Begin typing your search above and press return to search.

చిరు నిబద్ధతకు పరీక్ష

By:  Tupaki Desk   |   9 May 2022 1:30 AM GMT
చిరు నిబద్ధతకు పరీక్ష
X
మెగాస్టార్ చిరంజీవికి తన కెరీర్లోనే అతి పెద్ద బాక్సాఫీస్ పరాభవం అంటే 'ఆచార్య' అనే చెప్పాలి. ప్రతి హీరోకూ ఉన్నట్లే ఆయన కెరీర్లోనూ కొన్ని డిజాస్టర్లు ఉన్నాయి. కానీ ఎంత చెత్త సినిమా చేసినా, ఎలాంటి టాక్ వచ్చినా మంచి ఓపెనింగ్స్ తీసుకురాగలిగిన చరిష్మా చిరు సొంతం. తన వరకు ప్రేక్షకులను, అభిమానులను ఎంటర్టైన్ చేసి ఓ మోస్తరుగా అయినా వసూళ్లు దక్కేలా చేస్తాడు మెగాస్టార్.

కానీ 'ఆచార్య'లో ఆ ముచ్చటా లేకపోయింది. చిరు పాత్ర నీరసం తెప్పించేయడం, చిరు మార్కు ఎంటర్టైన్మెంట్ ఇందులో పూర్తిగా మిస్సవడంతో ఆయన అభిమానులు కూడా ఆశించిన స్థాయిలో సినిమా చూడలేదు. మొత్తంగా ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో బయ్యర్లు ఇప్పుడు లబోదిబో అంటున్నారు. ఆల్రెడీ ఒక డిస్ట్రిబ్యూటర్ 'ఆచార్య' వల్ల ఎంతగా దెబ్బ తిన్నానో వివరిస్తూ, తమను ఆదుకోవాలని కోరుతూ చిరుకు బహిరంగ లేఖ కూడా రాశాడు.

ఏదైనా పెద్ద సినిమా డిజాస్టర్ అయి డిస్ట్రిబ్యూటర్లు తమను ఆదుకోవాలని హీరోనో, నిర్మాతనో డిమాండ్ చేసినపుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒక సినిమాను కొనుక్కుని భారీ లాభాలు అందుకున్నపుడు ఆ లాభాల్లో నిర్మాతకు, హీరోకు వాటా ఇవ్వనపుడు.. నష్టాల పాలైనపుడు తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేయడం ఎంత వరకు సమంజసం అన్నదే ఈ ప్రశ్న. ఐతే నష్టాలు ఓ మోస్తరు స్థాయిలో ఉన్నపుడు ఓకే కానీ.. ఇలా నిలువునా మునిగిపోయినపుడు బయ్యర్లను ఎంతో కొంత ఆదుకోవాల్సిందే. అది నిబంధనల ప్రకారం చేసేది కాదు. నైతికతకు సంబంధించిన విషయం.

చిరు ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద స్థాయిలో ఉన్నారు. కరోనా కష్టం వచ్చినపుడు.. ఏపీలో టికెట్ల ధరల సమస్య తలెత్తినపుడు ముందు పడి తన వంతుగా చేయాల్సిందల్లా చేశారు. వీటి వల్ల మంచి ఇమేజ్ తెచ్చుకున్న చిరు.. ఇప్పుడు తన సినిమా వల్ల నిండా మునిగిన బయ్యర్లను ఆదుకోకపోతే ఆయన నిబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతాయి.

'ఆచార్య' బిజినెస్ విషయాలన్నీ డీల్ చేసింది దర్శకుడు కొరటాల శివే కావడంతో ఆయనే బయ్యర్లకు సెటిల్మెంట్ విషయంలో చొరవ తీసుకున్నారని.. చిరు, చరణ్ తమకేం సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారని.. చిరు హాలిడేకు వెళ్లిపోతే, చరణ్ కొత్త సినిమా షూటింగ్‌లో బిజీ అయిపోయాడని.. ఈ విషయమై కొరటాల ఆగ్రహంతో ఉన్నాడని వార్తలొస్తున్నాయి.

ఐతే పైకి కనిపించే విషయాలను బట్టి ఒక అంచనాకు వచ్చేయకూడదు. చిరు వ్యవహారం తెలిసిన వాళ్లంతా ఇలాంటి విషయంలో తనకు సంబంధం లేనట్లు ఆయన వ్యవహరిస్తాడని అనుకోలేరు. మరి తనకున్న ఇమేజ్ దృష్ట్యా ఈ వ్యవహారంలో చిరు జోక్యం చేసుకుంటాడని, బయ్యర్లను ఏదో రకంగా ఆదుకోవడానికి చొరవ తీసుకుంటాడని ఆశిద్దాం.