Begin typing your search above and press return to search.

మరి 2.0 సంగతేంటి?

By:  Tupaki Desk   |   11 Feb 2018 7:04 AM GMT
మరి 2.0 సంగతేంటి?
X
ఏప్రిల్ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో సందిగ్ధత మరింత పెరిగిపోయింది. ఈ నెలలో సినిమాలు షెడ్యూల్ చేసి పెట్టుకున్న తెలుగు నిర్మాతలు.. ఎక్కడ ‘2.0’ ఇదే నెలలో రిలీజై ఇబ్బంది పెడుతుందో అని టెన్షన్ పడుతుంటే.. ఆ సినిమా నుంచి ముప్పు లేదని తేలిపోయింది. కానీ రజినీ మరో సినిమా ‘కాలా’ ఏప్రిల్ 27కు ఫిక్సవ్వడం ఇక్కడి ప్రొడ్యూసర్లకు ఇబ్బందే. ఆ తేదీకి ‘నా పేరు సూర్య’ ఫిక్సయి ఉంది. అది ఆ రోజు రాకుంటే ‘భరత్ అనే నేను’ రిలీజవ్వడం పక్కా. మరి ‘2.0’ విషయంలో ఇంతెత్తున లేచిన బన్నీ వాసు.. డీవీవీ దానయ్య ఇప్పుడేమంటారో చూడాలి.

ఈ సంగతలా వదిలేస్తే అసలు ‘2.0’ పరిస్థితి ఏంటన్నది సందిగ్ధంలో పడిపోయారు కోట్లాది మంది ప్రేక్షకులు. గత ఏడాది దీపావళికే రావాల్సిన ఈ చిత్రం ఈ ఏడాది రిపబ్లిక్ డే వీకెండ్ కు షెడ్యూలై.. అక్కడి నుంచి ఏప్రిల్ కు వాయిదా పడింది. ఇప్పుడు ఏప్రిల్లో కూడా సినిమా రిలీజ్ కాదని తేలిపోయింది. ఏప్రిల్ 14 అని.. 27 అని ఊరించిన రజినీ ఇప్పుడు తుస్సుమనిపించాడు. ఈ నెలలో ‘కాలా’ రావడం సంతోషమే కానీ.. దీంతో పోలిస్తే ప్రేక్షకులు ఎక్కువ ఆశలు.. అంచనాలు పెట్టుకున్నది ‘2.0’ మీదే. ఈ చిత్రం కోసం దేశమంతా ఎదురు చూస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యమవుతుండటం వల్లే ఈ చిత్రాన్ని వాయిదా వేశారన్నది స్పష్టం. ఐతే వీఎఫెక్స్ విషయంలో దేశంలోనే ఏ దర్శకుడికి లేని స్థాయిలో అవగాహన ఉన్న శంకర్.. సమయానికి సరైన ఔట్ పుట్ రాబట్టుకోలేకపోవడం.. మరీ ఇంత లేట్ చేస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. తాజా సమాచారం ప్రకారం ‘2.0’ కనీసం జూన్ వరకు వచ్చే అవకాశం లేదంటున్నారు. మరి పక్కాగా ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో ఏమో?