Begin typing your search above and press return to search.

'ఆహా'నే కాదు.. త్వరలో ఆ టాక్ షోకూ పవన్ కల్యాణ్?

By:  Tupaki Desk   |   31 Dec 2022 1:30 PM GMT
ఆహానే కాదు.. త్వరలో ఆ టాక్ షోకూ పవన్ కల్యాణ్?
X
టాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్టర్లలో పవన్ కల్యాణ్ ఒకరు. ముందు తరంలోని చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్ లను మినహాయిస్తే.. ఈ తరంలో పవన్, మహేశ్, ప్రభాస్ టాప్ స్టార్లు. వీరిలో పవన్ తప్ప అందరూ టాక్ షోలకు హాజరైనవారే. వివిధ చానెళ్లలో జరిగే షోలకు ప్రభాస్ తక్కువగా వెళ్తుంటారు. అలాంటిది అతడు తాజాగా ఓ పెద్ద షోకు హాజరై అభిమానులను అలరించాడు. ఇక మిగిలింది పవన్ కల్యాణ్ మాత్రమే. అయితే, ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని ప్రజాక్షేత్రంలో ఉన్నందున ఏం చెప్పినా చర్చనీయాంశం అవుతుంది. కాగా, పవన్ త్వరలో అత్యంత ఆదరణ పొందిన టాక్ షోకు రానున్నట్లు స్పష్టమైంది. దీంతో ఆయన కూడా టాక్ షోలో పాల్గొన్నవారి జాబితాలో చేరనున్నారు.

మిగిలింది అదే.. సొంత కుటుంబ సభ్యుడికి చెందిన చానెల్ లో, టాలీవుడ్ స్టార్ బాలక్రిష్ణ ప్రయోక్తగా ఉన్న షోకు పవన్ హాజరు చర్చనీయాంశం అవుతోంది. ఈ షో సంక్రాతి పండుగ సందర్భంగా ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. అసలే సంక్రాంతి.. ఆంధ్రాలో గొప్పగా జరుపుకొనే పండుగ. ఆపై బాలయ్య-పవన్ షో ప్రసారం. దీంతో బొమ్మ దద్దరిల్లిడం ఖాయం అనే అంచనాలు వస్తున్నాయి. వీటిని బాలయ్య-పవన్ ఎపిసోడ్ అందుకుంటుందనే చెప్పొచ్చు. ఇక ఈ షో అయిపోతే మిగిలింది తెలుగులో ప్రధాన పత్రిక, టీవీ చానెల్ అధినేత నిర్వహించే షో. దానిలోనూ పవన్ పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంప్రదింపులు కూడా జరిగినట్లు చెబుతున్నారు. పవన్ సోదరులు చిరంజీవి, నాగబాబు, వారి కుటుంబానికి చెందిన రామ్ చరణ్ సైతం ఈ షోలో పాల్గొన్నవారే. కానీ, పవన్ మాత్రమే ఇన్నాళ్లూ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఆయనను సంప్రదించడం..

పాల్గొనేందుకు ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. రాజకీయంగానూ సంచలనమే జనసేన పేరిట పార్టీ పెట్టి ఏపీలో సొంతంగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్న పవన్ కల్యాణ్ కు వచ్చే ఎన్నికలు అత్యంత కీలకం. తాను గెలవడమే కాక పార్టీని అధికారంలోకి తీసుకురావడమూ ముఖ్యమే. అయితే, అటు జగన్ సారథ్యంలోని వైసీపీ, ఇటు చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీని తట్టుకుంటూ ఆయన ఈ పనిచేయాలి. 2024 ఎన్నికలకు సంబంధించి రాజకీయంగా ఎలాంటి వ్యూహం అనుసరించబోతున్నారో పవన్ ఇంతవరకు స్పష్టం చేయలేదు. మరోవైపు ఆయన వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వం అంటున్నారు. దీంతో టీడీపీతో కలిసి వెళ్తారా? బీజేపీ నుంచి రూట్ మ్యాప్ పొంది ముందుకెళ్తారా? అనేది చర్చనీయాంశం అవుతోంది. మరోవైపు తెలుగు ప్రముఖ మీడియా అధినేత నిర్వహించే ఆ టాక్ షో లో పవన్ పాల్గొనడమూ కీలక పరిణామంగా మారుతోంది. ఆ మీడియా తెలుగు దేశం పార్టీకి కొంత అనుకూలమనే ప్రచారం జరుగుతుండడమే దీనికి కారణం. అయితే, ఆ మీడియా అధినేత ఇంటర్వ్యూల్లో ఇలాంటి వాతావరణమేమీ కనిపించకుండా ఉంటుంది. ఆయన అడిగే ప్రశ్నలు పార్టీలకు అతీతంగా నేరుగానే ఉంటాయి. మరి పవన్ కల్యాణ్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో చూడాలి.

కొసమెరుపు.. : చిత్రమేమంటే.. మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి, ఆ మీడియా సంస్థకు మధ్య మొదట్నుంచి పిల్లి-ఎలుకలాంటి పరిస్థితి. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నట్లుగా తెలిసి విపరీతమైన కవరేజీ ఇచ్చింది ఆ మీడియా సంస్థ ప్రతిక. కానీ, తదనంతర పరిస్థితుల్లో వ్యవహారం చెడింది. రెండేళ్ల వ్యవధిలోనే చిరంజీవి అభిమానులు ఆ సంస్థ కార్యాలయంపై దాడి చేశారు. అయితే, ఐదేళ్ల కిందట అదే కార్యాలయం మంటల్లో చిక్కుకుంటే పవన్ కల్యాణ్ నేరుగా వెళ్లి పరిశీలించారు. ఇప్పుడు సంబంధాలు ఎలా ఉన్నాయో పైకి తెలియకున్నా.. మొత్తంమీద చూస్తే అంత సజావుగా మాత్రం సాగలేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.