్‌; 32 బంతుల్లో 4x4, 5x6) పరుగులు సాధించాడు.

నిరుడు మన శ్రీకర్ భరత్

గతేడాది బెంగళూరు, దిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఆఖరి బంతికి కోహ్లీ టీమ్‌ ఇలాగే విజయం సాధించింది. అయితే, ఏమాత్రం అంచనాలు లేని యువ బ్యాట్స్‌మన్‌ కేఎస్ భరత్‌ (78 నాటౌట్‌; 52 బంతుల్లో 3x4, 4x6) చివరి బంతికి విజయాన్ని ఖాయం చేశాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ 164/5 పరుగుల మోస్తరు స్కోర్‌ సాధించగా.. ఛేదనలో బెంగళూరు 19 ఓవర్లకు 150/3 స్కోర్‌తో నిలిచింది. ఆఖరి ఓవర్‌లో బెంగళూరు విజయానికి 15 పరుగులు అవసరం కాగా భరత్‌ (70), గ్లెన్‌మాక్స్‌వెల్‌ (45) అప్పటికి క్రీజులో ఉన్నారు. ఈ క్రమంలోనే అవేశ్‌ ఖాన్‌ ఆఖరి ఓవర్‌ బౌలింగ్‌ చేయగా.. మాక్సీ తొలి మూడు బంతుల్లో 7 పరుగులే సాధించాడు. ఆపై భరత్‌ నాలుగో బంతిని వృథా చేయడంతో ఉత్కంఠ మరోస్థాయికి చేరింది. అయితే, ఐదో బంతికి రెండు పరుగులు చేయడంతో ఆఖరి బంతికి 6 పరుగులు అవరమయ్యాయి. అలాంటి స్థితిలో అవేశ్‌ వైడ్‌ బాల్‌ వేయడంతో బెంగళూరుకు ఒక అదనపు పరుగు లభించింది. దీంతో సమీకరణం ఒక బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆఖరి బంతిని దంచికొట్టిన భరత్‌ బెంగళూరుకు సిక్సర్‌తో విజయాన్ని అందించాడు