Begin typing your search above and press return to search.

పవన్ ప్లస్ మహేష్ కలిపితే నేను- నితిన్

By:  Tupaki Desk   |   6 Jun 2016 11:00 PM IST
పవన్ ప్లస్ మహేష్ కలిపితే నేను- నితిన్
X
అ..ఆ.. చిత్రం అనూహ్యమైన రిజల్ట్ ను అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కావడంతో.. ఆడియన్స్ లో ముందు నుంచి మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ కు ఏ మాత్రం తగ్గకుండా అన్ని విభాగాల్లోనూ అందంగా కూర్చిన విందు భోజనం రేంజ్ లో ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాతో హీరో నితిన్ ఒకేసారి నాలుగు మెట్లు ఎక్కేసినట్లు అయిపోయింది. గతంలో కూడా నితిన్ వేరే జోనర్స్ ట్రై చేసినా సక్సెస్ కాలేదు. అందుకే తనకు అచ్చొచ్చిన ప్రేమ చిత్రాలకే పరిమితం అయ్యాడు.

ఈ కేరక్టర్ గురించి త్రివిక్రమ్ చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయానంటున్నాడు నితిన్. 'నేను ఇంతకు ముందు చేసిన కేరక్టర్లన్నీ సరదాగా ఉండేవే. కానీ ఈ పాత్ర గురించి చెప్పినపుడు.. అతడు సినిమాలో మహేష్ పడే బాధ ఈ రోల్ ఉంటుంది. అలాగే అత్తారింటికి దారేది చిత్రంలో పవన్ కళ్యాణ్ అంత యాక్టివ్ గాను, బాధ్యతగా ఉండాలి అని త్రివిక్రమ్ చెప్పారు. దీన్ని అందుకునేందుకు స్పెషల్ గా నేను వర్క్ షాప్ కి అటెండ్ కావాల్సి వచ్చింది.' అని చెప్పాడు నితిన్.

తను నటించేటప్పుడు సాధారణంగా కనుపాపలు వేగంగా కదులుతాయన్న నితిన్.. ఈ సినిమాలో అలాంటివి లేకుండా నటించాల్సి రావడం ఇబ్బంది కలిగించిందట. ఇతర పాత్రలవైపు కదలకుండా చూడాలనడం కష్టమైనా.. చివరకు చేశానని చెప్పాడు. అంత కష్టపడ్డందుకు.. ఇప్పుడు తగిన రిజల్ట్ అందుకుంటున్నాడని చెప్పచ్చు. అ..ఆ..లో నితిన్ తన నటనలో చూపించిన పరిణతి.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ తర్వాత నితిన్ చేసే సినిమాలకు ఫ్యామిలీస్ నుంచి కూడా ఆదరణ లభిస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు.