Begin typing your search above and press return to search.

ఈ జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్ట్ క్లిక్ అవుతాడా?

By:  Tupaki Desk   |   1 April 2022 5:30 PM GMT
ఈ జ‌బ‌ర్ద‌స్త్ ఆర్టిస్ట్ క్లిక్ అవుతాడా?
X
బుల్లితెర‌పై పాపుల‌ర్ అయిన వాళ్లు చాలా వ‌ర‌కు వెండితెర‌పై మెరుస్తున్నారు. కొంత మంది స‌రైన అవ‌కాశం క‌కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే కొంత మంది బుల్లితెర యాంక‌ర్స్ న‌టులుగా మారి వెండితెర‌పై అరంగేట్రం చేశారు. కొంత మంది స‌క్సెస్ ని సొంతం చేసుకోగా కొంత మంది బుల్లితెర‌పై కంటిన్యూ అవుతూనే వెండితెర‌పై త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. ఇప్ప‌టికే అన‌సూయ డిమాండ్ వున్న క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా సెటిలైపోగా బుల్లితెర‌పై పాపుల‌ర్ యాంక‌ర్‌గా పేరు తెచ్చ‌కున్న ర‌ష్మీ గౌత‌మ్ అటు బుల్లితెర‌పై కొన‌సాగుతూనే వెండితెర‌పై త‌ళుక్కున మెరుస్తోంది.

ఇక త‌న‌లాగే బుల్లితెర యాంక‌ర్ గా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ కూడా వెండితెర‌పై త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నాడు. జ‌బ‌ర్ద‌స్త్‌, ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్, శ్రీ‌దేవి డ్రామా కంప‌నీ షోల‌తో ఆక‌ట్టుకుంటున్న సుడిగాలి సుధీర్ త‌న‌కున్న పాపులారిటీతో వెండితెర‌పై కూడా ఆక‌ట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాడు. ఆయ‌న హీరోగా న‌టించిన తొలి చిత్రం `సాఫ్ట్ వేర్ సుధీర్‌`. ఈ చిత్రం ఫ‌ర‌వాలేద‌నిపించింది.

దీంతో సుడిగాలి సుధీర్ తో వ‌రుస‌గా సినిమాల‌ని నిర్మిస్తున్నారు యంగ్ ప్రొడ్యూస‌ర్స్‌. ఇప్ప‌టికే సుధీర్ హీరోగా న‌టించిన `గాలోడు` షూటింగ్ పూర్తి చేస‌కుని రిలీజ్ కు రెడీగా వుంది. తాజాగా మ‌రో సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతోంది. సుడిగాలి సుధీర్ న‌టిస్తున్న తాజా చిత్రం `కాలింగ్ స‌హ‌స్ర‌`. ఇదొక క్రైమ్ థ్రిల్ల‌ర్. అరుణ్ విక్కిరాల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రాధా ఆర్ట్స్, షాడో మీడియా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్ పై ఈ మూవీని విజ‌య్ తాయ‌ల్‌, క‌స్తూరి వెంక‌టేశ్వ‌ర్లు, ప‌మిడి చిరంజీవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శుక్ర‌వారం ఈ మూవీ టీజ‌ర్ ని స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ విడుద‌ల చేశారు. సుడిగాలి సుధీర్ తో పాటు ఈ చిత్రంలో శివ బాలాజీ, డోలీషా, స్పంద‌న ప‌ల్లి, మ‌నాలి రాథేడ్‌, ర‌వితేజ న‌న్నిమాల న‌టించారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలో సుడిగాలి సుధీర్ సైబ‌ర్ సెక్యూరిటీ ఆఫీస‌ర్ అజ‌య్ శ్రీ‌వాస్త‌వ్ గా క‌నిపించ‌బోతున్నాడు. అత‌ని జీవితం సిమ్ కార్డ్ తీసుకున్న త‌రువాత ఎలాంటి మ‌లుపులు తిరిగింది? అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థాంశం. బుల్లితెర‌పై యాంక‌ర్ గా ఆక‌ట్టుకున్న సుడీగాలి సుధీర్ ఈ సినిమాతో హీరోగా క్లిక్ అవుతాడా? అన్న‌ది తెలియాలంటే ఈ మూవీ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.