Begin typing your search above and press return to search.

ఆ రెండింటిలోనూ ఆ క్రెడిట్ మాత్రం కార్తికేయ2కే!

By:  Tupaki Desk   |   21 Aug 2022 10:30 AM GMT
ఆ రెండింటిలోనూ ఆ క్రెడిట్ మాత్రం కార్తికేయ2కే!
X
కొన్నిసార్లు అంతే. హిస్టరీ క్రియేట్ చేసే ప్రతి సందర్భంలోనూ అప్పటివరకు ఉన్న రూల్స్ బ్రేక్ కావటమే కాదు.. అప్పటి వరకు ఉన్న లెక్కలు సోదిలోకి రాకుండా పోతాయి. తాజాగా అలాంటి పరిస్థితే నిఖిల్ నటించిన కార్తికేయ 2 మూవీతో మరోసారి నిరూపితమైంది. శ్రీక్రిష్ణుడు.. ద్వారక బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఈ మూవీ పెద్దగా అంచనాలు లేకుండానే విడుదలైంది. తెలుగులో ఒక మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంటుందన్న అంచనాలు ఉన్నప్పటికీ.. హిందీలో రిలీజ్ చేశామా? ఊరుకున్నామా? అన్నట్లుగా మాత్రమే అనుకున్నారు.

అందరి అంచనాలకు భిన్నంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవటమే కాదు.. అగ్రహీరోలు అమీర్ ఖాన్.. అక్షయ్ కుమార్ సినిమాల్ని ఎత్తేసి మరీ కార్తికేయ 2 మూవీకి థియేటర్లను కేటాయించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. హిందీ వెర్షన్ లో ఉత్తరాదిన కేవలం 50 థియేటర్లలో మాత్రమే విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఏకంగా 3వేల థియేటర్లలో సినిమా రన్ అవుతున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించిన మరో రికార్డును క్రియేట్ చేసిందంటున్నారు. రోజు తేడాతో కార్తికేయ 2కు ముందు విడుదలైన దుల్కర్ సల్మాన్ మూవీ సీతారామం మూవీ క్లాసికల్ హిట్ కావటమే కాదు.. అంచనాలకు మించిన వసూళ్లను సాధించింది. ఈ రెండు సినిమాలు విడుదలై వారం దాటేసి.. రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఎంత పెద్దతోపు సినిమా అయినా రెండో వారానికి సంబంధించిన టికెట్లు అవసరమైతే.. దొరికేసే పరిస్థితి. అందుకుభిన్నంగా ఈ రెండు సినిమాలకు ఆదివారం షోలకు శనివారం నుంచే ఆన్ లైన్ టికెట్ల బుకింత్ యాప్ లలో మెరూన్ కలర్ దర్శనమివ్వటం ఆసక్తికరమని చెప్పాలి. సీతారామంతో పోలిస్తే.. కార్తికేయ 2 మూవీ టికెట్ల బుకింగ్ ను చూసినప్పుడు ఎక్కువ థియేటర్లలో మెరూన్ కలర్ కలర్ లో కనిపించటం గమనార్హం.

సాధారణంగా అగ్రహీరోల సినిమాలు.. భారీ అంచనాలున్న సినిమాలకు స్క్రీన్లను పెద్ద ఎత్తున కేటాయించటంతో మొదటి వారాంతానికే టికెట్ల రద్దీ పూర్తి కావటం.. తర్వాత కాస్తంత సులువుగా టికెట్లు దొరికే పరిస్థితి. కార్తికేయ 2లో రోజు రోజుకు థియేటర్ల సంఖ్య భారీగా పెంచేసిన తర్వాత కూడా రెండో వారం మొదట్లో రద్దీ ఎక్కువగా ఉండటం.. రోజు ముందే ఆన్ లైన్ టికెట్లలో మెరూన్ కలర్ (ఫాస్ట్ ఫిల్లింగ్) దర్శనం ఇవ్వటం చూస్తే.. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇలాంటి సీన్ కనిపిస్తోందని చెప్పాలి.

ఓటీటీలు వచ్చాక థియేటర్లలో సినిమాలు చూసే వారు తగ్గారన్న వాదనపై పునరాలోచనలో పడేలా ఈ సినిమా సక్సెస్ ఉందని చెప్పాలి. అయితే. .కంటెంట్ ఉండాలే కానీ థియేటర్ లో సినిమా చూసేందుకు ప్రేక్షకులు మక్కువ చూపిస్తారన్నది ఈ మూవీ మరోసారి ఫ్రూవ్ చేసింది. దీనికి తోడు.. టికెట్ ధరలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మరింత లాభిస్తుందన్నది మర్చిపోకూడదు. ఇవన్నీ కార్తికేయ 2 సన్సేషనల్ సక్సెస్ తో చోటు చేసుకున్నాయని చెప్పక తప్పదు.