Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఆద్యంతం వినోదభరితంగా సాగిన 'స్కైలాబ్'

By:  Tupaki Desk   |   6 Nov 2021 7:31 AM GMT
ట్రైలర్ టాక్: ఆద్యంతం వినోదభరితంగా సాగిన స్కైలాబ్
X
సత్యదేవ్ - నిత్యామీనన్ - రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం ''స్కైలాబ్''. అమెరికా ఏర్పాటు చేసిన మొట్టమొదటి అంతరిక్ష కేంద్రం 'స్కైల్యాబ్' భూమ్మీద పడుతుందని.. ప్రపంచం నాశమైపోతుందని 1979లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఏం జరగబోతుందో అని అందరూ అప్పట్లో చర్చలు జరిపారు. అలాంటి సమయంలో ఆ వార్తల వల్ల కరీంనగర్ జిల్లాలోని బండ లింగంపల్లి గ్రామంలోని ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే కథాంశంతో ఈ కామెడీ డ్రామా రూపొందింది.

'స్కైలాబ్' సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన టైటిల్ - ఫస్ట్ లుక్ మరియు క్యారక్టర్ పోస్టర్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇందులో ఆనంద్ పాత్రలో సత్యదేవ్.. గౌరీ అనే యువతి పాత్రలో నిత్యా మీనన్.. సుబేధార్ రామారావుగా రాహుల్ రామకృష్ణ కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. విలేకరిగా పనిచేసే దొర బిడ్డగా నిత్యా మీనన్ ను చూపించడంతో ట్రైలర్ ప్రారంభమైంది.

బండ లింగంపల్లిలో క్లినిక్ ప్రారంభించాలనే యువకుడిగా.. డబ్బు పిచ్చోడిగా ముద్రపడిన వ్యక్తిగా సత్యదేవ్ కనిపిస్తున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తాము అనుకున్నది సాధించవచ్చని గౌరీ - ఆనంద్ ఆలోచిస్తున్న సమయంలో.. స్కైల్యాబ్ ఉపగ్రహ శకలాలు భూమి మీద ఎక్కడైనా పడే అవకాశం ఉందని రేడియోలో వార్తలు వస్తాయి. దీంతో వీరి జీవితాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది ఈ ట్రైలర్ లో వినోదాత్మకంగా చూపించారు. కథకు అనుగుణంగా నటీనటుల వస్త్రాధారణ.. వారి లుక్స్‌ చాలా విభిన్నంగా ఉన్నాయి.

'ఎంత పెద్ద వర్షం పడ్డా ఆకాశం తడవదు. గుర్తు పెట్టుకోండి' అని నిత్యా మీనన్ సీరియస్ గా చెప్పే డైలాగ్.. 'మా తాత గురించి చెప్పారా?' అని రాహుల్ రామకృష్ణ గొప్పలు చెప్పుకోవాలని చూడగా.. 'వీళ్ళ తాత చచ్చిపోయాడు' అని ఒకతను చెప్పడం.. 'స్కైల్యాబ్ అంటే ఆకాశంలో ప్రయోగశాల అన్నట్టు' అని రాహుల్ రామకృష్ణ చెప్పగా.. 'ఆకాశంలో కట్టిండ్రా.. భూమ్మీద జాగా లేనట్టు అక్కడికి పోయిండ్రు' అని ఓ పెద్దావిడ ఆశ్చర్యం వ్యక్తం చేయడం వంటివి నవ్వు తెప్పిస్తున్నాయి. ఇందులో తనికెళ్ళ భరణి - దర్శకుడు తరుణ్ భాస్కర్ - తులసి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. స్కైల్యాబ్ కకథేంటి? ఇది గౌరీ - ఆనంద్ - రామారావు లకు ఎలా ఉపయోగపడింది? బండ లింగంపల్లి గ్రామస్తులు పరిస్థితి ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

'స్కైలాబ్' చిత్రానికి విశ్వక్ కందెరావ్ దర్శకత్వం వహించారు. రవి కిరణ్ సమర్పణలో బైట్ ఫీచర్స్ - నిత్యామీనన్ కంపెనీ బ్యానర్స్ పై పృథ్వీ పిన్నమరాజు - నిత్యా మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రశాంత్ ఆర్. విహారి ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. ఆదిత్య జవ్వడి సినిమాటోగ్రఫీ అందించగా.. రవితేజ గిరిజాల ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'స్కైలాబ్' చిత్రాన్ని 2021 డిసెంబర్ 4న థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విభిన్నమైన కథ కథనాలతో రూపొందిన ఈ కామెడీ డ్రామా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.