Begin typing your search above and press return to search.

బాహుబ‌లి 2 రికార్డ్స్ ని ట్రిపుల్ ఆర్ దరిచేరే ఛాన్సే లేదా?

By:  Tupaki Desk   |   4 April 2022 12:30 PM GMT
బాహుబ‌లి 2 రికార్డ్స్ ని ట్రిపుల్ ఆర్ దరిచేరే ఛాన్సే లేదా?
X
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టించిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ట్రిపుల్ ఆర్‌. దాదాపు మూడున్న‌రేళ్లుగా ఈ మూవీ కోసం యావ‌త్ ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న ప్రేక్ష‌కులు, అభిమాన‌లు ఆస‌క్తిగా ఎదురుచూశారు. గ‌త కొన్ని నెల‌లుగా వివిధ కార‌ణాల వ‌ల్ల వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ మూవీ ఎట్ట‌కేల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి భారీ స్థాయిలో విడుద‌లైంది. యుఎస్ ప్రీమియ‌ర్ అడ్వాన్స్ బుకింగ్ ల‌తో రికార్డులు సృష్టించ‌డం మొద‌లు పెట్టింది. ప్రీమియ‌ర్ ల‌కే రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి స‌రికొత్త రికార్డుల్ని న‌మోదు చేసింది.

దీంతో సినిమా ఓ రేంజ్ లో చ‌రిత్ర‌ని సృష్టించ‌డం ఖాయం అనే వార్త‌లు వినిపించాయి. ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీ భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే 600 కోట్లు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన‌ట్టుగా చెబుతున్నారు. `బాహుబ‌లి` రికార్డ్స్ ని అధిగ‌మించింద‌ని చెబుతున్నారు. కానీ ఆ సినిమా క్రేజ్ ట్రిపుల్ ఆర్ కు ఎక్క‌డా ఏ విష‌యంలోనూ క‌నిపించ‌డం లేదు. కానీ `బాహుబ‌లి` రికార్డ్స్‌ని అధిగ‌మించింద‌ని మాత్రం ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఫిగ‌ర్స్ భారీ స్థాయిలోనే చూపిస్తున్నా పెద్ద‌గా క్రేజ్ మాత్రం క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు. `బాహుబ‌లి` మేనియాతో పోలిస్తే ట్రిపుల్ ఆర్ క్రేజ్ అంత‌త మాత్ర‌మే. ఈ మూవీ ఫిగ‌ర్స్ భారీగా చెప్ప‌డానికి ప్ర‌ధాన కార‌ణం టికెట్ రేట్ల‌ని భారీగా పెంచుకునే వెసులుబాటు క‌ల్నించ‌డ‌మే. అయితే `బాహుబ‌లి` టైమ్ లో అప్పుడు టికెట్ రేట్స్ ఈ రేంజ్ లో లేవు. అయినా `బాహుబ‌లి 2 ప్ర‌భంజ‌నాన్ని సృష్టించింది. కానీ టికెట్ రేట్స్ హైక్ చేసినా ఆ రేంజ్ హంగామా ట్రిపుల్ ఆర్ చేయ‌లేక‌పోతోంద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

యుఎస్ లో బ్రేక్ ఈవెన్ రావ‌డం క‌ష్టం అంటున్నారు. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో `బాహుబ‌లి 2` వ‌సూళ్ల‌ని ట్రిపుల్ ఆర్ అధిగ‌మించింది అని ఫిగ‌ర్లు చూపిస్తున్నారు. కానీ ఆ వాతావ‌ర‌ణం ఏమీ క్షేత్ర‌స్థాయిలో మాత్రం క‌నిపించ‌డం లేదు. బాలీవుడ్ లోనూ బాహుబ‌లిని మించిపోయిందంటున్నారు కానీ మాట‌ల్లో క‌నిపించింది చేత‌ల్లో క‌నిపించ‌డం లేదు. ప్ర‌చారం జ‌రుగుతోందే కానీ వాస్త‌వంలో మాత్రం ఇందుకు విరుద్ధంగానే వుంది. ఓవ‌రాల్ గా చూస్తే ట్రిపుల్ ఆర్‌ రాజ‌మౌళి రేంజ్ కి త‌గ్గ సినిమా కాద‌న్న‌ది చాలా మంది సినీ పండితుల వాద‌న‌. ఫ‌లితం కూడా అదే స్థాయిలో క‌నిపిస్తోంది.

సినిమా విడుద‌లై ప‌ది రోజులు కావ‌స్తోంది. యుఎస్ లో ఇప్ప‌టికీ బ్రేక్ ఈవెన్ కి చేర‌లేదు. మ‌రో ప‌ది రోజుల్లో బీస్ట్‌, కేజీఎఫ్ ల హంగామా మొద‌లు కాబోతోంది. ఏం చేసినా ఈ ప‌ది రోజులే. అయితే ఈ ప‌ది రోజుల్లో బాహుబ‌లి 2 రికార్డ్స్ ని ట్రిపుల్ ఆర్ దరిచేరే ఛాన్సేలేద‌ని తెలుస్తోంది. కార‌ణం థియేట‌ర్ల‌లో ట్రిపుల్ ఆర్ సంద‌డి త‌గ్గిపోతోంది. ఇంత‌కు ముందున్న జోష్ ఇప్ప‌డు క‌నిపించ‌డం లేదు. టికెట్స్ అన్ని ధియేట‌ర్ల‌లో చాలా ఫ్రీగా దొరుకుతున్నాయి. `బాహుబ‌లి`తో పోలిస్తే ఆ క్రేజ్ ఈ సినిమాపై ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. దీంతో చాలా వ‌ర‌కు ట్రేడ్ పండితులు `ట్రిపుల్ ఆర్` రాజ‌మౌళి రేంజ్ సినిమా కాద‌ని బాహాటంగానే కామెంట్ లు చేస్తుండ‌టం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.