Begin typing your search above and press return to search.

సౌత్ సినిమాలతో పోల్చుతూ బాలీవుడ్ ను ట్రోల్ చేస్తున్న నార్త్ ఆడియన్స్..!

By:  Tupaki Desk   |   1 April 2022 1:30 AM GMT
సౌత్ సినిమాలతో పోల్చుతూ బాలీవుడ్ ను ట్రోల్ చేస్తున్న నార్త్ ఆడియన్స్..!
X
బాలీవుడ్ లో హిందూ సంప్రదాయాలను కించపరుస్తూ.. వివాదాస్పద సీన్స్ తో హిందువుల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని సినిమాలపై అభ్యంతరాలు వ్యక్తమైన సందర్భాలు చాలానే ఉన్నాయి. కావాలనే ఇలా టార్గెట్ చేసి సినిమాలు చేస్తున్నారంటూ గతంలో పలువురు హిందీ ఫిలిం మేకర్స్ పై ఆరోపణలు, విమర్శలు వచ్చాయి.

ఆ మధ్య అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రసారమవుతున్న 'తాండవ్' వెబ్ సిరీస్ లో హిందూ దేవతలను కించపరిచారని బీజేపీ నాయకులు - హిందూవాదులు మండిపడ్డారు. 'ఆశ్రమ్' వెబ్ సిరీస్ పై కూడా అలాంటి వివాదమే చెలరేగింది. 'పీకే' 'లూడో' వంటి కొన్ని సినిమాల్లో హిందూ దేవుళ్లను సంప్రదాయాలను కించపరిచేలా సీన్స్ పెట్టారంటూ విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ ఫిలిం మేకర్స్ రూపొందించే సినిమాలు - వెబ్ సిరీస్ లపై ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతుంటే.. దక్షిణాది చిత్రాల్లో మాత్రం హిందూ దేవుళ్లను, సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పడానికి కృషి చేస్తున్నారని మన మేకర్స్ పై ఉత్తరాది ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

'ఆర్.ఆర్.ఆర్' సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి ఇదే చర్చ జరుగుతోంది. ఇందులో రామ్ చరణ్ - అలియా భట్ పాత్రల్లో నార్త్ ఆడియన్స్ రాముడు - సీతలను చూసుకుంటున్నారు. 'బాహుబలి' సినిమాలో శివుడిని చూపించిన రాజమౌళిని కొనియాడుతున్నారు.

అదే సమయంలో హిందీ ఫిలిం మేకర్స్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ తో నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు. బాలీవుడ్ ను బాయ్ కాట్ చేయాలంటూ మన సినిమాలతో కంపేర్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇటీవల 'అఖండ' సినిమా విడుదల సమయంలో కూడా ఇదే అంశం నెట్టింట చర్చనీయాంశమైంది.

'అఖండ' సినిమాలో నందమూరి బాలకృష్ణ చేసిన అఘోర పాత్ర నార్త్ ఆడియన్స్ ను విపరీతంగా నచ్చింది. హిందూ దేవుళ్లు - ఆలయాల పరిరక్షణ - సంస్కృతి సంప్రదాయాల గురించి ఈ సినిమాలో గొప్పగా చెప్పారని ప్రశంసించారు. ఓటీటీలో స్ట్రీమింగ్ కి పెట్టిన తర్వాత ఈ సినిమాను ఉత్తరాది ప్రేక్షకులు ఎక్కువగా చూసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే 'అఖండ' సినిమాని హిందీలో రీమేక్ చేయాలని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు మరోసారి బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ను ట్రోల్ చేస్తూ పెద్ద ఎత్తున ట్వీట్లు పెడుతున్నారు. సౌత్ వాళ్ళని చూసి నేర్చుకోవాలంటూ దుయ్యపడుతున్నారు.