Begin typing your search above and press return to search.

అన్న‌న్నా..అనూప్‌.. ఎంత మాయ‌!

By:  Tupaki Desk   |   30 July 2022 2:30 AM GMT
అన్న‌న్నా..అనూప్‌.. ఎంత మాయ‌!
X
ఒక సంత‌లో ఓ పెయింట‌ర్ అంద‌మైన పెయింటింగ్ వేశాడు. రంగుల‌ద్దాడు. కొత్త‌గా వెరైటీగా వుండ‌టంతో అంతా ఆ పెయింటింగ్ ని చూసి ప్ర‌శంస‌లు కురిపించారు. అత‌న్ని పొగ‌డ్త‌ల‌తో ఆకాశానికి ఎత్తేశారు. దీంతో సంతృప్తి ప‌డ‌ని స‌ద‌రు పెయింట‌ర్ త‌ను వేసిన పెయింటింగ్ కే మ‌రిన్ని రంగులు అద్ది స‌రికొత్త పెయింటింగ్ అంటూ మ‌ళ్లీ ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టాడు. ఈ సారి భారీగా క‌ల‌ర్ ఫుల్ గా తీర్చి దిద్దాడు. అయితే అది కాస్తా భూతంలా మారింది. చూసే వారికి చిరాకు పుట్టించింది. తీరా ఆ పెయింటింగ్ ని ప‌రీక్ష‌గా చూస్తే పాత పెయింటింగ్ కే కొత్త రంగులేసి పెయింట‌ర్ పాడుచేశాడ‌ని అర్థ‌మైంది.

ఇంకే ముంది అత్యాశ‌కు పోయి ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ర్వ‌నాశ‌నం చేసుకున్నాడ‌ని అంతా తిట్టిపోశారు. ఇప్ప‌డు క‌న్న‌డ ద‌ర్శ‌కుడు అనూప్ బండారి ప‌రిస్థితి ఇలాగే వుంది. క‌న్న‌డ నుంచి వ‌చ్చిన `కేజీఎఫ్‌` సిరీస్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించాయ‌ని, అదే స్థాయిలో తన సినిమా కూడా ఓ రేంజ్ లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాల‌ని చేసిన సినిమా `విక్రాంత్ రోణ‌`. కిచ్చా సుదీప్ హీరోగా న‌టించారు.

బాలీవుడ్ హాటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌, నీతా అశోక్ హీరోయిన్ లుగా న‌టించారు. పాన్ ఇండియా సినిమా అంటూ హ‌డావిడి చేసిన ఈ మూవీ గురువారం విడుద‌లై డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. క‌థ‌ని ప‌ట్టించుకోకుండా విజువ‌ల్ గ్రాండీయ‌ర్ నే న‌మ్ముకుని చేసిన ఈ మూవీ కిచ్చా సుదీప్ ఆశ‌ల్ని నీరు గార్చింది. తెలుగులో ఈ మూవీకి ముందు నుంచి పెద్ద‌గా బ‌జ్ లేదు.. ఈ సినిమా వ‌స్తున్న‌ట్టే ఆడియ‌న్ కి తెలియ‌దు. జాక్వెలిన్ పై చేసిన `రక్క‌మ్మ‌.. ` సాంగ్ త‌ప్ప మ‌రేదీ ఈ సినిమా గురించి పెద్దగా ప్ర‌చారం జ‌రగ‌లేదు.
 
పాన్ ఇండియా మూవీగా ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమాకు ఎక్క‌డా పాజిటివ్ టాక్ లేదు. పెద్ద‌గా వ‌సూళ్లు కూడా లేవు. హిందీలో కొంత వ‌ర‌కు ఫ‌ర‌వాలేద‌నిపించినా అక్క‌డ కూడా నిల‌బ‌డ‌టం క‌ష్ట‌మ‌నే చెబుతున్నారు. ఇంత‌కీ పిల్ల‌ల‌ హ‌త్య‌లు, బ్ర‌హ్మ‌రాక్ష‌సుడు మిస్ట‌రీ అంటూ అనూప్ బండారి ఈ మూవీకి తీసుకున్న క‌థే ఇప్ప‌డు ప్ర‌ధాన మైన‌స్ గా మానింది. అయితే ముందే చెప్పిన‌ట్టు పాత పెయింట్ కి కొత్త క‌ల‌ర్ అద్దిన‌ట్టుగా త‌న సినిమానే మ‌ళ్లీ `విక్రాంత్ రోణ‌` అంటూ అనూప్ క‌ల‌రింగ్ ఇచ్చిన తీరు ప‌లువురిని షాక్ కు గురిచేస్తోంది.

2015లో అనూప్ బండారి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన మూవీ `రంగిత‌రంగ‌`. ఇది సీరియ‌క్ కిల్ల‌ర్ నేప‌థ్యంలో రూపొందిన క‌థ‌. ప్రెగ్నెంట్ లేడీసే ల‌క్ష్యంగా హ‌త్య‌లు చేసే ఓ సైకో థ్రిల్ల‌ర్ స్టోరీతో ఈ మూవీని రూపొందించాడు. త‌న సోద‌రుడు నిరూప్ బండారి ఇందులో హీరో. కమ‌ర‌ట్టు నేప‌థ్యంలోనే ఈ క‌థ సాగుతుంది. క‌న్న‌డలో సూప‌ర్ హిట్టు.. విచిత్రం ఏంటంటే ఇదే క‌మ‌ర‌ట్టు నేప‌థ్యంలో `విక్రాంత్ రోణ‌` సాగుతుంది. పేరు కూడా సేమ్‌. క‌థ అదే.. కానీ గ్రాండ్ విజువ‌ల్.. కిచ్చా సుదీప్ హీరో.. ఈ రెండే మారాయి. మిగ‌తాదంతా సేమ్ టు సేమ్‌. ఇది తెలిసిన వాళ్లంతా అన్న‌న్నా..అనూప్‌.. ఎంత మాయ చేశావ్‌.. తీసిందే తీసి మాయ చేయాల‌నుకున్నావ్ కానీ అక్క‌డే అడ్డంగా దొరికిపోయావ్ అంటూ నెటిజ‌న్స్ కౌంట‌ర్లు వేస్తున్నారు.