Begin typing your search above and press return to search.

‘భరత్’ అర్ధరాత్రి బొమ్మ లేదబ్బా..

By:  Tupaki Desk   |   18 April 2018 10:18 AM IST
‘భరత్’ అర్ధరాత్రి బొమ్మ లేదబ్బా..
X
ఒక పెద్ద హీరో సినిమా వస్తోందంటే చాలు ముందు రోజు అర్ధరాత్రి నుంచే హంగామా మొదలైపోతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పెద్ద సినిమాకూ అర్ధరాత్రి నుంచే బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అనుమతి ఇచ్చేస్తుంటారు. రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 5 లోపు భారీగా స్పెషల్ షోలు పడుతుంటాయి. సంక్రాంతికి విడుదలైన ‘అజ్ఞాతవాసి’.. ‘జై సింహా’ సినిమాలకైతే వారం పాటు 24 గంటలూ షోలు వేసుకోవడానికి అనుమతి లభించింది. మూడు వారాల కిందట విడుదలైన ‘రంగస్థలం’కు ఒక స్పెషల్ షో వేసుకోవడానికి అనుమతిచ్చారు. కానీ తర్వాత రాబోయే పెద్ద సినిమా ‘భరత్ అనే నేను’కు మాత్రం ఈ అవకాశం లేదని సమాచారం.

ఏపీలో మారిన నిబంధనల ప్రకారం బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వట్లేదట. ఉదయం రెగ్యులర్ టైం నుంచే షోలు పడబోతున్నాయట. ఇక తెలంగాణలో ఏడాది కిందట్నుంచే బెనిఫిట్ షోలు ఆగిపోయాయి. అప్పుడప్పడూ కొన్ని సినిమాలకు ఉదయం అదనపు షోకు అవకాశమిచ్చారు కానీ.. ఈ మధ్య అది కూడా లేకుండా పోయింది. ఆంధ్రాలో బెనిఫిట్ షోలకు అలవాటు పడ్డ అభిమానులకు ఇది రుచించని విషయమే. మిగతా హీరోల అభిమానుల హంగామా చూసి.. తాము అంతకుమించి రచ్చ చేయాలని చూస్తున్న మహేష్ ఫ్యాన్స్ బాగా నిరాశ చెందుతారేమో. ఐతే అమెరికాలో గురువారమే ప్రిమియర్ షోలు పడుతున్న నేపథ్యంలో సినిమా టాక్ అయితే ఇక్కడ షోలు మొదలవడానికంటే ముందే తెలిసిపోతుంది.