Begin typing your search above and press return to search.

చిరు 150లో చేస్తానంటున్న మెగాడాటర్

By:  Tupaki Desk   |   10 March 2016 5:30 PM GMT
చిరు 150లో చేస్తానంటున్న మెగాడాటర్
X
నాగేంద్ర బాబు కూతురు కొణిదెల నీహారిక అని చెప్పాల్సిన అవసరం లేకుండా సొంతగానే ఇమేజ్ పెంచుకుంటోంది మెగా డాటర్. టీవీ షోల ద్వారా, ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సిరీస్ తో.. ఇప్పటికే అభిమానులను కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ టాలీవుడ్ కొత్త హీరోయిన్ నటించిన ఒక మనసు.. విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సమయంలో అభిమానులతో ఓ రాపిడ్ ఫైర్ రౌండ్ టైపులో వెబ్ లైవ్ చాట్ లో.. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు టకీటకీ సమాధానాలు ఇచ్చేసింది నీహారిక.

ఈ అమ్మడికి అందమే కాదు.. తెలివితేటలు కూడా ఎక్కువే అని ప్రూవ్ చేసుకుంది. ఒ కొంటె ఫ్యాన్ ఫ్లయింగ్ కిస్ అడిగితే.. ఆ స్పీడ్ నువ్వు ఎగిరిపోవడం నాకిష్టం లేదు, అందుకే ఇవ్వడం లేదంటూ అల్లరి ఆన్సర్ ఇచ్చింది నీహారిక. అవకాశం వస్తే అన్నయ్య వరుణ్ తేజ్ - నాన్న నాగేంద్రబాబు - పెద్దన్నయ్య రామ్ చరణ్ తేజ్ లతోనే కాదు... పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాలో కూడా చేసేస్తా అంటోంది. చిరు సినిమాల్లో జగదేకవీరుడు అతిలోక సుందరి ఈమె ఫ్యావరేట్ మూవీ అయితే.. పవన్ మూవీస్ లో జల్సా బాగా ఇష్టమట.

రామ్ చరణ్ గురించి చెప్పమంటే.. 'పెద్దన్నయ్యగా చరణ్ సూపర్. చెర్రీ అన్నయ్యే నాకు గైడ్ - ఫిలాసఫర్' అంటూ ఎమోషనల్ అయిపోయింది మెగా డాటర్. ఇక యాక్టింగ్ విషయానికొస్తే.. అఖిల్ - ఎన్టీఆర్ సహా ఎవరితో అయినా సరే తన కేరక్టర్ నచ్చితే చేస్తానని నీహారిక చెప్పేసింది. మరి మీ పెళ్లెప్పుడు అని అడిగితే 'నేను, నా యాక్టింగ్ నచ్చకపోతే మానేయమని చెప్పండి, అంతే కానీ పెళ్లెప్పుడు అని అస్సలు అడగద్దు' అని రిక్వెస్ట్ చేసేసింది.

చివర్లో ఓ గ్లాస్ లో వాటర్ తాగుతున్న నీహారికకు.. అది ఓడ్కానా అనే ప్రశ్న ఎదురైంది. తనకు ఎలాంటి డ్రింకింగ్ హ్యాబిట్స్ లేవని.. అసలు తన అందానికి అసలు సీక్రెట్ ఎక్కువగా నీళ్లు తాగడమేనని చెప్పింది ఒక మనసు హీరోయిన్ కొణిదెల నీహారిక.