Begin typing your search above and press return to search.

నితిన్ చాలా మారిపోయాడు గురూ..

By:  Tupaki Desk   |   13 Jun 2016 11:30 AM GMT
నితిన్ చాలా మారిపోయాడు గురూ..
X
‘అఆ’ సినిమాలో నితిన్ నటన చాలామందికి ఆశ్చర్యంగానే అనిపించి ఉంటుంది. నితిన్ ను ఇంత ఒద్దికగా ఎప్పుడూ చూడలేదు తెలుగు ప్రేక్షకులు. చాలా వరకు అల్లరిగా.. దూకుడుగా ఉండే పాత్రలే చేశాడతను. ‘అఆ’ తరహాలో నెమ్మదిగా.. మెచ్యూర్డ్ గా ఉండే క్యారెక్టర్లలో ఎప్పుడూ కనిపించలేదు. పాత్రలో మాత్రమే కాదు.. అతడి నటనలోనూ ఓ పరిణతి కనిపించింది ఇందులో. సటిల్ పెర్ఫామెన్స్ ఇచ్చాడతను. ఇదంతా త్రివిక్రమ్ ప్రభావమే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే నటన పరంగానే కాకుండా నితిన్ పై వ్యక్తిగతంగానూ త్రివిక్రమ్ ప్రభావం బాగా పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది గత కొంత కాలంగా అతణ్ని చూస్తుంటే.

నితిన్ మామూలుగా నెమ్మదిగా మాట్లాడలేడు. అవతలి వాళ్లకు అర్థం కానంత వేగంగా మాట్లాడేస్తుంటాడు. మాటలు తడబడుతుంటాయి. తొందరలో ఏదో నోటికొచ్చినట్లు మాట్లాడేసేవాడు. అతడి ప్రసంగాలు అంత ఆసక్తికరంగా ఉండేవి కాదు కూడా. నితిన్ బలహీనతను వైకల్యంగా చూపించి కొందరు కామెంట్లు చేయడం.. వార్తలు రాయడం కూడా జరిగింది ఒకప్పుడు. కానీ ఈ మధ్య గమనించారంటే నితిన్ చాలా నెమ్మదిగా.. ఆలోచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. ‘అఆ’ ఆడియో వేడుక మొదలు.. నిన్నటి విజయోత్సవం వరకు చాలా చక్కగా మాట్లాడాడు నితిన్.

ప్రసంగాలు ప్రిపేరవుతున్నాడో ఏంటో కానీ.. వేదిక ఎక్కాక ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా.. పద్ధతిగా మాట్లాడుతున్నాడు నితిన్. ‘అఆ’ అంటే ‘అందమైన ఆహ్లాదకరమైన’ సినిమా అనడం కానీ.. త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ల మీద తన అభిమానాన్ని చాటుకునే విషయంలో కానీ.. అతను వేసిన పంచ్ లు భలేగా పేలాయి ఆడియో వేడుకలో. మొన్న సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘అఆ’ ఆడియో వేడుకకు నలుగురు వ్యక్తులు కారణమని చెబుతూ ఒకటో వ్యక్తి.. రెండో వ్యక్తి.. మూడో వ్యక్తి.. అంటూ ప్రతిసారీ త్రివిక్రమ్ వైపు చూపించడంతో ఆ కార్యక్రమంలో ఉన్నవాళ్లంతా గొల్లుమన్నారు. లేటెస్టుగా ‘అఆ’ విజయోత్సవంలోనూ భలేగా మాట్లాడాడు నితిన్. మొత్తానికి ‘అఆ’ సినిమా నితిన్ లో చాలా మార్పే తెచ్చినట్లుంది చూడబోతే.