Begin typing your search above and press return to search.

ఓటీటీలో విచ్చలవిడి ఇక సాగదు..! దానికీ సెన్సార్​!

By:  Tupaki Desk   |   27 Nov 2020 3:30 PM GMT
ఓటీటీలో విచ్చలవిడి ఇక సాగదు..! దానికీ సెన్సార్​!
X
ఓటీటీలు అంటేనే విచ్చలవిడి ప్రసారాలకు మారుపేరుగా నిలిచిపోయాయి. ఓటీటీల్లో సెన్సార్​ లేకపోవడంతో దర్శకనిర్మాతలు రెచ్చిపోయి వెబ్​సీరిస్​లను తెరకెక్కిస్తున్నారు. ఓటీటీలో అద్భుతమైన వెబ్​సీరీస్​లు ఎన్నో వచ్చాయి.. ఇది కాదనలేని సత్యం.. అదేవిధంగా బూతు కంటెంట్​ కూడా పెరిగిపోయింది. ఇది యువతను పెడదోవ పట్టిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనికి చెక్​ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. త్వరలో ఓటీటీపై కూడా సెన్సార్​ పెట్టాలని చూస్తున్నది. ఓటీటీలను కేంద్ర సమాచారశాఖ కిందకు తెచ్చి త్వరలోనే సెన్సార్​ నిబంధనలను తీసుకురానున్నారు. ప్రస్తుతం డిజిటల్​ యుగం సాగుతున్నది. టీవీలో వస్తున్న వినోద కార్యక్రమాలు, సీరియళ్లు చూసి ప్రేక్షకులకు విసుగెత్తింది. అందుకే యువత ఇప్పుడు ఓటీటీ వెంట పడుతున్నది. ఇంతకాలం ఏ ఆప్షన్​ లేకపోవడం వల్ల యువత చచ్చినట్టు టీవీలో వచ్చిన ప్రోగ్రామ్స్​ చూసేవారు. చానళ్లు మారుస్తూ ఏదో ఓ చానళ్లలో కుదురుకుపోయేవారు. ఉన్నదాంట్లో బెటర్​ ఎంపికచేసుకొని చూసేవారు.

కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యువత వినోదం కోసం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు. అందులో ఉండే వెబ్​సీరీస్​లు వాళ్లను ఆకర్షిస్తున్నాయి. దీంతో టీవీల ముందు అతుక్కుపోకుండా ఓటీటీల వెంట పడుతున్నారు. ఓటీటీ సంస్థలు కూడా యువత అభిరుచిగా తగ్గట్టుగానే కంటెంట్​ను తయారుచేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో కొన్ని వెబ్​ సీరీస్​లలో శృంగారం శృతి మించుతోంది. బూతు పదాలు పెరిగిపోతున్నాయి. సెన్సార్​ చిక్కు లేకపోవడంతో రచయితలు, డైరెక్టర్లు కూడా చెలరేగిపోతున్నారు. తమ క్రియేటివిటీకి పదునుపెడుతున్నారు. దీంతో యువత పెడధోరణికి వెళ్లిపోతున్నారు. ఓటీటీలో నేర సంస్కృతి, బూతు పదాలు, శృంగారసన్నివేశాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. ఈ విషయంపై చాలాకాలంగా విమర్శలు వస్తున్నాయి. ఓటీటీపై కూడా సెన్సార్​ ఉండాలని కొందరు వాదిస్తున్నారు. ప్రస్తుతం అమెజాన్​, నెట్​ఫ్లిక్స్​, హాట్​స్టార్​, హంగామా, వూట్​, ఎంఎక్స్​ ప్లేయర్​ సహా మనదేశంలో దాదాపు 40 దాకా ఓవర్​ ద టాప్​ (ఓటీటీ) లు ఉన్నాయి. తెలుగులో ‘ఆహా’ అనే యాప్​ ఉన్నది.

అయితే శశాంక్​ శేఖర్​ ఝూ అనే ఓ లాయర్​ ఓటీటీల విశృంఖలత్వంపై ఇటీవల సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు. ఓటీటీలపై సెన్సార్​ ఉండాలని.. ఇందుకోసం ఓ స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని అతడు కోర్టుకు విన్నవించుకున్నాడు. ఈ విషయంపై సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఓటీటీలో సెన్సార్​ ఉండాలన్న విషయంపై కేంద్ర వైఖరి ఏమిటో చెప్పాలని సుప్రీం ఆదేశాలు జారీచేసింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఓటీటీలను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ మేరకు సర్కార్​ ఇచ్చిన గెజిట్​కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

కేబుల్ టీవీ నియంత్రణ చట్టం 1995లో టీవీల్లో ఎటువంటి కార్యక్రమాలు ప్రసారం చేయాలనే విషయంపై నిబంధనలు ఉన్నాయి. దాన్ని బట్టి ఓటీటీల్లో ప్రసారం చేయాల్సిన కార్యక్రమాలు, కంటెంట్​కు సంబంధించి కొన్ని నిబంధనలు పెట్టే అవకావం ఉన్నది. అయితే ప్రభుత్వం తీసుకొచ్చే ఈ విధానాన్ని పలువురు దర్శకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇలా చేయడం భావ ప్రకటనాస్వేచ్ఛను హరించడమేనని వారు వాదిస్తున్నారు. దీనిపై తాము కూడా కోర్టుకు వెళతామని చెబుతున్నారు. ప్రముఖ దర్శకుడు అంక్రితా శ్రీ వాత్సవ్​ ఈ విషయంపై స్పందిస్తూ అసలు సెన్సార్​ ఉండటమే ఓ తప్పుడు విధానం. అది ఎప్పుడో బ్రిటీష్​ కాలం నాటిది. సెన్సార్​నే తీసేయాలని మేము డిమాండ్​ చేస్తుంటూ ఇప్పుడు ఓటీటీలపై సెన్సార్​ పెట్టడం దారుణమైన విషయమని ఆయన పేర్కొన్నారు.