Begin typing your search above and press return to search.

రాజమౌళి ప్రతి సినిమా ఒక ప్రయోగమే!

By:  Tupaki Desk   |   25 March 2022 12:30 AM GMT
రాజమౌళి ప్రతి సినిమా ఒక ప్రయోగమే!
X
రాజమౌళి .. తెలుగు సినిమా గురించి తెలిసినవారికి ఆయన పేరు తెలియకుండా ఉండదు. అంతగా ఆయన తెలుగు సినిమాపై .. తెలుగు ప్రేక్షకులపై తన ప్రభావం చూపించారు. దర్శకత్వం పట్లగల మక్కువతో ఆ దిశగా అడుగులు వేసిన రాజమౌళి .. 'శాంతినివాసం' అనే టీవీ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన దృష్టి వెండితెర వైపుకు మళ్లింది. అక్కడ విద్యార్ధి దశ నుంచి తన ప్రయాణాన్ని కొనసాగించాలనుకున్నారేమో, 'స్టూడెంట్ నెంబర్ 1' సినిమాతో మెగాఫోన్ పట్టుకున్నారు.

ఎన్టీఆర్ హీరోగా చేసిన ఈ సినిమాలో ఎక్కడా కూడా ఆయన తడబడలేదు. నీట్ గా తాను చెప్పదలచుకున్న విషయాన్ని చెబుతూ వెళ్లారు. ఆ తరువాత సినిమాను 'సింహాద్రి' టైటిల్ తోనే ఎన్టీఆర్ తో చేసి ఆయనకి మరో హిట్ ను అందించారు. ఇక స్పోర్ట్స్ నేపథ్యంలో కొత్తగా ఒక సినిమా చేయాలని రాజమౌళి చేసిన ప్రయత్నానికి ఫలితమే నితిన్ హీరోగా వచ్చిన 'సై'. ఈ సినిమా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ఇక ఈ సారి మాస్ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్ ప్రధానంగా ఉండాలి .. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే మదర్ సెంటిమెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఆయన తెరకెక్కించిన సినిమానే 'ఛత్రపతి'.

ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమా అప్పటికీ .. ఇప్పటికీ ఆయన కెరియర్లో చెప్పుకోదగిన సినిమానే. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ తో మెప్పించిన రాజమౌళి, ఆ తరువాత ఫాదర్ సెంటిమెంట్ ప్రధానంగా 'విక్రమార్కుడు' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను కూడా అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. ఇక కొత్తగా ఫాంటసీని ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఆయన 'యమదొంగ' సినిమా చేశారు. యమలోకం నేపథ్యంలో అప్పటివరకూ వచ్చిన సినిమాలకు మించి ఉందనే టాక్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది.

రాజమౌళి సినిమాలు భారీతనానికి అలవాటు పడింది ఈ సినిమా నుంచే అని చెప్పవచ్చు. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేయించిన ఆయన, ఆ తరువాత అంతకంటే భారీ సెట్లతో రాచరికంతో కూడిన పునర్జన్మల కథాంశంతో ముందుకు కదిలారు. 'మగధీర' టైటిల్ తో రూపొందిన ఈ సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. రాజమౌళి జానపద .. పౌరాణిక .. చారిత్రకాలను అద్భుతంగా తెరకెక్కించగలరు అనే ఒక నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించారు. ఆ నమ్మకమే 'బాహుబలి' సినిమాకి బీజం వేసి ఉంటుంది.

ఇక ఆయన నుంచి వచ్చిన 'బాహుబలి' .. 'బాహుబలి 2' తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. తెలుగు సినిమా చరిత్రను చెప్పుకోవాలంటే 'బాహుబలి'కి ముందు .. తరువాత అని చెప్పుకునేలా చేశారు. ఈ మధ్యలో ఆయన హీరోగా ఎలాంటి స్టార్ డమ్ లేని సునీల్ తో తక్కువ బడ్జెట్ లో 'మర్యాదరామన్న' చేసి హిట్ కొట్టారు. అసలు హీరోతోనే సంబంధం లేకుండా 'ఈగ' సినిమాతో సంచలనం సృష్టించారు. అలాంటి రాజమౌళి బలమైన కథాకథనాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ సినిమాలను తెరకెక్కించడంలో ఎవరెస్టు స్థాయికి ఎదిగిపోయారు.

ఎన్టీఆర్ కెరియర్లో రెండో సినిమా అయిన 'స్టూడెంట్ నెంబర్ 1'తో ఆయనకు హిట్ ఇచ్చిన రాజమౌళి, చరణ్ కెరియర్లో రెండో సినిమా అయిన 'మగధీర'తో ఆయనకి హిట్ ను కట్టబెట్టారు. అలాంటి ఈ ఇద్దరితో కలిసి ఆయన 'ఆర్ ఆర్ ఆర్'ను రూపొందించారు. అటు నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోను .. ఇటు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోను పెట్టుకుని, వాళ్ల క్రేజ్ కి తగిన పాత్రలను బ్యాలెన్స్ చేయడం అంత తేలికైన విషయమేం కాదు. కత్తిమీద సామువంటి ఆ ప్రయత్నంలో రాజమౌళి ఎంతవరకూ సక్సెస్ అవుతారనేది ఈ నెల 25వ తేదీతో తేలిపోతుంది. ఎందుకంటే ఈ సినిమా ఆ రోజునే విడుదలవుతుంది.