Begin typing your search above and press return to search.

'కొమురం భీముడో'కి స్పూర్తి ఆ పాటేనా జక్కన్నా..?

By:  Tupaki Desk   |   29 March 2022 9:30 AM GMT
కొమురం భీముడోకి స్పూర్తి ఆ పాటేనా జక్కన్నా..?
X
ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫిలిం మేకర్స్ ఎంత క్రియేటివిటీ చూపిస్తున్నా.. కంపేరిజన్స్ ఎక్కువై పోయాయి. మూవీకి సంబంధించి ఏ కంటెంట్ బయటకు వచ్చినా.. ఇది ఫలానా దానికి అనుకరణ అని.. కాపీ అని.. అక్కడి నుంచి ఎత్తేసారని పోస్టులు దర్శనమిస్తుండటం కామన్ అయిపోయింది.

ఇక భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలకు ఏ రేంజ్ లో ప్రశంసలు దక్కుతాయో.. అదే విధంగా విమర్శలు కూడా అలాగే వస్తుంటాయి. జక్కన్న హాలీవుడ్ మూవీల నుంచి ఇన్స్పైరై యాక్షన్ సీన్స్ ని డిజైన్ చేస్తారనే అపవాదు ఉంది. ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' (రౌద్రం రణం రుధిరం) సినిమా విషయంలోనూ కాపీ ఆరోపణలు వస్తున్నాయి.

RRR సినిమాలోని ‘కొమురం భీముడో' అనే పాటకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంఎం కీరవాణి స్వరపరిచిన ఈ గీతాన్ని.. ఆయన తనయుడు కాల భైరవ ఆలపించారు. దీనికి సుద్దాల అశోక్ తేజ బలమైన సాహిత్యం జోడించారు. ఇది భీమ్ భావోద్వేగాలను ఎలివేట్ చేసే పాట. ఇందులో హీరో ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

తారక్ పలికించిన ఎమోషన్స్ తో పాటుగా రామ్ చరణ్ చూపించిన క్రూయాలిటీ 'కొమురం భీముడో' సాంగ్ ని హైలైట్ చేశాయి. తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ ఇప్పుడు ఈ పాట గురించి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో ఈ సాంగ్ 'దశావతారం' సినిమాలోని ఓ పాటను పోలి ఉందనే కామెంట్స్ వచ్చాయి.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ పది పాత్రల్లో నటించిన చిత్రం 'దశావతారం'. ఇందులో 'రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు' అంటూ సాగే ఓ ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. అందులో కమల్‌ ను చిత్ర హింసలకు గురి చేస్తుంటారు.

ఈ పాటను స్పూర్తిగా తీసుకునే ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' చిత్రంలో కొమరం భీముడో సాంగ్ డిజైన్ చేసి ఉంటారని కొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఎప్పుడూ హాలీవుడ్ సీన్స్ ని అనుకరించే రాజమౌళి.. ఇప్పుడు సినిమాలోని పాటను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారని ట్రోల్స్ చేస్తున్నారు.

మరికొందరు మాత్రం హీరోని చిత్ర హింసలు పెట్టే నేపథ్యంలో పాట చిత్రీకరించినంత మాత్రాన 'దశావతారం' గీతాన్ని కాపీ చేసినట్టు ఆరోపించడం తగదని.. అలా అనుకుంటే ఇలాంటి పాటలు గతంలో ఎన్నో ఉన్నాయని జక్కన్న కు సపోర్ట్ గా నిలుస్తున్నారు.

ఏదైతేనేం ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తొలి రోజు వసూళ్లలో 'బాహుబలి 2' ను అధిగమించిన ఈ ఫిక్షనల్ యాక్షన్ డ్రామా.. ఫస్ట్ వీకెండ్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండో భారతీయ సినిమాగా నిలిచింది. రాబోయే రోజుల్లో ట్రిపుల్ ప్రభంజనం ఎలా ఉంటుందో చూడాలి.