Begin typing your search above and press return to search.
ఆఫ్రికన్ నటుడిపై భారతీయ దర్శకుడి 'వివక్ష'!
By: Tupaki Desk | 1 April 2018 10:37 AM GMTఅమెరికాతో పాటు కొన్ని పాశ్చాత్య దేశాల్లో నల్లజాతివారిపై - భారతీయులపై జాతి వివక్ష వ్యాఖ్యలు - దాడుల గురించి నిత్యం మనం వార్తల్లో వింటూనే ఉన్నాం. హాలీవుడ్ లో కూడా ఆఫ్రికన్ - చైనా తదితర భాషల నటుల పట్ల జాతి వివక్ష ఉండేది. అయితే, ఆశ్చర్యకరంగా ఓ ఆఫ్రికన్ నటుడిపై భారతీయ దర్శకుడు జాతి వివక్ష చూపించాడని ఆరోపణ రావడం కలకలం రేపింది. తనపై మలయాళ దర్శకుడు వివక్ష చూపించాడని నైజీరియన్ నటుడు శామ్యూల్ అబియోలా రాబిన్సన్ సంచలన ఆరోపణలు చేశాడు. తాను నల్లజాతివాడిననే కారణంగా తనకు తక్కువ రెమ్యున్ రేషన్ చెల్లించారని ఆరోపించాడు. తనకు రెమ్యున్ రేషన్ విషయంలో జరిగిన అన్యాయం - దర్శకుడి వివక్షపై రాబిన్సన్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
జకారియా మహమ్మద్ అనే మలయాళ దర్శకుడు తెరకెక్కించిన తొలి సినిమా `సూడాని ఫ్రమ్ నైగెరా`లో నైజీరియన్ నటుడు శామ్యూల్ అబియోలా రాబిన్సన్ కు ఓ పాత్రలో నటించాడు. ఆ చిత్రంలో పుట్ బాల్ ఆటగాడిగా నటించిన రాబిన్సన్.....షూటింగ్ అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్లాడు. తాను నల్లజాతి వాడిననే కారణంగా జకారియా తనకు తక్కువ రెమ్యున్ రేషన్ చెల్లించాడని రాబిన్సన్ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. ఆఫ్రికన్లందరూ పేదవారని, డబ్బు విలువ తెలియదన్న భావనలో చిత్ర యూనిట్ ఉందని రాబిన్సన్ ఆరోపించాడు. అయితే, కేరళ ప్రజలు మాత్రం తనపై ఎలాంటి వివక్ష చూపలేదని తెలిపాడు. అయితే, ఈ ఆరోపణలపై చిత్రదర్శకుడు జకారియా, యూనిట్ సభ్యులు స్పందించాల్సి ఉంది.