Begin typing your search above and press return to search.

శర్వా ఇంట్లో నితిన్ పెళ్లి

By:  Tupaki Desk   |   9 March 2018 10:44 AM GMT
శర్వా ఇంట్లో నితిన్ పెళ్లి
X
ఎంతైనా దిల్ రాజు గారి తెలివే తెలివి. సినిమా నిర్మాణం కత్తి మీద సాములా మారి పెద్ద పెద్ద ప్రొడక్షన్ సంస్థలే ఇతరులతో టై అప్ చేసుకుని రిస్క్ తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుంటే ఈయన మాత్రం ఏడాదికి ఆరు సినిమాలు తీసి అందరితో ఔరా అనిపించుకున్నారు. ఇదలా ఉంచితే కాస్ట్ కటింగ్ అదే వ్యయాన్ని సాధ్యమైనంత మేరకు తగ్గించడంలో దిల్ రాజు నిపుణులని ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కామెంట్ ఉంది. నటీనటుల పారితోషికాలు మొదలుకొని సినిమాలో సెట్స్ దాకా ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉంటూ ఖర్చు వీలైనంత తగ్గించుకునే విధంగా ప్లాన్స్ వేస్తుంటారట. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా. నితిన్ హీరోగా తొలిప్రేమ బ్యూటీ రాశి ఖన్నా హీరొయిన్ గా ఇటీవలే శ్రీనివాస కళ్యాణం అనే సినిమా దిల్ రాజు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ఫస్ట్ లుక్ పోస్టర్స్, మోషన్ టీజర్ తోనే ఇదో చక్కని కుటుంబ కథా చిత్రం అనే ఫీలింగ్ కలిగించిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ని బేస్ చేసుకుని శతమానం భవతి తరహాలోనే దర్శకుడు వేగ్నేశ సతీష్ ఇది కూడా రాసుకున్నాడట. కాకపోతే పల్లెటూరి నేపధ్యంలో ఒక మంచి ఇంటి సెట్ అవసరం పడింది. విడిగా వేరే సెట్ ఎందుకు అని చెప్పి గతంలో శర్వానంద్ కోసం చేసిన శతమానం భవతి సెట్ లోనే ఇది కూడా కానిచ్చేస్తున్నారని టాక్. అందులో ఆత్రేయపురం అన్నారు. ఇందులో పేరు మారిస్తే చాలు. సింపుల్. శతమానం భవతి షూటింగ్ లో ఉన్నప్పుడే వేగ్నేశ సతీష్ ఈ కథ చెప్పినప్పుడు దీనికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే సెట్ ని అలాగే ఉంచారట దిల్ రాజు.

ఇదేమి మరీ ఆశ్చర్యపోయే విషయం కాదు కాని గతంలో కూడా మర్యాదరామన్న సినిమా పూర్తయ్యాక ఆ ఇంటి సెట్ ని చాలా సినిమాల కోసం వాడుకున్నారు. భాగమతి సెట్ లో త్వరలో కొన్ని షూటింగ్స్ జరగబోతున్నాయి. ఇదే తరహాలో దిల్ రాజు కూడా తన సెట్ ను తనే వాడుకుంటున్నాడు. అంతే. వేసవిలోనే విడుదల ప్లాన్ చేసిన శ్రీనివాస కళ్యాణం మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసే టార్గెట్ పెట్టుకున్నారు.