ప్రీ-షూట్ వీడియో: వీరమల్లు కోసం పవన్ ఫీట్స్.. ఫ్యాన్స్ కు మెగా ఫీస్ట్..!
By: Tupaki Desk | 9 April 2022 3:00 PM GMTక్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ''హరి హర వీరమల్లు''. రెండేళ్ళ క్రితమే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్.. కరోనా పాండమిక్ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్ నుంచి వాయిదా పడింది. అయితే మేకర్స్ శుక్రవారం తిరిగి షూటింగ్ మొదలుపెట్టారు.
'భీమ్లా నాయక్' తర్వాత దాదాపు రెండు నెలల విరామం తీసుకొని ''హరిహర వీరమల్లు'' సెట్ లో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. వస్తూ వస్తూనే హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్ చేశారు. హైదరాబాద్ లో వేసిన ఓ ప్రత్యేక సెట్లో హాలీవుడ్ స్టంట్ మాస్టర్ టోడోర్ లాజరోవ్ ఆధ్వర్యంలో పవన్ ఈ విన్యాసాలు చేశారు.
అయితే తాజాగా వారియర్స్ వే అంటూ వీరమల్లు ప్రీ షూట్ కు సంబంధించిన ఓ వీడియోని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ బరిసెలతో పోరాట సన్నివేశాలు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. వీడియో చివర్లో కర్ర బ్యాలన్స్ తో చేసిన ఫీట్ అదిరిపోయింది. ప్రస్తుతం నెట్టింట అందరినీ ఆకట్టుకుంటున్న ఈ వీడియో.. పీకే ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇచ్చిందనే చెప్పాలి.
''హరి హర వీరమల్లు'' చిత్రాన్ని 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఓ చారిత్రక కథాంశంతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే దీని కోసం హైదరాబాద్ లో మొఘలాయిల కాలాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్‌లు నిర్మించారు. ఇందులో రాబిన్ హుడ్ తరహా పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - గ్లిమ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి.
ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్ - నర్గిస్ ఫక్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్ పూర్తవ్వగా.. జూలై చివరి నాటికి పవన్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు టాక్.
ఇది పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా.ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. జ్ఞానశేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ బెన్ లాక్ ఈ సినిమా గ్రాఫిక్ వర్క్స్ చేస్తున్నారు. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 'హరిహర వీరమల్లు చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు.