Begin typing your search above and press return to search.

కంటెంట్ ఉంటే కలెక్షన్లు కురవాల్సిందే: నిఖిల్

By:  Tupaki Desk   |   12 Aug 2022 3:55 AM GMT
కంటెంట్ ఉంటే కలెక్షన్లు కురవాల్సిందే: నిఖిల్
X
నిఖిల్ హీరోగా రూపొందిన 'కార్తికేయ 2' ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అభిషేక్ అగర్వాల్ .. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించాడు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. అడివి శేష్ - సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకలో నిఖిల్ మాట్లాడుతూ .. "చందూ మొండేటి 'కార్తికేయ 2' కథ చెప్పిన దగ్గర నుంచి అందరం కూడా ఈ కథను తప్పకుండా తెరమీదకి తీసుకుని రావాలనే ఉద్దేశంతో రెండున్నరేళ్లుగా కష్టపడుతూ వచ్చాము.

రెండున్నరేళ్లపాటుగా మేము పడిన కష్టం .. రెండు రోజుల్లో మీ ముందుకు రావడానికి రెడీ అవుతోంది. నిజం చెప్పాలంటే నేను పైకి నవ్వుతున్నప్పటికీ చాలా టెన్షన్ గా ఉన్నాను.

ఈ ఫంక్షన్ కి చీఫ్ గెస్టుగా అడివి శేష్ రావడం చాలా ఆనందంగా ఉంది. పెద్ద బడ్జెట్ అవసరం లేదు .. విషయం ఉన్న కంటెంట్ ఉంటే చాలని 'మేజర్' సినిమాతో ఆయన నిరూపించాడు. ఈ రోజున ఆయన మా టీమ్ ను సపోర్ట్ చేయడానికి ఇక్కడికి రావడం సంతోషాన్ని కలిగిస్తోంది. అలాగే సిద్ధు జొన్నలగడ్డ కూడా వచ్చి సపోర్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది.

సింగీతం శ్రీనివాసరావుగారు చేసిన ప్రయోగాలు చూస్తూ పెరిగినవాడిని. కొత్తదనం కోసం తపించడమనేది ఆయన నుంచే స్ఫూర్తిగా తీసుకున్నాను. అలాంటి ఆయన ఈ సినిమా పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేశాడం విశేషం. ఈ మధ్య థియేటర్లకు జనాలు రావడం లేదని అంటున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలకు జనాలు వస్తారనే విషయం మరిచిపోకూడదు. అందుకు ఉదాహరణగా ఇటీవల వచ్చిన 'మేజర్' .. 'బింబిసార' .. 'సీతా రామం' సినిమాలను గురించి చెప్పుకోవచ్చు. కథలో విషయం ఉంటే హౌస్ ఫుల్స్ తో నడుస్తున్నాయి. మా సినిమా నిర్మాతలు మాకు అందించిన సహకారం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పచ్చు.

అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ కాదు .. హీరో కంటే ఎక్కువ. విపరీతమైన చలిలో ఆమె నా కంటే ముందుగానే నీళ్లలో దూకేసేది. ఈ సినిమా చూసిన తరువాత అద్భుతమైన లొకేషన్స్ కోసం మేము ఎంత కష్టపడ్డామనేది మీకు తెలుస్తుంది.

సెట్స్ కూడా ఎంత గొప్పగా ఉన్నాయనేది అర్థమవుతుంది. కాలభైరవ సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి. శ్రీనివాస రెడ్డిగారు .. హర్ష .. ప్రవీణ్ అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాము" అని చెప్పుకొచ్చాడు.