Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ మూవీని RRR అక్క‌డ క్రాస్ చేసేనా?

By:  Tupaki Desk   |   22 March 2022 1:30 PM GMT
ప్ర‌భాస్ మూవీని RRR అక్క‌డ క్రాస్ చేసేనా?
X
రాజ‌మౌళి ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌పైకి తీసుకొచ్చిన `ఆర్ ఆర్ ఆర్‌` మ‌రో మూడు రోజుల్లో థియేట‌ర్ల‌లో హ‌ల్ చ‌ల్ చేయ‌బోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్త‌యిపోయాయి. ఇప్ప‌టికే ఓవ‌ర్సీస్ లో ప్రీమియ‌ర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ప‌ర‌కంగా స‌రికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో ఓపెనింగ్ డే ఆర్ ఆర్ ఆర్ సాధించ‌బోయే వ‌సూళ్ల‌పై ఇప్ప‌డు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ మొద‌లైంది. ప్ర‌భాస్ న‌టించిన `సాహో` డే వ‌న్ రికార్డ్స్ ని ఉత్త‌రాదిలో `ఆర్ ఆర్ ఆర్` క్రాస్ చేస్తుందా? అన్న‌ది ఇప్ప‌డు హాట్ టాపిక్‌. `సాహో` చిత్రానికి తెలుగు, త‌మిళ, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లో మిక్స్డ్ టాక్ వినిపించింది.

రివ్యూస్ కూడా అదే స్థాయిలో వ‌చ్చాయి. దీంతో ద‌క్షిణాదిలో ఈ మూవీ ఆశించిన స్థాయిలో మాత్రం వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. కానీ ద‌క్షిణాదిలో రివ్యూస్‌, టాక్ ప‌రంగా మిశ్ర‌మ స్పంద‌న ల‌భించినా కానీ ఉత్త‌రాదిలో మాత్రం ప్రేక్ష‌కులు ఈ చిత్రానికి బ్ర‌హ్మరథం ప‌ట్టారు. దీంతో అక్క‌డ `సాహో` ఓపెనింగ్ డే రోజున 24 ప్ల‌స్ కోట్ల‌ని రాబ‌ట్టి `బాహుబ‌లి 2` త‌రువాత స్థానంలో నిలిచింది. అయితే ఈ రికార్డుని `ఆర్ ఆర్ ఆర్‌` క్రాస్ చేస్తుందా? అన్న‌ది ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.

మారిన స‌మీక‌ర‌ణాలు, ప‌రిస్థితుల‌ని బ‌ట్టి చూస్తే `సాహో` రికార్డుని బ్రేక్ చేయ‌డం అంత సులువైన ప‌నేమీ కాదంటున్నారు. ట్రేడ్ పండితుల విశ్లేష‌ణ‌ల ప్ర‌కారం ఫ‌స్ట్ డే `ట్రిపుల్ ఆర్‌` 19 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసే అవ‌కాశం వుంద‌ట‌. మ‌రో మాట కూడా వినిపిస్తోంది. ఇంత‌కు త‌క్కువ కూడా వ‌సూలు చేయోచ్చ‌ని అది కూడా 10 నుంచి 13 కోట్ల మేర ఓపెనింగ్ డే క‌లెక్ష‌న్స్ ని హిందీ బెల్ట్ లో రాబ‌ట్టే అవ‌కాశాలు వున్నాయ‌ని చెబుతున్నారు.

కార‌ణం ఇటీవ‌ల విడుద‌లైన హిందీ చిత్రం `ది క‌శ్మీర్ ఫైల్స్‌`. మార్చి 11న దేశ వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం రికార్డు స్థాయిలో ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతూ వ‌సూళ్ల ప‌రంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. వివాదాస్ప‌ద అంశం నేప‌థ్యంలో రూపొందిన ఈ మూవీపై దేశం మొత్తం ఆస‌క్తిని చూపిస్తోంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద `ఆర్ ఆర్ ఆర్‌`కు గ‌ట్టి పోటీని ఇవ్వ‌డం ఖాయం అని చెబుతున్నారు.

ఈ కార‌ణంగానే `ఆర్ ఆర్ ఆర్‌` ప్రారంభ వసూళ్లుపై ప్ర‌భావం ప‌డ‌బోతోంద‌ని, పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తే కానీ వ‌సూళ్ల ప‌రంగా మార్పు వ‌చ్చే ఛాన్సే లేద‌ని బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతే కాకుండా హిందీ బెల్ట్ లో `ఆర్ ఆర్ ఆర్‌` ఓపెనింగ్స్ కి రాజ‌మౌళి బ్రాండ్ ఇమేజ్ ప్ర‌ధాన పాత్ర పోషించ‌బోతోంద‌ని, ఆయ‌న క్రేజ్ కార‌ణంగా వ‌సూళ్లు పెరిగే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు.