Begin typing your search above and press return to search.

కోపంతో సెట్లోంచి రుస‌రుసా వెళ్లిపోయాడ‌ట‌!

By:  Tupaki Desk   |   29 Nov 2019 8:53 AM GMT
కోపంతో సెట్లోంచి రుస‌రుసా వెళ్లిపోయాడ‌ట‌!
X
కొందరికి కోపం ముక్కుపై ఉంటుందంటారు. ఏదైనా తేడాలొస్తే చ‌మ‌డాలు వ‌లిచేస్తారు. ఈ బాప‌తులోనే స్టార్ రైట‌ర్ కం న‌టుడు పోసాని ఫైరింగ్ గురించి తెలిసిందే. న‌స పెట్ట‌కుండా డైరెక్టుగా మ్యాట‌ర్ కి వ‌చ్చేసి సూటిగా అనాల్సిన‌ది అనేస్తారు. ఇంత‌కుముందు ప‌రిశ్ర‌మ‌లో త‌న పారితోషికం ఎగ్గొట్టిన స్టార్ డైరెక్ట‌ర్లు.. సీనియ‌ర్ రైట‌ర్ల‌నే చెడామ‌డా తిట్టారాయ‌న‌. మీడియా ముఖంగానే సెన్సార్ క‌ట్ లేకుండా తిట్టేయ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌.

ఆ ఇమేజ్ కి త‌గ్గ‌ట్టే ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు ఆయ‌న కోసం క్యారెక్ట‌ర్ల‌ను వండి వారుస్తున్నారు. ఆయ‌న ఆహార్యానికి త‌గ్గ సెటైరిక‌ల్ కామెడీలు పెద్ద రేంజులో వ‌ర్క‌వుట‌వుతున్నాయి. అందుకే ఇటీవ‌ల క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్నారు పోసాని. వ‌రుస‌గా సినిమాల్లో న‌టిస్తున్నారు. 2018లో డ‌జ‌ను సినిమాల్లో న‌టించి రికార్డు న‌టుడ‌నిపించారు. 2019లోనూ వ‌రుస‌గా భారీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. అంతేకాదు.. చిన్న మీడియం బ‌డ్జెట్ చిత్రాల్ని కూడా పోసాని ఎంక‌రేజ్ చేస్తూ న‌టించేందుకు అంగీక‌రిస్తున్నారు. నేడు(29న‌వంబ‌ర్) థియేట‌ర్ల‌లో రిలీజైన `అర్జున్ సుర‌వ‌రం`లో ఆయ‌న ఓ కీల‌క పాత్ర పోషించారు. అర్జున్ (నిఖిల్) స్నేహితుడైన వెన్నెల కిషోర్ తండ్రిగా పోసాని న‌టించారు. ఆయ‌న న‌ట‌న మెప్పించింద‌ని టాక్ వినిపించింది.

పోసానితో త‌న‌ అనుబంధంతో పాటు అదిరిపోయే ఓ అనుభ‌వం గురించి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో నిఖిల్ రివీల్ చేశాడు. ``సెట్లో ఉన్న‌ప్పుడు నేను ఏనాడూ టెన్షన్ పడలేదు. కానీ ఒకసారి మాత్రం బాగా టెన్షన్ పడ్డాను. పోసాని గారితో వర్క్ చేస్తున్నప్పుడు..!!`` అని అన్నాడు ఈ కుర్ర‌హీరో. అర్జున్ సుర‌వ‌రం సెట్ లో ద‌ర్శ‌కుడితో పోసానికి మ‌నస్ఫ‌ర్థ‌లు వ‌చ్చాయ‌ట‌. పోసాని ఏ సీన్ చేసినా రెండు మూడు టేకులే ఎక్కువ‌. అలాంటిది పద‌హారు టేక్ లు తీసుకున్నాడ‌ట‌. దీంతో మండిన ఆయ‌న దూరంగా పోయార‌ట‌. అయితే ద‌ర్శ‌కుడు మాత్రం ఎంతో విన‌యంగా ప్లీజ్ స‌ర్.. హెల్ప్ మి అంటూ కాకా ప‌ట్టేశాడ‌ట‌. మిడ్ నైట్ వ‌ర‌కూ ఉండి సీన్ పూర్త‌య్యాక పోసాని వెళ్లార‌ట‌. కోప‌తాపాలు ఉన్నా స‌హ‌క‌రించే న‌టుడు పోసాని అనేది ఈ స‌న్నివేశం తాత్ప‌ర్యం. బావుంది పోసాని సారూ!!