Begin typing your search above and press return to search.

బాహుబలి పైరసీ చేశారో...

By:  Tupaki Desk   |   17 July 2015 11:12 AM GMT
బాహుబలి పైరసీ చేశారో...
X
బాహుబలి పైరసీని ఆపాలన్న ఉద్దేశంతో విడుదలకు ముందు ఎంతో ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. ఎలా బయటికి వచ్చిందో తెలియదు కానీ.. బాహుబలి థియేటర్ ప్రింట్ మాత్రం ఆన్‌లైన్లో దర్శనమిచ్చింది. అంతే కాదు.. బయట సీడీలు కూడా తయారయ్యాయి. చాలామంది మొబైల్ ఫోన్లలోకి కూడా బాహుబలిని ఎక్కించేశారు. సినిమా విడుదలైన తొలి రోజే థియేటర్లలో షూట్ చేసిన ప్రింట్ ఇదని స్పష్టంగా తెలిసిపోతోంది. ఐతే బాహుబలి పైరసీ ప్రింట్ విస్తరించకుండా అభిమానులు, బాహుబలి నిర్మాతలు చేయాల్సిన ప్రయత్నమంతా చేస్తూనే ఉన్నా.. ఆన్ లైన్ పైరసీని ఆపడం మాత్రం కష్టమవుతోంది. ఐతే వ్యవహారాన్ని అంత తేలిగ్గా మాత్రం వదలట్లేదు బాహుబలి నిర్మాతలు.

బాహుబలి సినిమాను పైరసీకి బలికాకుండా చూడాలని హైదరాబాద్ స్థానిక కోర్టులో పిటిషన్ వేయగా.. దీనిపై విచారించిన కోర్టు బాహుబలి పైరసీ ప్రింట్‌ను ఆన్ లైన్ నుంచి తొలగించాలంటూ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, భారత ఎయిర్ టెల్ సహా ఇంటర్నెట్ ప్రొవైడర్లందరూ తక్షణం బాహుబలి పైరసీ లింకులు తొలగించాలని కోర్టు పేర్కొంది. ఎవరైనా బాహుబలి పైరసీ వెర్షన్‌ అప్లోడ్ చేయడం, డౌన్ లోడ్ చేయడం గమనిస్తే వాటిని నియంత్రించాలని.. ఇప్పటికే అలాంటి వెబ్ సైట్లు ఉంటే వాటిని బ్లాక్ చేయాలని, తొలగించాలని పేర్కొంది. ఇలాంటి ప్రయత్నాలకు ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.