Begin typing your search above and press return to search.

పేరున్న డైరెక్ట‌ర్‌..పాన్ ఇండియా మూవీ..బ‌జ్ జీరో!

By:  Tupaki Desk   |   6 July 2022 4:30 PM GMT
పేరున్న డైరెక్ట‌ర్‌..పాన్ ఇండియా మూవీ..బ‌జ్ జీరో!
X
ఆయ‌నో పేరున్న డైరెక్ట‌ర్.. ఆయ‌న సినిమాలంటే క్రిటిక్స్ సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తారు. అవార్డులు సైతం న‌డుచుకుంటూ వ‌స్తాయి. కానీ ప్ర‌స్తుతం లెక్క మారింది. బాక్సాఫీస్ లెక్క‌లు ప్ర‌ధాన భూమిక పోషిస్తున్నాయి. ఈ లెక్క‌ల‌ని బ‌ట్టే ఎలాంటి ద‌ర్శ‌కుడికైనా విలువ ఇవ్వ‌డం మొద‌లుపెడుతున్నారు. ఎంత‌టి క‌ళాఖండాన్ని తెర‌పై ఆవిష్క‌రించినా అది జ‌నం హృద‌యాన్ని తాకిన‌ప్పుడే దానికి విలువ‌. అలా జ‌ర‌గ‌క‌పోతే ఎంత‌టి పేరున్న దర్శ‌కుడు, స్టార్ హీరో చేసిన సినిమా అయినా ప్రేక్ష‌కులు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో వ‌స్తున్న ఓ భారీ సినిమాపై కూడా ఇలాంటి చ‌ర్చే జ‌రుగుతోంది. వివ‌రాల్లోకి వెళితే.. త‌న‌దైన మార్కు సినిమాల‌తో ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్న మ‌ణిర‌త్నం ప్ర‌స్తుతం త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ గా 'పొన్నియిన్ సెల్వ‌న్‌' ని తెర‌కెక్కిస్తున్నారు. 9వ శ‌తాబ్దం కాలం నాట చోళ రాజుల సామ్రాజ్యం నేప‌థ్యంలో ఈ పీరియాడిక‌ల్ మూవీని అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు. క్రేజీ న‌టున‌టులు విక్ర‌మ్‌, ఐశ్వ‌ర్యారాయ్‌, కార్తి, జ‌యం ర‌వి, త్రిష‌, శ‌ర‌త్ కుమార్, పార్తీబ‌న్‌, ప్ర‌భు, ప్ర‌కాష్ రాజ్‌, శోభితా థూళిపాల‌ వంటి స్టార్ లు న‌టిస్తున్నారు. మ‌ద్రాస్ టాకీస్ తో క‌లిసి లైకా ప్రొడ‌క్ష‌న్స్ ఈ మూవీని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది.

రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ కోసం దాదాపు రూ. 500 కోట్ల మేర బ‌డ్జెట్ ని కేటాయిస్తున్నారు. 'బాహుబ‌లి' స్ఫూర్తితో రూపొందుతున్న ఈ మూవీని ట్రేడ్ వ‌ర్గాలు కోలీవుడ్ 'బాహుబ‌లి' అని ప్ర‌చారం చేస్తున్నారు. మ‌ణిర‌త్నం భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ సెప్టెంబ‌ర్ 30న ఐదు భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్ర‌చార ప‌ర్వానికి మేక‌ర్స్ తెర‌లేపారు. ఇటీవ‌ల విక్ర‌మ్ ఫ‌స్ట్ లుక్ ని విడుద‌ల చేశారు.

ఇందులో విక్ర‌మ్ చోళ రాజు ఆదిత్య క‌రికాళ‌న్ గా న‌టిస్తున్నారు. పాండ్యుల‌తో వైరానికి కాలుదువ్విన రాజుగా వైల్డ్ టైగ‌ర్ గా విక్ర‌మ్ పాత్ర క‌నిపించ‌నుంది. ఇక ఇత‌నికి అత్యంత స‌న్నిహిత రాజు వంధ్య‌దేవుడిగా హీరో కార్తి న‌టిస్తున్నాడు.

త‌న‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ని కూడా విడుద‌ల చేశారు. అయితే వీటికి తెలుగులో పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించలేదు. సినిమాపై కూడా ఇక్క‌డ పెద్ద‌గా బ‌జ్ క్రియేట్ కాలేదు. కార‌ణం గ‌తంలో మ‌ణిర‌త్నం సినిమా అంటే స‌మ్‌థింగ్ స్పెష‌ల్ అనే భావ‌న వుండేది. కానీ ఇప్ప‌డ‌ది లేదు.

ఇటీవ‌ల మణిర‌త్నం చేసిన క‌డ‌లి, చెలియా, న‌వాబ్ వంటి సినిమాలు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. దీంతో ఆయ‌న కున్న క్రేజ్ బాగా త‌గ్గిపోయింది. అదే ఇప్ప‌డు 'పొన్నియిన్ సెల్వ‌న్‌'కు పెద్ద డ్రా బ్యాక్ గా మారిన‌ట్టుగా తెలుస్తోంది. 500 కోట్ల‌తో నిర్మిస్తున్న ఈమూవీకి తెలుగులో ఏ మాత్రం బ‌జ్ లేక‌పోవ‌డం త‌మిళ వ‌ర్గాల‌ని క‌ల‌వరానికి గురిచేస్తోంద‌ట‌. సినిమా రిలీజ్ వ‌ర‌కైనా ఈ మూవీకి మణిర‌త్నం తెలుగులో బ‌జ్ ని క్రియేట్ చేయ‌గ‌లుగుతాడా? అన్న‌ది ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.