Begin typing your search above and press return to search.

దాసరి మహానుభావా.. ఎందుకెళ్లిపోయావ్?

By:  Tupaki Desk   |   16 April 2018 12:13 PM GMT
దాసరి మహానుభావా.. ఎందుకెళ్లిపోయావ్?
X
ఒక వ్యక్తి మనతో ఉన్నప్పటి కంటే ఆ వ్యక్తి మనకు దూరమైనపుడే అతడి విలువ తెలుస్తుందని అంటారు. ఇందుకు సరైన ఉదాహరణ దాసరి నారాయణరావు. ఆయన ఉన్నపుడు తన వ్యవహారాలు కూడా పక్కన పెట్టి సినీ ఇండస్ట్రీ సమస్యలన్నింటినీ తన నెత్తిమీదికి వేసుకునేవారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా స్పందించేవాళ్లు. పరిశ్రమలో పెద్ద సమస్యలు తలెత్తితే ముందుండి పరిష్కరించేవాళ్లు. ఆయన వెళ్లిపోయాక దిక్కూ దివానం లేకుండా పోయింది పరిశ్రమకు. ఈ ఏడాది కాలంలో ఎన్నో సమస్యలు తలెత్తాయి. డ్రగ్స్ ఇష్యూ.. థియేటర్ల సమ్మె.. తాజాగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారం. ఇలా ఏ ఇష్యూ వచ్చినా అందరికీ దాసరే గుర్తుకొస్తున్నారు. ఆయన ఉండుంటేనా.. అన్న భావన అందరికీ వస్తోంది.

దాసరి ఉండుంటే కచ్చితంగా ఏ సమస్యా ఇంతింతి పెద్దది అయ్యేది కాదు. ఏదో ఒక వర్గానికి కొమ్ము కాయకుండా.. న్యాయాన్యాయాలు పరిశీలించి సమస్యను పరిష్కరించడం దాసరి ప్రత్యేకత. ముఖ్యంగా ఆయన ఎప్పుడూ బలహీన వర్గాల కోసం పోరాడేవాళ్లు. ఇండస్ట్రీలో అందరు పెద్దలూ తనకు కావాల్సిన వాళ్లే అయినా సరే.. థియేటర్ల సమస్య తలెత్తితే వాటిని గుప్పెట్లో ఉంచుకున్నవాళ్లను విమర్శించడానికి వెనుకాడే వారు కాదు. చిన్న సినిమా కోసం.. చిన్న వాళ్ల కోసం ఆయన ఎప్పుడూ ముందుండేవారు. ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగిందని తన వద్దకు వస్తే వెంటనే స్పందించేవారు. కాబట్టే ఏ సమస్య అయినా.. ఏ పంచాయితీ అయినా ముందు ఆయన దగ్గరికి వెళ్లేది. ఆ తర్వాతే మీడియా వరకు విషయం వెళ్లేది.

కానీ దాసరి వెళ్లిపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక అందరూ మీడియాకు ఎక్కుతున్నారు. రోడ్డు మీదికి వస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ వ్యవహారమే తీసుకుంటే ఇండస్ట్రీలో ఇది కొత్త కాదు అనే అభిప్రాయం ఉంది. ఐతే దాసరి ఉండుంటే పరిశ్రమ పరువు పోయేలా వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదన్నది మాత్రం స్పష్టం. శ్రీరెడ్డి వ్యవహారాన్ని ‘మా’ వాళ్లు ఎంత పేలవంగా డీల్ చేశారో తెలిసిందే. ఒకవేళ దాసరి ఉండుంటే మాత్రం ఇలా జరగనిచ్చేవాళ్లు కాదు. శ్రీరెడ్డి రోడ్డు మీదికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఇండస్ట్రీలో ఎవ్వరైనా సరే.. దాసరి మాటకు విలువ ఇస్తారు. ఆయనంటే భయపడతారు. తాను శ్రీరెడ్డికి అవకాశం ఇస్తానని తేజ అన్నాక కూడా ఆమె నోరు మూత పడలేదు. ఆ తర్వాత కూడా ఆరోపణలు కొనసాగించింది. ఊహించని రీతిలో నిరసన వ్యక్తం చేసింది.

ఒకవేళ దాసరి ఉండి జోక్యం చేసుకుని ఉంటే శ్రీరెడ్డి ఇలా చేసేది కాదన్నది పక్కా. తనవి కాని సమస్యలు నెత్తికేసుకుని న్యాయం చేసేందుకు ప్రయత్నించడం అంత సులువైన వ్యవహారం కాదు. అది అందరి వల్లా కాదు. దీని వల్ల గౌరవాభిమానాలు పెరుగుతాయి కానీ.. అందుకు పడాల్సిన కష్టం.. ఎదుర్కోవాల్సిన తలనొప్పులు చాలా ఉంటాయి. అందుకే దాసరి వెళ్లపోయాక ఎవ్వరూ ఆయన స్థానాన్ని భర్తీ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దీన్ని బట్టే దాసరి ప్రత్యేకత ఏంటన్నది అర్థమవుతుంది. అందుకే ఆయన లేని లోటు ఇండస్ట్రీలో బాగా తెలుస్తుంది? ఆయన ఎందుకింత త్వరగా వెళ్లిపోయారన్న ఆవేదన అందరిలోనూ వ్యక్తమవుతోంది.