Begin typing your search above and press return to search.

ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌కు అనుమ‌తి లేదంతే!

By:  Tupaki Desk   |   17 Jun 2017 9:58 AM GMT
ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌కు అనుమ‌తి లేదంతే!
X
నిజ‌మే... సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ - మాజీ మంత్రి - కాపు ఐక్య‌వేదిక నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఇక‌పై పాద‌యాత్ర‌లు గ‌ట్రా చేయ‌లేరు. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌న్న డిమాండ్‌ తో గ‌డ‌చిన ఎన్నిక‌లు ముగిసిన ద‌గ్గ‌రి నుంచి పోరుబాట ప‌ట్టిన ముద్ర‌గ‌డ... రెండేళ్ల క్రితం ఆ పోరాటాన్ని ప‌తాక స్థాయికి చేర్చారు. తూర్పు గోదావ‌రి జిల్లా తునిలోని కొబ్బ‌రి తోటల్లో కాపు గ‌ర్జ‌న పేరిట ఏర్పాటు చేసిన కాపుల స‌భ విధ్వంసానికి దారి తీసిన సంగ‌తి తెలిసిందే. చంద్రబాబు స‌ర్కారు నాన్చుడు ధోర‌ణితో విసిగిపోయామ‌ని, ఇక‌పై రోడ్ల‌పైనే తేల్చుకుందామంటూ ముద్ర‌గ‌డ చేసిన వ్యాఖ్య‌లు అక్క‌డికి వ‌చ్చిన కాపు యువ‌త‌లో ఆగ్ర‌హావేశాల‌ను ర‌గిల్చాయి. ఓ వైపు స‌భ‌లో ఇంకా ప్ర‌సంగాలే మొద‌లు కాకుండానే ముద్ర‌గ‌డ చేసిన ఈ వ్యాఖ్య‌లతో అక్క‌డ ఉద్రేక‌పూరిత వాతార‌ణం నెల‌కొన‌గా... కాపులంతా రోడ్డెక్కేశారు. క‌నిపించిన వాహ‌నాల‌కు నిప్పు పెట్టేశారు. అటుగా వెళుతున్న ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్ నూ వారు వ‌ద‌ల‌లేదు.

ఇక త‌మ‌ను అదుపు చేసేందుకు వ‌చ్చిన పోలీసుల‌పై కాపు యువ‌త ప్ర‌తాపం చూపింది. క‌నిపించిన పోలీసు వాహ‌నాల‌కు నిప్పు పెట్ట‌డ‌మే కాకుండా ఏకంగా పోలీస్ స్టేష‌న్ల‌ను కూడా వారు బుగ్గి చేసేశారు. దీనిపై కాస్తంత ఆల‌స్యంగా మేల్కొన్న ప్రభుత్వం కేసులు న‌మోదు చేసి స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచార‌ణ బాధ్య‌త‌లు స్వీక‌రించిన సీఐడీ... వైసీపీ కీల‌క నేత భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి స‌హా మ‌రికొంద‌రిని విచారించింది. ఈ క్ర‌మంలో ఎప్పుడు ఉద్య‌మం చేస్తాన‌ని ముద్ర‌గ‌డ ప్ర‌క‌టించినా... తుని ఘ‌ట‌న‌ను తెర‌పైకి తెస్తున్న ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాక‌రిస్తూ వ‌స్తోంది. మొన్న‌టికి మొన్న ముద్ర‌గ‌డ చేప‌ట్టిన నిరాహార దీక్ష‌ను కూడా ప్ర‌భుత్వం ఇదే కార‌ణం చూపి అడ్డుకుంది. ఆ త‌ర్వాత కోన‌సీమ‌లో ముద్ర‌గ‌డ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు కూడా అనుమ‌తి నిరాక‌రించింది.

తాజాగా వ‌చ్చే నెల 26న అమ‌రావ‌తి యాత్ర పేరిట‌... త‌న సొంతూరు కిర్లంపూడి నుంచి న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి దాకా పాద‌యాత్ర నిర్వ‌హించాల‌ని ముద్ర‌గ‌డ త‌ల‌చారు. ఈ మేర‌కు కాపు ఐక్య వేదిక నుంచి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. అయితే తుని ఘ‌ట‌న‌ను మ‌రోమారు తెర‌పైకి తెచ్చిన చంద్రబాబు స‌ర్కారు ముద్ర‌గ‌డ అమ‌రావ‌తి యాత్ర‌కు కూడా నో చెప్పేసింది. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం మీడియా ముందుకు వ‌చ్చిన రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మ‌కాయ‌ల చిన‌రాజ‌ప్ప‌... ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌కు అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌ను దృష్టిలో పెట్టుకున్న కార‌ణంగానే ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌కు అనుమ‌తి ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడే కాకుండా ఇక భ‌విష్య‌త్తులోనూ ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌కు అనుమ‌తి ఇవ్వ‌బోమ‌ని చంద్ర‌బాబు స‌ర్కారు బ‌హిరంగంగానే ప్ర‌క‌టించిన‌ట్లైంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/