Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ సినిమాకు ప్రేక్ష‌కులు లేక షోలు ర‌ద్దు!

By:  Tupaki Desk   |   11 Jun 2022 12:08 PM GMT
సూప‌ర్ స్టార్ సినిమాకు ప్రేక్ష‌కులు లేక షోలు ర‌ద్దు!
X
క‌రోనా నుంచి కోలుకున్న ద‌క్షిణాది ఇండ‌స్ట్రీ బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాల‌తో దేశ వ్యాప్తంగా బాక్సాఫీస్ వ‌ద్ద హ‌ల్ చ‌ల్ చేస్తోంది. రికార్డు స్థాయిలో వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తూ సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. అయితే ఇండియ‌న్ సినిమా అంటే బాలీవుడ్ అని చెప్పుకునే హిందీ సినిమా మాత్రం ఇప్ప‌టికీ కోలుకోవ‌డానికి ఆప‌సోపాలు ప‌డుతోంది. టాలీవుడ్ సినిమాల దెబ్బ‌కి బెంబేలెత్తిపోతూ ప్రాంతీయ చిత్రాల ముందు ప‌రువుని కాపాడు కోవాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

ఇటీవ‌ల పోటాపోటీగా విడుద‌లైన హిందీ సినిమాలేవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డ‌లేక‌పోవ‌డంతో ఏంటీ మ‌న ప‌రిస్థితి అని ఆత్మ‌ప‌రిశీల‌న‌లో ప‌డిపోయింది. ఈ స‌మ‌యంలోనే కార్తీక్ ఆర్య‌న్ న‌టించిన `భూల్ బులాయ్యా 2` భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి బాలీవుడ్ ప‌రువు నిల‌బెట్టింది. తొలి రోజే రూ. 100 కోట్ల మేర వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో ఇక మ‌న టైమ్ మొద‌లైంద‌ని బాలీవుడ్ వ‌ర్గాలు భావించాయి. కానీ అది ఆరంభ శూర‌త్వ‌మే అని తేలిపోయింది. ఈ సినిమాతో ఎలాగైనా బాలీవుడ్ మ‌ళ్లీ గాడిలో ప‌డుతుంద‌ని అంతా భావించారు.

కానీ మ‌ళ్లీ అదే ప‌రిస్థితి పున‌రావృతం అవుతోంది. రీసెంట్ గా బాలీవుడ్ ఖిలాడీ అక్ష‌య్ కుమార్ న‌టించిన చారిత్రాత్మ‌క చిత్రం `స‌మ్రాట్ పృథ్వీరాజ్‌`. చంద్ర‌శేఖ‌ర్ ద్వివ్వేది ద‌ర్శ‌క‌త్వంలో య‌ష్ రాజ్ ఫిలింస్ సంస్థ‌లో ఆదిత్య చోప్రా అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ మూవీని నిర్మించారు.

మొహ‌మ్మ‌ద్ ఘోరీ పై వీరోచిత పోరాటం చేసిన పృథ్వీరాజ్ చౌహాన్ జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. మానుషీ చిల్ల‌ర్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీని జూన్ 3న భారీ స్థాయిలో విడుద‌ల చేశారు. 300 కోట్ల భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది కానీ ఆ స్థాయిలో మాత్రం వ‌సూళ్లని రాబ‌ట్ట‌లేక‌పోతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ రూ. 55 కోట్లు మేర మాత్ర‌మే వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింద‌ని, య‌ష్ రాజ్ ఫిలింస్ లో వ‌చ్చిన చిత్రాల్లో ఇంత దారుణంగా వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సినిమా మ‌రొక‌టి లేద‌ని, ఇది నిజంగా బాలీవుడ్ కు షాకేన‌ని చెబుతున్నారు. అంతే కాకుండా ఈ మూవీని చూడ‌టానికి థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రాక‌పోవ‌డంతో ప‌లు చోట్ల షోల‌ని ర‌ద్దు చేయ‌డం మ‌రింతగా బాలీవుడ్ ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది.

ఇక మ‌రి కొన్ని చోట్ల థియేట‌ర్ల‌లో అత్య‌ధిక భాగం సీట్లు ఖాలీగా వుండ‌టంతో థియేట‌ర్ యాజ‌మాన్యం ప‌లు షోల‌ని ర‌ద్దు చేసింద‌ని బాలీవుడ్ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా బాలీవుడ్ కు డేంజ‌ర్ బెల్స్ ని మోగించ‌డ‌మేన‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ద‌క్షిణాది సినిమాలు వేల కోట్లు వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ విస్మ‌యాన్ని క‌లిగిస్తున్న వేళ బాలీవుడ్ లో వంద‌ల కోట్ల‌తో నిర్మించిన సినిమాలు మాత్రం 50 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌లేక పోతుండ‌టం చిత్రంగా వుంద‌ని చెబుతున్నారు.