Begin typing your search above and press return to search.

పవన్ ఆ మాట అనకపోతే 'కొండ పొలం' చేసేవాడిని కాదు: క్రిష్

By:  Tupaki Desk   |   3 Oct 2021 4:30 AM GMT
పవన్ ఆ మాట అనకపోతే కొండ పొలం చేసేవాడిని కాదు: క్రిష్
X
వినోదం .. సందేశం కలగలిసిన కథలను తెరకెక్కించడంలో క్రిష్ సిద్ధహస్తుడు. ఆయన దర్శకత్వంలో 'కొండ పొలం' అనే సినిమా రూపొందింది. సాయిబాబు - రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. వైష్ణవ్ తేజ్ జోడీగా రకుల్ నటించిన ఈ సినిమా, ఈ నెల 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి 'కర్నూల్' లో నిర్వహించారు. ఈ వేదికపై క్రిష్ మాట్లాడారు.

'కొండ పొలం' సినిమా విషయంలో నేను మొట్టమొదటిసారిగా కృతజ్ఞతలు చెప్పవలసిన వ్యక్తి .. పవన్ కల్యాణ్ గారు. 100 కోట్ల బడ్జెట్ తో అతిభారీ సినిమా జరుగుతున్నప్పుడు విరామం వచ్చింది. అందుకు ఆర్థికపరమైన కారణాలు కావొచ్చు .. చాలా రోజుల పాటు పని లేకపోవడం వలన కావొచ్చు. ఇలా వెళ్లి ఒక సినిమా చేసుకుని వస్తామని పవన్ గారితో చెప్పాను. ఆయనకి ఈ సినిమా హీరో ఎవరో తెలియదు .. 'కొండ పొలం' అనే పుస్తకం మాత్రం తెలుసు. అప్పుడు ఆయన నీకు .. నీ టీమ్ కి ఈ సినిమా చేసుకోవడం చాలా అవసరం, వెళ్లి సినిమా చేసుకుని రా" అని చెప్పారు. అందుకు నేను ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

'హరి హర వీరమల్లు' షూటింగు సమయంలో లాక్ డౌన్ వచ్చినప్పుడు, 'కొండ పొలం' సినిమా స్టార్ట్ అయింది. పవన్ కల్యాణ్ గారు అనుమతించకపోయినా .. ఎ.ఎమ్.రత్నం గారు అంగీకరించకపోయినా .. దర్శకులు సుకుమార్ గారు - ఇంద్రగంటి గారు ఈ నవలను నాకు పరిచయం చేయకపోయినా .. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారు ఈ పుస్తకం రాయకపోయినా ఈ సినిమా మొదలయ్యేది కాదు. వీరందరికీ నా హార్దిక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

నేను .. నా స్నేహితుడు రాజీవ్ రెడ్డి అమెరికాలో ఉద్యోగాలు వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాము. పడుతూ లేస్తూ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. 'రాజీవ్ .. ఒక సినిమా చేద్దామా'? అంటే, కథ ఏమిటని కూడా అడగకుండా ఆయన ఓకే అనేశాడు. ఆయన వలన నేను ఇలాంటి సినిమాలు చేయగలుగుతున్నాను. నేను చేసిన ఒక మంచి సినిమాను గొప్ప సినిమాగా మలిచిన వ్యక్తి కీరవాణిగారు. 'రై రై రయ్యా రై' అంటూ ఆయన చేసినది రీ రికార్డింగ్ కాదు .. అదో మంత్రంలా అనిపిస్తుంది.

అలాగే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 'ఎత్తు తల ఎత్తు' అనే ఒక పాటను రాశారు. ఈ సినిమా సారాంశాన్ని మొత్తం ఆయన ఆ పాటలో చెప్పేశారు. ఇంత గొప్ప సాహిత్యాన్ని అందించిన సీతారామ శాస్త్రిగారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆత్మన్యూనత భావం కలిగిన రవీంద్ర అనే ఒక వ్యక్తి, ధైర్యంగా ముందుకు వెళ్లి తాను అనుకున్నది ఎలా సాధించుకోగలుతాడు అనేది ఈ కథ. రకుల్ నుంచి నేను డిసిప్లిన్ నేర్చుకున్నాను .. వైష్ణవ్ తేజ్ నుంచి, ఎదుటివాళ్ల నుంచి ఎలా నేర్చుకోవాలనేది నేర్చుకున్నాను. నిజంగా వైష్ణవ్ తేజ్ ది చాలా గొప్ప వ్యక్తిత్వం. గొప్ప నటుడిగా 100 సినిమాలు పూర్తి చేయాలని కోరుకుంటున్నాను" అంటూ ఆయనను అభినందించారు.