Begin typing your search above and press return to search.

టాలీవుడ్ పై రాజ‌ధాని సెగ తుస్సుమందే

By:  Tupaki Desk   |   12 Jan 2020 8:06 AM GMT
టాలీవుడ్ పై రాజ‌ధాని సెగ తుస్సుమందే
X
ఘ‌ట‌న ఏదైనా రాజ‌కీయ పార్టీల వాళ్లు టాలీవుడ్ పై ప‌డ‌డం అల‌వాటు చేసుకున్నారు. ఉద్య‌మాల పేరుతో క‌ళ‌పై దాష్ఠీకం చేస్తున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనే ఇది ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా తెలిసొచ్చింది. ఉద్య‌మాన్ని అడ్డుపెట్టుకుని రౌడీల వీరంగం చూశాం. అప్ప‌ట్లో టాలీవుడ్ కి జ‌రిగిన న‌ష్టం అంతా ఇంతా కాదు. ఓపెనింగులు లేక రిలీజ్ లు లేక శాటిలైట్ కొనేవాళ్లు లేక ప‌రిశ్ర‌మ‌ వెల‌వెల‌బోయిన ప‌రిస్థితి దాపురించింది. ఒక‌ర‌కంగా ఉపాధి క‌రువై మాంద్యంలోకి జారుకోవ‌డం టాలీవుడ్ వ‌ర్గాల్ని భీతావ‌హుల్ని చేసింది.

ఇప్పుడు కూడా అలాంటి అరాచ‌కం చేయాల‌నుకుని చ‌తికిల‌బ‌డ్డారు. రాజ‌ధాని పేరుతో క‌ళపైనా.. సినిమాపైనా దాష్ఠీకానికి తెగ‌బ‌డాల‌న్న కుట్ర కోణం బ‌య‌ట‌ప‌డింది. అమ‌రావ‌తిలో రైతులు రాజ‌ధాని కోసం ఆందోళ‌న చేస్తున్న స‌మ‌యంలో ముష్క‌ర దాడుల ప్ర‌ణాళిక గురించే తెలిసిందే. రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెలపాలంటూ కొంత మంది విద్యార్థులు హైద‌రాబాద్ లో ని సెల‌బ్రిటీల ఇళ్ల‌ను టార్గెట్ చేసారంటే దానివెన‌క ముష్క‌ర కుట్ర ఉంద‌న్న వాద‌నా వినిపించింది. ఈ నేప‌థ్యంలో ముందుగా మ‌హేష్ పై ప‌డ్డారు కొంద‌రు. సూప‌ర్ స్టార్ అమ‌రావ‌తి రాజ‌ధాని ఉద్య‌మానికి స‌హ‌క‌రించాల‌ని...రైతుల ప‌క్షాన మాట్లాడాల‌ని మెలిక వేస్తూ డొంక‌తిరుగుడుగా డిమాండ్ చేసారు. ఆ త‌ర్వాత వరుస‌గా హీరోల ఇళ్ల‌ను ముట్ట‌డిస్తామ‌ని హెచ్చ‌రించారు. అయినా మ‌హేష్ వాటిని ప‌ట్టించుకోలేదు. ప‌క్కాగా లైట్ తీస్కున్నారు.

హీరోల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌ని ప‌క్షంలో ఆ హీరోల సినిమాలు చూడ‌కూడ‌ద‌ని...అందుకు విద్యార్థులు... రైతు కుటుంబాలు క‌ట్టుబ‌డి ఉండాల‌ని తీర్మానించుకున్నారు. అయితే ఈనెల 11న‌ మ‌హేష్ న‌టించిన స‌రిలేరు నీకెవ్వ‌రు ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమాకు తొలి షోతోనే మంచి టాక్ వ‌చ్చింది. బొమ్మ ద‌ద్ద‌రిల్లింద‌న్న‌ ప్ర‌చారం పోస్ట‌ర్లు సైతం షురూ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. తాజాగా ఈరోజు (ఆదివారం) స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` కూడా రిలీజ్ అయింది.

అయితే రాజ‌ధాని ఎఫెక్ట్ ఈ రెండు సినిమాల‌పై ఎక్క‌డా క‌నిపంచ‌లేదు. రాష్ట్రంలో అన్ని థియేట‌ర్లు ప్రేక్ష‌కుల‌తో నిండిపోతున్నాయి. గుంటూరు-విజ‌య‌వాడ న‌డిబొడ్డున ఉన్న‌ థియేట‌ర్ల‌లో సైతం హౌస్ ఫుల్ అవుతున్న‌ట్లు స‌మాచారం. రాజ‌ధాని విద్యార్థి సంఘాలు అల్టిమేటం జారీ చేసినా రాజ‌ధాని సెగ అనుకున్నంత‌గా ప‌ని చేయ‌లేద‌ని వ‌సూళ్ల‌ ప్రూఫ్ లు క‌నిపిస్తున్నాయి. కేవ‌లం ఓ సామాజిక‌ వ‌ర్గం మాత్ర‌మే రాజ‌ధానిపై ర‌గ‌డ చేస్తోంద‌న్న విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలిసింద‌ని వైకాపా నేత‌లు చెబుతున్నారు. అభివృద్ది వికేంద్రీక‌ర‌ణ‌లో భాగంగా ఉద్య‌మం కేవ‌లం అమ‌రావ‌తి ప‌ది- ప‌దిహేను గ్రామాల‌కే ప‌రిమిత‌మైంది. మిగ‌తా అన్ని జిల్లాల ప్ర‌జ‌ల‌ నుంచి మూడు రాజ‌ధానుల వ‌ల్ల మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయ‌ని హ‌ర్షం వ్య‌క్తం అవుతోంది. టాలీవుడ్ ని వైజాగ్ లో అభివృద్ది చేస్తే బాగుంటుంద‌ని సెల‌బ్రిటీలు సైతం స్పందించారు. అంతేకాదు మ‌రో టాలీవుడ్ ని బీచ్ సొగ‌సుల విశాఖ న‌గ‌రంలో అత్యంత భారీగా నిర్మించాల‌న్న సంక‌ల్పంతో వైకాపా అధినాయ‌కుడు వై.య‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవితో క‌లిసి ఈ ప్రణాళిక‌ను ర‌చిస్తున్నార‌న్న ప్ర‌చారం ఇప్ప‌టికే ఉంది. దీనికి ప‌ర్యాట‌క శాఖ మంత్రి .. కాబోయే సినిమాటోగ్ర‌ఫీ మంత్రి అవంతి శ్రీ‌నివాస్ పూర్తి మ‌ద్ధ‌తుగా నిలుస్తుండ‌డం విశాఖ వాసుల్లో ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొస్తోంది.