Begin typing your search above and press return to search.

బాహుబలి ముందు అవన్నీ దిగదుడుపే..

By:  Tupaki Desk   |   9 Dec 2016 10:55 AM GMT
బాహుబలి ముందు అవన్నీ దిగదుడుపే..
X
ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమానే. ప్రాంతీయ సినిమాను బాలీవుడ్ జనాలు ఎంత తక్కువగా చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాళ్ల సినిమాలు మన మార్కెట్‌ను దున్నేయడమే తప్ప.. మన సినిమాలు వాళ్ల మార్కెట్ ను కబ్జా చేయడం అన్నది అరుదు. ఐతే ఇదంతా ‘బాహుబలి’కి ముందు కథ. మన దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ విజువల్ వండర్.. దేశం నలుమూలలా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. అద్భుతమైన కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు ‘బాహుబలి: ది కంక్లూజన్’ కోసం తెలుగు ప్రేక్షకుల కంటే కూడా మిగతా వాళ్లు ఎక్కువ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

మొత్తం దేశవ్యాప్తంగా బాహుబలి-2 కోసం ఎలా ఎదురు చూస్తున్నారో చెప్పడానికి ప్రముఖ బాలీవుడ్ ఫిలిం పోర్టల్ ఫిల్మ్ కంపానియన్ చేపట్టిన పోల్ ఫలితాలే నిదర్శనం. వచ్చే ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఏవి అని ప్రశ్నిస్తే 51 శాతం మంది ‘బాహుబలి: ది కంక్లూజన్’ పేరే చెప్పారు. మిగతా సినిమాలన్నీ కలిపి 49 శాతం ఓట్లే తెచ్చుకున్నాయి. షారుఖ్ ఖాన్ ‘రాయీస్’ 21 శాతం మందిని ఆకర్షించింది. గోల్ మాల్-4 14 శాతం ఓట్లతో మూడో స్థానంలో.. ట్యూబ్ లైట్ 6 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో.. ‘2.0’ 3 శాతం ఓట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ గణాంకాల్ని బట్టి బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి భారతీయ ప్రేక్షకులు ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.