Begin typing your search above and press return to search.

మోదీ బ‌యోపిక్‌: గోద్రా అల్ల‌ర్ల‌ను దాచేశారేం?

By:  Tupaki Desk   |   23 March 2019 8:54 AM GMT
మోదీ బ‌యోపిక్‌: గోద్రా అల్ల‌ర్ల‌ను దాచేశారేం?
X
ఎన్నిక‌ల ముంగిట `పీఎం న‌రేంద్ర మోదీ` పేరుతో బ‌యోపిక్ రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని 23 భాష‌ల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్19న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2 నాటికి ప్రీపోన్ చేశామ‌ని ప్ర‌క‌టించ‌డంతో ఒక‌టే ఆసక్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది. జాతీయ అవార్డు గ్ర‌హీత ఒమంగ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై సినిమా తెర‌కెక్కుతుండ‌డం, ఇందులో వివేక్ ఒబేరాయ్ టైటిల్ పాత్ర పోషిస్తుండ‌డంతో అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో, కామ‌న్ జ‌నంలోనూ ఈ సినిమాపై ఆస‌క్తి నెల‌కొంది.

ఇటీవ‌లే ట్రైల‌ర్ ని లాంచ్ చేశారు. ట్రైల‌ర్ ఆద్యంతం ఎంతో ఆస‌క్తి రేకెత్తించింది. మోదీ రాజ‌కీయ నాయ‌కుడు కాక ముందు జీవితం ఎంతో ఆకట్టుకుంది. అయితే ఈ ట్రైల‌ర్ చూసిన వారికి ఓ రెండు సందేహాలు రేకెత్తాయి. అస‌లింత‌కీ మోదీ జీవితంలో ఒక్క వివాదాన్ని కూడా ఈ సినిమాలో చూపించ‌డం లేదా? గోద్రా అల్ల‌ర్ల వేళ మోదీపై వెల్లువెత్తిన విమ‌ర్శ‌ల గురించి కానీ, అలాగే త‌న కుటుంబం విష‌యంలో మోదీ దృక్ప‌థం కానీ ట్రైల‌ర్ లో చూపించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఆర్.ఎస్.ఎస్- హిందూత్వ భావ‌జాలం ఉన్న మోదీ చిన్న‌ప్పుడే తాను స‌న్యాసి అవుతాన‌ని త‌ల్లితో అన‌డం, ఆమె త‌న చెంప ప‌గ‌ల‌గొట్ట‌డం వంటి విష‌యాల్ని ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు.

అయితే ఆ రెండు ఇష్యూస్ ని ఈ ట్రైలర్ లో చూపించాల‌నుకున్నారు. తొలుత ఆ రెండిటిని క‌లిపి ట్రైల‌ర్ ని క‌ట్ చేసి దానిని మీడియాకు ప్ర‌ద‌ర్శించారు. కానీ ఆ త‌ర్వాత బ‌య‌టి ప్ర‌పంచానికి రివీల్ చేసిన ట్రైల‌ర్ లో ఆ రెండు ఇష్యూస్ లేకుండా ఎడిట్ చేసేశార‌ట‌. గోద్రా అల్ల‌ర్లు - మోదీ చెంప దెబ్బ తిన్న స‌న్నివేశం ఈ ట్రైల‌ర్ లో లేకుండా చేశార‌ట. అంటే ఈ సినిమాకి రాజ‌కీయంగా ఎంత‌టి ప్రాధాన్య‌త ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అస‌లు అలా ఎందుకు చేయాల్సి వ‌చ్చింది? అని ఓ ప్ర‌ముఖ బాలీవుడ్ మీడియా నిర్మాత సందీప్ సింగ్ ని ప్ర‌శ్నిస్తే.. ``ప్ర‌స్తుతం వార‌ణాసిలో షూటింగ్ చేస్తున్నాం. దీనిపై ఏదీ మాట్లాడ‌లేను`` అని అన్నార‌ట‌. ఇక తొలుత మీడియాకు ప్ర‌ద‌ర్శించిన ట్రైల‌ర్ లో 2002 గోద్రా అల్ల‌ర్ల సంద‌ర్భంలో ఓ జ‌ర్న‌లిస్టు మోదీ(ఒబేరాయ్)ని ప్ర‌శ్నించే స‌న్నివేశం చూపించారు. ``ఆప్ నే అబ్ త‌క్ గోద్రా కే లియె అపాల‌జీ క్యూన్ న‌హీ కియా?`` అంటూ స‌ద‌రు జ‌ర్న‌లిస్టు ప్ర‌శ్నించే విష‌యాన్ని ట్రైల‌ర్ లో చూపించాల‌నుకుని వెన‌క‌డుగు వేశారు. అలాగే స‌న్యాసి అయిపోతాన‌ని బాల మోదీ త‌న త‌ల్లి హిరాబెన్ (జ‌రీనా వ‌హ‌బ్) తో అనే స‌న్నివేశం ట్రైల‌ర్ లో ఉండాల్సిన‌ది. దానిని సింగిల్ లైన్ లో కొన్ని సెక‌న్ల పాటు మాత్ర‌మే ప‌రిమితం చేశారు. ఇక యువ‌కుడైన మోదీ .. జ‌శోదాబెన్ (బ‌ర్ఖా బిస్త్‌) అనే యువ‌తిని పెళ్లాడే సీన్ ని ట్రైల‌ర్ నుంచి తొల‌గించారు. తాను ఆర్.ఎస్.ఎస్ సిద్ధాంతాల‌కు క‌ట్టుబ‌డి కుటుంబ బంధ‌నాల్ని తెంచుకుని మోదీ వెళ్లిపోయారు. ఆ క్ర‌మంలోనే ఆయ‌న వెనుదిరిగి చూడ‌కుండా రాజ‌కీయాల్లో ఇంతింతై అన్న తీరుగా ఎదిగి ముఖ్య‌మంత్రిగా, ప్ర‌ధానిగా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకున్నారు. ఇదంతా తెర‌పై చూపిస్తున్నార‌న్న‌మాట‌.