Begin typing your search above and press return to search.

తేజ్ ఐసీయూ వీడియోలపై నిఖిల్ ధర్మాగ్రహం.. గీత దాటుతున్న మీడియా

By:  Tupaki Desk   |   14 Sep 2021 3:34 AM GMT
తేజ్ ఐసీయూ వీడియోలపై నిఖిల్ ధర్మాగ్రహం.. గీత దాటుతున్న మీడియా
X
ఆసక్తి ఉంటుందన్న ఉద్దేశంతో బెడ్రూంలోకి కెమేరాల్ని తీసుకెళితే ఏమంటారు? ఎంత ప్రముఖుడైతే మాత్రం.. మరెంత సెలబ్రిటీ అయితే మాత్రం.. పాటించాల్సిన లక్షణ రేఖలు ఉండవా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మీడియాలో సకల దరిద్రాలకు మూలంగా టీవీ మీడియాను చెబుతారు. దాని అమ్మ మొగుడిలా డిజిటల్ మీడియా తీరు ఉందన్న విమర్శలు ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. దీనికి తగ్గట్లే.. బయటకు వస్తున్న ఉదంతాలు ఈ వాదనల్ని బలపరిచేలా ఉన్నాయని చెప్పాలి.

వేగంగా వెళుతున్న బైక్ స్కిడ్ కావటం.. కింద పడి గాయాలపాలైన టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఆసుపత్రి ఐసీయూలో అతడికి చేస్తున్న చికిత్స తాలుకూ వీడియోలు బయటకు రావటం.. మీడియాలో ప్లే కావటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రముఖడైన వ్యక్తికి సంబంధించిన విషయాల్ని తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రజలకు ఉన్నంత మాత్రాన.. వారి ప్రైవసీలోకి చొరబడిపోవటం ఎంతవరకు సబబు? అని ప్రశ్నిస్తున్నారు.

తేజ్ కు ఐసీయూలో చికిత్స చేస్తున్న సమయంలో.. ‘ఇక్కడ చూడండి. కళ్లు తెరవండి’ అంటూ వైద్యుడు సాయి ధరమ్ తేజ్ చేతిపై తడుతున్న వీడియో ఇటీవల బయటకు రావటం తెలిసిందే. దీనిపై యూత్ హీరో నిఖిల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చికిత్స చేస్తున్న వీడియోలు బయటకు రావటం బాధాకరమన్న అతను.. ఐసీయూలోకి కెమేరాల్ని ఎలా అనుమతించారు? అని ప్రశ్నిస్తున్నారు.

ఐసీయూలో ఉన్నప్పుడైనా ఒక వ్యక్తి ప్రైవసీకి దయచేసి గౌరవం ఇవ్వాలని కోరారు. నిజమే.. నిఖిల్ ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. ప్రజల్లో ఆసక్తి ఉంటుందన్న ఉద్దేశంతో.. రేటింగ్ కోసం.. వ్యూయర్స్ కోసం తన గీతను మీడియా దాటాల్సిన అవసరం లేదు.నిజానికి ఇలాంటివి తమ వరకు వచ్చినా.. వాటిని అడ్డుకోవాలే కానీ.. అడ్డదిడ్డంగా ప్రసారం చేయటం ఏ మాత్రం సరికాదు. అయితే.. ఇలాంటి నీతుల్ని తలకెక్కించుకొని పని చేసే వారికి మీడియా సంస్థలు మంగళం పాడేస్తున్న వేళ.. అడ్డదిడ్డంగా వ్యవహరించే ఇలాంటి తీరు రానున్న రోజుల్లో మరిన్ని ఆగ్రహాలకు అవకాశం ఇస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.