Begin typing your search above and press return to search.

4 రోజులు నిద్రపోకుండా షూటింగ్ చేసిన 'బాహుబలి మనోహరి'

By:  Tupaki Desk   |   2 March 2021 4:30 AM GMT
4 రోజులు నిద్రపోకుండా షూటింగ్ చేసిన బాహుబలి మనోహరి
X
బిగ్ బాస్ సీజన్-9 తో ఫేమస్ అయిన కెనడియన్ బ్యూటీ నోరా ఫతేహీ.. ఐటమ్ సాంగ్స్‌ లో ఆడిపాడుతూ స్పెషల్‌ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా పలు ప్రత్యేక గీతాల్లో నర్తించిన ఈ ముద్దుగుమ్మ ఇక్కడి ప్రేక్షకులకు కూడా పరిచయమైంది. 'టెంపర్' సినిమాలో 'ఇట్టాగే రెచ్చిపోతా' సాంగ్ లో రెచ్చిపోయిన నోరా.. 'బాహుబలి'లో 'మనోహరి' పాటలో వయ్యారాలు పోతూ ఆడియన్స్ ని చుట్టేసింది. ఆ తర్వాత 'లోఫర్' 'కిక్ 2' 'షేర్' 'ఊపిరి' వంటి సినిమాల్లో స్పెషల్ నెంబర్స్ లో స్టెప్పులేసింది. ప్రస్తుతం పలు హిందీ సినిమాల్లో నటిస్తున్న ఈ భామ ఓ ప్రైవేట్ ఆల్బమ్ కోసం 4 రోజులుగా నిద్ర పోలేదని తెలుస్తోంది.

ఇటీవల అరవిందర్‌ ఖైరా దర్శకత్వంలో నోరా ఫతేహీ 'చోడ్ దేంగే' అనే సాంగ్‌ చేసింది. టీ-సిరీస్ వారు యూట్యూబ్‌ లో విడుదల చేసిన ఈ మ్యూజిక్ వీడియో ఒక్క రోజులోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్‌ దక్కించుకుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షూట్ కి సంబంధించిన ఓ వీడియో పోస్ట్ చేసిన నోరా.. పని ఒత్తిడి కారణంగా కొంత అలిసిపోయినట్లు పేర్కొంది. ''నాలుగు రోజులుగా కంటి నిండా నిద్ర పోకుండా షూటింగ్‌ చేస్తున్నాం. తర్వాత హాయిగా ఓ కునుకు తీయాలి" అని నోరా చెప్పుకొచ్చింది. అయితే నోరా నిద్రలేని రాత్రుళ్లు గడపడమే కాకుండా రాజస్తాన్‌ ఎడారుల్లో బంజారాల డ్రెస్సింగ్‌ స్టైల్‌ భారీ లెహంగాలు ధరించి నిప్పుల ముందు డ్యాన్స్‌ చేసినట్లు ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. షూటింగ్ కోసం ఈ మనోహరి ఇంతలా కష్టపడిందని నెటిజన్స్ ఆమెను అభినందిస్తున్నారు.