Begin typing your search above and press return to search.

సైరా వివాదం: 100 ఏళ్ల‌ త‌ర్వాత క‌థ‌పై నో రైట్స్

By:  Tupaki Desk   |   3 July 2019 10:43 AM GMT
సైరా వివాదం: 100 ఏళ్ల‌ త‌ర్వాత క‌థ‌పై నో రైట్స్
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా `సైరా-న‌ర‌సింహారెడ్డి` అత్యంత భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ ప‌తాకంపై రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. టాకీ ఇప్ప‌టికే పూర్త‌యింది. నిర్మాణానంత‌ర ప‌నులు శర‌వేగంగా పూర్త‌వుతున్నాయి. సీజీ వర్క్స్ ని అత్యంత ఛాలెంజింగ్ గా చేస్తున్నార‌ని తెలుస్తోంది. అక్టోబ‌ర్ లో ఈ భారీ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కి స‌న్నాహాలు చేస్తున్నారు.

అయితే రిలీజ్ ముంగిట `సైరా` క‌థా హక్కుల ఒప్పందం విష‌య‌మై ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి కుటుంబ స‌భ్యులు ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ మేనేజ‌ర్ కొణిదెల కార్యాల‌యంలోకి రాకుండా అడ్డుకుంటున్నార‌ని చ‌ర‌ణ్ - చిరు న్యాయం చేస్తార‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని మీడియా ముఖంగా స‌ద‌రు ఫ్యామిలీ మెంబ‌ర్స్ అన్నారు. ఉయ్యాల వాడ క‌థ‌తో పాటు త‌మ గ్రామంలో ప్రాప‌ర్టీని ఉప‌యోగించుకున్న చిత్ర‌యూనిట్ త‌మ‌ను చ‌ర‌ణ్ ని క‌ల‌వ‌నివ్వ‌డం లేద‌ని ఆరోపించారు.

అయితే సైరా నిర్మాత‌ల‌ త‌ర‌పు నుంచి ఏదైనా మిస్టేక్ ఉందా? అని ఆరాతీస్తే.. ఉయ్యాల వాడ కుటుంబ స‌భ్యులు తొలుత చేసుకున్న ఒప్పందానికి అతీతంగా కోట్ల‌లో డిమాండ్ చేస్తున్నార‌ని... వేరొక కోణం గురించిన ముచ్చ‌టా సాగింది. అయితే ఈ వివాదం విష‌యంలో కొణిదెల టీమ్ ఇంత‌వ‌ర‌కూ స్పందించ‌లేదు. వాస్త‌వానికి క‌థా హ‌క్కుల చ‌ట్టం ఏం చెబుతోంది? అంటే.. ర‌చ‌యిత లేదా క‌థా హ‌క్కుదారు(య‌జ‌మాని) మ‌ర‌ణించిన 70 ఏళ్ల త‌ర్వాత ఆ క‌థ‌పై ఎలాంటి హ‌క్కు కుటుంబ స‌భ్యుల‌కు ఉండ‌దు. 70 ఏళ్ల లోపు మాత్ర‌మే అవ‌త‌లివారిపై కేసు వేసి రైట్స్ ని పొందే వెసులు బాటు ఆ రైట‌ర్ లేదా య‌జ‌మాని కుటుంబ స‌భ్యుల‌కు ఉంటుంద‌ని చ‌ట్టం చెబుతోంది. అమెరికా లాంటి చోట్ల ఇప్ప‌టికీ ఇదే అమ‌ల్లో ఉంది. భార‌త‌దేశంలోనూ ఇంచుమించు అదే చ‌ట్టం ఉంది. హిస్ట‌రీని చూస్తే.. 22 ఫిబ్ర‌వ‌రి 1847లో ఉయ్యాల వాడ న‌ర‌సింహారెడ్డి మ‌ర‌ణించారు. ఆ ప్ర‌కారం చూస్తే.. ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి కాలం చేసి ఇప్ప‌టికే వందేళ్లు పైగానే అయ్యింది. 100 ఏళ్ల త‌ర్వాత క‌థా హ‌క్కులపై ఎవ‌రికీ రైట్స్ ఉండ‌వు. అయినా ఎలాంటి లాలూచీ ఉండ‌కూడ‌ద‌నే న‌ర‌సింహారెడ్డి కుటుంబ స‌భ్యుల‌తో ముంద‌స్తుగానే కొణిదెల కంపెనీ చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన‌ ఒప్పందం చేసుకుంది. న్యాయ‌బ‌ద్ధంగానే ఆ కుటుంబంతో చిత్ర‌యూనిట్ మెలుగుతోంద‌ని తెలుస్తోంది.