Begin typing your search above and press return to search.

ఇక్కడా స్పైడరే.. అక్కడా స్పైడరే

By:  Tupaki Desk   |   2 Jun 2017 10:59 AM GMT
ఇక్కడా స్పైడరే.. అక్కడా స్పైడరే
X
‘రోబో’ సినిమా దేశమంతటా ‘రోబో’నే. కానీ తమిళనాట మాత్రం అది ‘యందిరన్’. ‘బ్రదర్స్’ పేరుతో తెలుగులో రిలీజైన సూర్య సినిమా.. తమిళంలో మాత్రం ‘మాట్రన్’ పేరుతో విడుదలైంది. ఇలాంటి ఉదాహరణలు మరెన్నో ఉన్నాయి. తమిళ సినిమాలకు తమిళంలో పేరు పెడితే.. వాటికి పన్ను మినహాయింపు రావడమే అందుక్కారణం. అందుకే ఇక తప్పదనుకుంటే తప్ప తమిళ టైటిల్ పెట్టే అవకాశాన్ని వదులుకోరు తమిళ ఫిలిం మేకర్స్. ఒకప్పుడు కేవలం తమిళ టైటిల్ పెడితే సరిపోయేది కానీ.. కొన్నేళ్ల కిందట పన్ను మినహాయింపు కోసం ‘క్లీన్ యు’ సర్టిఫికెట్ కూడా ఉండాలని నిబంధన తెచ్చింది తమిళనాడు ప్రభుత్వం. దాని ప్రకారమే నడుచుకుంటూ వెళ్తోంది తమిళ సినీ పరిశ్రమ. కానీ జీఎస్టీ పుణ్యమా అని ఈ మినహాయింపులకు తెరపడబోతోంది. ఇక తమిళ టైటిల్ పెట్టినా ఒకటే.. ఇంగ్లిష్ టైటిల్ పెట్టినా ఒకటే.

ఈ నేపథ్యంలో మురుగదాస్ మహేష్ బాబుతో తెలుగు.. తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న సినిమాను రెండు చోట్లా ఒకే పేరుతో విడుదల చేసే అవకాశం కలుగుతోంది. తెలుగు వెర్షన్‌ కు రెండు నెలల కిందటే ‘స్పైడర్’ అనే పేరు ఖరారు చేసిన మురుగదాస్.. తమిళ వెర్షన్ టైటిల్ విషయంలో మాత్రం అయోమయంలో ఉన్నాడు. ఇది యాప్ట్ టైటిల్ కావడంతో.. తమిళం కోసం దానికి సమానార్థకమైన పేరు ఏం పెడదామా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాడు. అందుకే ఇప్పటిదాకా తమిళంలో టైటిల్.. లోగో ప్రకటించలేదు. ఇంతలోనే జీఎస్టీ గురించి సమాచారం బయటికి వచ్చింది. ముందు అనుకున్నట్లు జూన్ లేదా జులై లేదా ఆగస్టులో సినిమా రిలీజ్ చేయాల్సి వస్తే తమిళ టైటిల్ పెట్టి మినహాయింపు అందుకునేవారు. కానీ ఈ చిత్రం సెప్టెంబరుకు వాయిదా పడటంతో.. అప్పటికి జీఎస్టీ అమల్లోకి వచ్చేస్తుంది కాబట్టి టైటిల్ గురించి చింత అవసరం లేదు. ‘స్పైడర్’నే కొనసాగించేయొచ్చు. మొత్తానికి జీఎస్టీ వల్ల పన్ను మినహాయింపు పోతున్నప్పటికీ తమిళ టైటిల్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేకుండా పోయింది మురుగకు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/