Begin typing your search above and press return to search.

ప్రభాస్ కోసం దెయ్యంగా మారబోతోన్న బాలీవుడ్ యాక్టర్..?

By:  Tupaki Desk   |   25 March 2022 3:28 AM GMT
ప్రభాస్ కోసం దెయ్యంగా మారబోతోన్న బాలీవుడ్ యాక్టర్..?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - దర్శకుడు మారుతి కాంబినేషన్ లో తో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తారని టాక్ వచ్చింది.

ప్రభాస్ తో మారుతి సినిమా విషయాన్ని కంఫర్మ్ చేయనప్పటికీ.. ఈ వార్తలను ఖండించకుండా కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని మారుతి ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ క్రమంలో దీని గురించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రభాస్ - మారుతి చిత్రానికి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇదొక హారర్ కామెడీ థ్రిల్లర్ అని.. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటుగా రొమాన్స్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పుకున్నారు.

హారర్ కామెడీ నేపథ్యానికి తగ్గట్టుగా ఓ పెద్ద బంగ్లా సెట్ ను నిర్మిస్తున్నారని అన్నారు. కథంతా ఆ బంగ్లాలోనే జరుగుతుందన్నారు. అంతేకాదు ఇందులో ముగ్గురు హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారని టాక్ నడిచింది. ఈ క్రమంలో లేటెస్టుగా ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు బొమ‌న్ ఇరానీ ఈ చిత్రంలో నటిస్తారని వార్తలు వస్తున్నాయి.

ఇందులో బొమన్ ఓ భూతంగా కనిపిస్తారని.. ఆయన పాత్ర కథలో చాలా కీలకమని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. బొమ‌న్ ఇరానీ ఇంతకుముందు తెలుగులో 'అత్తారింటికి దారేది' 'బెంగాల్ టైగర్' 'అజ్ఞాతవాసి' 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' వంటి చిత్రాల్లో నటించారు.

ఇకపోతే మారుతి ఈ కథను ఎప్పుడో ప్ర‌భాస్‌ కి వినిపించగా.. హీరో సైడ్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ కూడా వచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో ఉన్న మారుతి.. మరోవైపు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చేసుకుంటున్నారని తెలుస్తోంది.

గతంలో హారర్ జోనర్ లో 'ప్రేమ‌క‌థా చిత్ర‌మ్‌' అనే సినిమా తీసి హిట్ కొట్టారు మారుతి. ఇప్పుడు ప్రభాస్ తో కలిసి భయపెట్టాలని చూస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో రూమర్ వస్తున్న నేపథ్యంలో.. త్వరలోనే అధికారికంగా ప్రకటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.