Begin typing your search above and press return to search.

ఆ సినిమాను చంపేస్తున్నారు..

By:  Tupaki Desk   |   4 July 2015 3:30 PM GMT
ఆ సినిమాను చంపేస్తున్నారు..
X
ఇంకో వారం రోజుల్లో బాహుబలి వస్తుండటంతో ఈ వారం ఇంకే పెద్ద సినిమా కూడా విడుదల కాలేదు. కనీసం మీడియం రేంజి సినిమాలు కూడా లేవు. ఈ శుక్రవారం డైరెక్ట్‌ తెలుగు సినిమాలే అరడజను దాకా విడుదలయ్యాయి. డబ్బింగ్‌వి ఇంకో రెండు. ఐతే ఈ ఏడు చిన్న సినిమాల్లో కొంచెం క్రేజ్‌ ఉన్న సినిమా అంటే.. సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌ మాత్రమే. మిగతా సినిమాల్లో ఎవరు హీరో, ఎవరు డైరెక్టర్‌ అన్నది కూడా జనాలకు పట్టట్లేదు. నందు, ఆదర్శ్‌, వెన్నెల కిషోర్‌ లాంటి కొంచెం ఫేమ్‌ ఉన్న ఆర్టిస్టులు నటించడం.. ప్రోమోస్‌ కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ వారం ఆడియన్స్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ 'సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌' సినిమానే అయింది.

ఐతే దారుణమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు దొరకలేదు. ముఖ్యంగా నైజాం ఏరియాలో పరిస్థితి ఘోరం. హైదరాబాద్‌ లాంటి పెద్ద సిటీ మొత్తంలో ఐదంటే ఐదు థియేటర్లే ఇచ్చారు. ఆ ఐదు థియేటర్లలో నాలుగు షోలు పడుతోంది ఒక్క థియేటర్‌లో మాత్రమే. మిగతా నాలుగు థియేటర్లలో ఒక్కో షో మాత్రమే వేస్తున్నారు. ఐతే రోజు మొత్తంలో 8 షోలు మాత్రమే పడతాయన్నమాట. నిన్న విడుదలైన ఏడు సినిమాల్లో పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఏకైక సినిమా ఇదే అయినా.. రెండో రోజుకు కూడా పరిస్థితిలో ఏ మార్పూ లేదు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. 'బస్తీ' సినిమా మీద జనాలకు ఏమాత్రం ఆసక్తి లేకపోయినా.. హైదరాబాద్‌లో 30కి పైగా థియేటర్లిచ్చారు. తొలి రోజు ఆ సినిమా నడుస్తున్న హాళ్లన్నీ ఖాళీయే. పైగా దీనికి డిజాస్టర్‌ టాక్‌ వచ్చింది. రెండో రోజు కొన్ని థియేటర్లు ఖాళీ చేసి.. 'సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌'కు ఇస్తారేమో అనుకుంటే అలాంటిదేమీ జరగలేదు. సినిమాకు మంచి టాక్‌ వచ్చింది కదా.. చూద్దాం అని ఆడియన్స్‌ అనుకున్నా.. సినిమా అందుబాటులో లేదు. ఇంకొన్ని రోజులు ఆగడానికి కూడా అవకాశం లేదు. బాహుబలి వచ్చేస్తోంది. మొత్తానికి పర్వాలేదు అనిపించుకున్న సినిమా ఇలా కిల్‌ అయిపోతోంది.