Begin typing your search above and press return to search.

శ్రీమంతుడు వీరికిచ్చిందెం లేదు

By:  Tupaki Desk   |   7 Aug 2015 12:49 PM GMT
శ్రీమంతుడు వీరికిచ్చిందెం లేదు
X
సంపదలో కాదు గుణాన్ని బట్టే శ్రీమంతుడు అంటూ నేడు మన ముందుకొచ్చింది శ్రీమంతుడు సినిమా. ఇందులో మహేష్ శ్రీమంతుడిగా కోరిందల్లా అందరికీ ఇస్తూవచ్చారు. ఈ సినిమాలో నటించిన వారికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. ఇదేం చోద్యం అంటారా.. ఓసారిది చదవండి.

సామాజిక కథాంశంతో, వాణిజ్య విలువలతో సాగిన ఈ సినిమాలో ఓ ముగ్గురు ముఖ్య నటులకుకి సరైన పాత్రలు దక్కలేదు. వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది యువ హీరో రాహుల్ రవీంద్రన్ గురించి. అందాల రాక్షసి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇతగాడు తాజాగా అలా ఎలా సినిమాతో మంచి హిట్ కొట్టాడు. సోలో హీరో గా నటించిన మరో సినిమా హైదరాబాద్ లవ్ స్టొరీ విడుదలకు సిద్ధంగా వుంది. ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న రాహుల్ కి శ్రీమంతుడు సినిమాలో సరైన పాత్ర లభించలేదు. రెండు సన్నివేశాలు, ఒక చెంపదెబ్బకే పరిమితమవ్వాల్సిన దుస్థితి.

తర్వాత చెప్పుకోవాల్సింది విలన్ కమ్ కారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు. సాధారణంగా దర్శకుడు పూరి సినిమాల్లో కనిపించే సుబ్బరాజుకి గత కొంత కాలంగా సరైన సినిమాలు లేవు. ఈ సినిమాలో సుబ్బరాజు చేసిన పాత్ర ఇప్పటివరకు అతను చేసిన పాత్రలతో పోలిస్తే భిన్నమైనదే. అయినా ఏం లాభం..? హ్యాంగర్ పక్కనే మేకు కొట్టినట్టు అయిపోయింది. సుబ్బరాజుని సరిగ్గా వాడుకునుంటే ఈ సినిమాలో గుర్తుంచుకునే మరో మంచి పాత్ర అయ్యేదనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

చివరాఖరుగా చెప్పుకోవాల్సింది పూర్ణ గురించి.. వచ్చిన ఒకటి రెండు సినిమాల్లోనైన హీరోయిన్ గా తన ముచ్చట తీర్చుకుంటున్న పూర్ణ ఈ సినిమాలో మొదటి పాటలో మహేష్ తో కాలు కదిపింది. ఆగడు సినిమాలో శృతి హాసన్ అయిదు నిమిషాల పాటతో ఆదరగొట్టేసింది. ఇందులో పూర్ణకి ఆ అవకాశం లేదు సరికదా... కనీసం ఒక్క నిమిషం కూడా స్క్రీన్ మీద కనపడలేదు. మహేష్ సినిమాలో పూర్ణ పాటలో నర్తిస్తుందంటే ఖచ్చితంగా ఐటెం సాంగే అని ఫిక్స్ అయిన ప్రేక్షకులు బోలెడుమంది. వారందరికీ నిరాశే.

ఆ లెక్కన శ్రీమంతుడు వీరికి ఏమిచ్చాడో మీరే చెప్పండి.. మహేష్ తో నటించామన్న ఓ జ్ఞాపకం తప్ప. సుకన్య, అలీ లదీ అదే పరిస్థితి.